జడ్పీ స్థాయీ సంఘాల ఏర్పాటుకు కసరత్తు

ABN , First Publish Date - 2021-10-28T05:13:48+05:30 IST

జిల్లా పరిషత స్టాండింగ్‌ కమిటీల ఏర్పాటుకు జడ్పీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

జడ్పీ స్థాయీ సంఘాల  ఏర్పాటుకు కసరత్తు

  1.  ఎన్నికల అనంతరం ప్రక్రియ పూర్తి చేసే అవకాశం
  2.  మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు చోటు


కర్నూలు(న్యూసిటీ), అక్టోబరు 27: జిల్లా పరిషత స్టాండింగ్‌ కమిటీల ఏర్పాటుకు జడ్పీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత నెల 25న జిల్లా పరిషత నూతన పాలకవర్గం ఏర్పడింది. వివిధ కారణాలతో ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అనంతరం ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా పరిషత పరిధిలో ఏడు స్టాండింగ్‌ కమిటీల్లో (స్థాయీ సంఘాలు) జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు జడ్పీటీసీలు కూడా సభ్యులుగా ఉంటారు. జిల్లా పరిషత చైర్మన కనీసం మూడు స్థాయి సంఘాలకు చైర్మనగా వ్యవహరిస్తారు. వైస్‌ చైర్మన 3వస్థాయి సంఘానికి చైర్మనగా, మహిళా సంక్షేమానికి సంబంధించిన స్థాయీ సంఘానికి మహిళా జడ్పీటీసీని, సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన 6వ స్థాయీసంఘానికి ఆయా సామాజిక వర్గాలకు చెందిన జడ్పీటీసీలను చైర్మనగా ఎన్నుకుంటారు. మిగతా సంఘాలకు కూడా జడ్పీటీసీలను చైర్మన్లుగా ఎన్నుకుంటారు. వివిధశాఖల కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేసేందుకు స్థాయి సంఘాల సమావేశాల్లో తీర్మానం చేస్తారు. 

ఎన్నికల అనంతరం నిర్వహిస్తాం

స్థాయీసంఘాల సమావేశాలను జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అనంతరం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. సభ్యులను జడ్పీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. సమావేశాల్లో అభివృద్ధి పనులపై చర్చించేందుకు అవకాశం ఉంటుంది. 

- మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, జిల్లా పరిషత చైర్మన




Updated Date - 2021-10-28T05:13:48+05:30 IST