వ్యాయామమే నా ఫిట్‌నెస్‌ రహస్యం

ABN , First Publish Date - 2022-08-22T17:57:40+05:30 IST

‘‘నా వయస్సు అరవై తొమ్మిదేళ్లని చెబితే ఎవరూ నమ్మటం లేదు. నా కుమారుడు ఉదయనిధితో కలిసి వెళ్తే చాలామంది మీరిద్దరు సోదరులా అని అడుగుతున్నారు. వీటన్నింటికీ కారణం

వ్యాయామమే నా ఫిట్‌నెస్‌ రహస్యం

ఉదయనిధి తమ్ముడా అని అడుగుతున్నారు  

‘హేప్పీ స్ట్రీట్స్‌’ వేడుకల్లో సీఎం స్టాలిన్‌


చెన్నై: ‘‘నా వయస్సు అరవై తొమ్మిదేళ్లని చెబితే ఎవరూ నమ్మటం లేదు. నా కుమారుడు ఉదయనిధితో కలిసి వెళ్తే చాలామంది మీరిద్దరు సోదరులా అని అడుగుతున్నారు. వీటన్నింటికీ కారణం వీలుచిక్కినప్పుడల్లా వ్యాయామం చేయడమే. ఇదే నా ఫిట్‌నెస్‌ రహస్యం’’ అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. స్థానిక అన్నానగర్‌ ప్రాంతంలో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌, గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనరేట్‌, ఓ ఆంగ్లపత్రిక నిర్వాహకులు సంయుక్తంగా ‘హ్యాపీ స్ట్రీట్స్‌’ పేరుతో ఆదివారం ఉదయం నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సీఎం కొద్దిసేపు సైక్లింగ్‌ చేసి, బాస్కెట్‌బాల్‌ ఆడారు. 


అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో భాగంగా ప్రతిరోజూ గ్రామీణ సాంస్కృతిక కార్యక్రమాలు, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, టెన్నిస్‌, సైక్లింగ్‌ శిక్షణ వంటి దేహదారుఢ్యాన్ని పెంచే కార్యక్రమాలను నిర్వహిస్తుండటం హర్షణీయమన్నారు. హ్యాపీ స్ట్రీట్స్‌ ఆటపాటలు మాత్రమే ఉంటాయని భావించానని, అయితే గత మూడు నెలలుగా మూడు సంస్థలు కలిసి ప్రజల్లో వ్యాయామంపై అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుండటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నగరమంతటా వారాంతపు సెలవు దినాల్లో నిర్వహిస్తే మంచిందని సూచించారు.. ప్రస్తుతం తన వయస్సు 69 సంవత్సరాలని చెబితే ఆశ్చర్యపోతున్నారని, దేహదారుఢ్యానికి తాను తీసుకుంటున్న జాగ్రత్తల వల్లే చురుగ్గా ఉండగలుగుతున్నానని వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడితో కలిసి బయటివూళ్లకు వెళితే చాలామంది  అన్నదమ్ములా అని అనుకుంటున్నారన్నారు.


అదే సమయంలో వయసు పెరుగుతున్నా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారనియమాలను కూడా పాటించాలన్నారు. ఒక రోజు ఉదయం జిమ్‌కు వెళ్ళి గంటసేపు వ్యాయామం చేస్తే, మరుసటి రోజు ఉదయం గంటసేపు యోగా చేస్తానని, సాయంత్రం ఐదు కి.మీ.ల వరకూ వాకింగ్‌ చేస్తానన్నారు. ఇవే తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కారణాలని ఆయన వివరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ వ్యాయామం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు ఎంకే మోహన్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీ్‌పసింగ్‌ బేదీ, గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌  పాల్గొన్నారు.

Updated Date - 2022-08-22T17:57:40+05:30 IST