ఎగ్జిబిషన్‌ స్థల వివాదం

ABN , First Publish Date - 2021-03-02T05:50:36+05:30 IST

దురాజ్‌పల్లి జాతర వచ్చిందంటే ఏదో ఒక లొల్లి. ప్రస్తుతం ఎగ్జిబిషన్‌కు కేటాయించిన స్థలం కంటే అధికంగా వాడుకున్నారని మునిసిపల్‌ అధికారులు నోటీసులు జారీ చేయడంతో గొడవ ప్రారంభమైంది.

ఎగ్జిబిషన్‌ స్థల వివాదం

(ఆంధ్రజ్యోతి సూర్యాపేట)

దురాజ్‌పల్లి జాతర వచ్చిందంటే ఏదో ఒక లొల్లి. ప్రస్తుతం ఎగ్జిబిషన్‌కు కేటాయించిన స్థలం కంటే అధికంగా వాడుకున్నారని మునిసిపల్‌ అధికారులు నోటీసులు జారీ చేయడంతో గొడవ ప్రారంభమైంది. నాలుగు ఎకరాల స్థలం కేటాయించి రూ.25లక్షల 25 వేలకు టెండరు దక్కించుకున్న వ్యక్తికి అందజేశారు. అయితే నాలుగు ఎకరాలు కాకుండా ఆరు ఎకరాల్లో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి అక్కడ కొన్ని దుకాణాలు అనధికారికంగా నిర్వహిస్తున్నారని కమిషనర్‌ రామాంజులరెడ్డి దృష్టికి రావడంతో రెండు ఎకరాలకు రూ.12లక్షల 2500 సోమవారం ఉదయం చెల్లించాలని నోటీసు ఇచ్చారు. లేకుంటే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. అయితే నోటీస్‌కు ఎగ్జిబిషన్‌ నిర్వాహకుడు సనా అమ్యూజ్‌మెంట్‌ రైడ్స్‌ అధినేత మీర్జా రఫీక్‌బేగ్‌ సమాధానమిచ్చారు. అగ్రిమెంట్‌లో స్థలాన్ని మార్క్‌ చేయలేదని పేర్కొన్నారు. అగ్నిమాపక, పోలీస్‌ అధికారుల సూచనల మేరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండకుండా స్వేచ్ఛగా ఉండేలా ఎక్కువ స్థలం ఏర్పాటు చేశామని, అంతేకానీ నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. కొవిడ్‌ దృష్ట్యా ఖాళీ స్థలం ఎక్కువగా ఉండేలా ఏర్పాటు చేశామన్నారు.


అధికార పార్టీ నేతల ఒత్తిడి

అధికార పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలు అధికారులకు తలనొప్పిగా మారాయి. ఎగ్జిబిషన్‌ సొసైటీకి కేటాయించిన నాలుగు ఎకరాల్లో ఇతర దుకాణాలు ఏర్పాటు చేసి ఎలా అమ్ముకున్నారని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కమిషనర్‌తో గొడవలకు దిగారు. అయితే స్థలాన్ని రూ.25లక్షలకుపైగా కేటాయించినందున అతడికి అమ్ముకోవడానికి హక్కు ఉంటుందని అధికారులు తెలిపారు. 


ఎంతో మంది ఉపాధి కోల్పోయాం

రెండు ఎకరాల్లోని ఎగ్జిబిషన్‌ ఐటమ్స్‌ మూసే యడంతో ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. అధికారులకు అన్ని లాంఛనాలు పూర్తి చేశాం. 3 వేల ఫ్రీపాస్‌లు ఇవ్వాలని కమిషనర్‌ డిమాండ్‌ చేశారు. తాము ఇవ్వకపోయే సరికి కక్ష కట్టారు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌ను కూడా కలుస్తాం. 

మీర్జా రఫీక్‌బేగ్‌, ఎగ్జిబిషన్‌ నిర్వాహకుడు  


నిబంధనలు ఉల్లంఘించారనే సీజ్‌ చేశాం

ఎగ్జిబిషన్‌ ఐటమ్స్‌కు నాలుగు ఎకరాలు కేటాయిం చాం. అదనంగా రెండు ఎకరాలు వాడుకోవడంతో అదనంగా పన్ను చెల్లించాలని నోటీసులిచ్చాం. దానికి సమాధానం ఇవ్వలేదు. ఎగ్జిబిషన్‌ నిర్వాహకుల నుంచి ఎవరూ డబ్బులు తీసుకోలేదు. ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలి. 

రామాంజులరెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ 


Updated Date - 2021-03-02T05:50:36+05:30 IST