జంట పట్టణాల్లో ‘విస్తరణ’ ప్రకంపనలు!

ABN , First Publish Date - 2021-07-22T05:07:53+05:30 IST

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ‘విస్తరణ’ ప్రకంపనాలు చోటు చేసుకుంటున్నాయి. సుందరీకరణలో భాగంగా కాశీబుగ్గ మూడు రోడ్ల జంక్షన్‌ నుంచి పలాస ఇందిరాచౌక్‌ వరకు(రెండు కిలోమీటర్లు) ఉన్న రహదారిని 80 అడుగులుగా విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మునిసిపాలిటీ అధికారులు వారం రోజులుగా రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు, భవనాలను తొలగిస్తున్నారు. భారీ యంత్రాలతో నిర్మాణాలను కూలగొడుతున్నారు. పలాసలో బుధవారం విస్తరణ పనులు ప్రారంభించారు. ఓ వైపు షాపులు తొలగించడం... మరోవైపు పనులకు ఆటంకం లేకుండా వారం రోజులుగా ప్రధాన రహదారిలో విద్యుత్‌ నిలిపేయడంతో వ్యాపారాలన్నీ పడిపోయాయి.

జంట పట్టణాల్లో  ‘విస్తరణ’ ప్రకంపనలు!
పలాసలో ధ్వంసమైన దుకాణాలు

- ఒకేసారి షాపులన్నీ కూలగొడుతుండడంతో మార్కెట్‌కు భారీగా నష్టం

- వ్యాపారుల్లో కలవరం

పలాస, జూలై 21 : పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ‘విస్తరణ’ ప్రకంపనాలు చోటు చేసుకుంటున్నాయి. సుందరీకరణలో భాగంగా కాశీబుగ్గ మూడు రోడ్ల జంక్షన్‌ నుంచి పలాస ఇందిరాచౌక్‌ వరకు(రెండు కిలోమీటర్లు) ఉన్న రహదారిని 80 అడుగులుగా విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మునిసిపాలిటీ అధికారులు వారం రోజులుగా రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు, భవనాలను తొలగిస్తున్నారు. భారీ యంత్రాలతో నిర్మాణాలను కూలగొడుతున్నారు. పలాసలో బుధవారం విస్తరణ పనులు ప్రారంభించారు. ఓ వైపు షాపులు తొలగించడం... మరోవైపు పనులకు ఆటంకం లేకుండా వారం రోజులుగా ప్రధాన రహదారిలో విద్యుత్‌ నిలిపేయడంతో వ్యాపారాలన్నీ పడిపోయాయి. ఆషాఢ మాసంలో ఒక్క కేటీరోడ్డులోనే వస్త్ర దుకాణాలు, బంగారం షాపుల్లో రోజుకు రూ.20కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అంచనా. ప్రస్తుతం షాపులు తొలగిస్తుండడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. పలాసలో మొత్తం 21 షాపులు, కాశీబుగ్గలో పాత ఎస్సీ హాస్టల్‌ వద్ద ఉన్న షాపులు మొత్తం కోల్పోవడంతో సుమారు 100 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరో వ్యాపారం చేయలేక వారంతా దీనావస్థలో ఉన్నారు. కాశీబుగ్గలో 40 ఏళ్ల నుంచి చిన్న దుకాణాలు పెట్టుకొని కొంతమంది జీవనం సాగిస్తున్నారు. పలాసలో యూపీ పాఠశాల ప్రహరీని ఆనుకుని ఏళ్ల తరబడి మరికొందరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులతో షాపులన్నీ కూలగొట్డడంతో తాము ఉపాధి కోల్పోయామని వారంతా వాపోతున్నారు. కనీసం నష్ట పరిహారం వ్యవహారం మాట్లాడకుండా టీడీఆర్‌(ట్రాన్సఫర్‌బుల్‌ డెవలెప్‌మెంట్‌ రైట్‌)లు ఇస్తామనడం భావ్యం కాదని వ్యాపారులు చెబుతున్నారు. తమకు స్థలాలే లేకపోతే టీడీఆర్‌లు ఇచ్చి ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. కేవలం మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, మున్సిపల్‌ పాలకవర్గంపై నమ్మకంతోనే అభివృద్ధికి సహకరిస్తున్నామని చెబుతున్నారు. తమకు మునిసిపల్‌ షాపులు కానీ, ఇతర వాణిజ్య సముదాయాల్లో వ్యాపారాలు చేసుకోవడానికైనా అనుమతి ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. 

Updated Date - 2021-07-22T05:07:53+05:30 IST