ఆ ప్రవాసుల Work permitలపై కువైత్ మల్లగుల్లాలు.. రెన్యువల్‌కు రూ.2.46లక్షలు చెల్లించాల్సిందేనట!

ABN , First Publish Date - 2021-11-26T13:53:55+05:30 IST

గత కొన్నిరోజులుగా 60 ఏళ్లు దాటిన, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు సంబంధించిన వర్క్ పర్మిట్ల వ్యవహారంపై కువైత్ సర్కార్‌ మల్లగుల్లాలు పడుతోంది.

ఆ ప్రవాసుల Work permitలపై కువైత్ మల్లగుల్లాలు.. రెన్యువల్‌కు రూ.2.46లక్షలు చెల్లించాల్సిందేనట!

కువైత్ సిటీ: గత కొన్నిరోజులుగా 60 ఏళ్లు దాటిన, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు సంబంధించిన వర్క్ పర్మిట్ల వ్యవహారంపై కువైత్ సర్కార్‌ మల్లగుల్లాలు పడుతోంది. మొదట అసలు ఈ కేటగిరీ వలసదారులకు వర్క్ పర్మిట్ల జారీ, రెన్యువల్‌ను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్(పీఏఎం). ఆ తర్వాత కొంతకాలం ఈ కేటగిరీ ప్రవాసులు తమ వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసుకోవాలంటే 2వేల కువైటీ దినార్లు(రూ.4.92లక్షలు) చెల్లించాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఫత్వా అండ్ లెజిస్లేషన్ విభాగం పీఏఎంకు మొట్టికాయ వేయడంతో దిగొచ్చింది. 


వలసదారులకు వర్క్ పర్మిట్/రెసిడెన్సీ పర్మిట్‌ను నిలిపివేసే అధికారం పీఏఎంకు లేదంటూ, వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. దాంతో పీఏఎం తన నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. అనంతరం 60 ఏళ్లు నిండిన, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఉన్న ప్రవాసులకు కూడా వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ చేయడం జరుగుతుందని ప్రకటించింది. దీనికి గాను వలసదారులకు ఏడాదికి 500 కువైటీ దినార్లు(రూ.1.23లక్షలు) రెన్యువల్ ఫీజుగా నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఫత్వా అండ్ లెజిస్లేషన్ కూడా ఆమోదం తెలిపింది. ఇంతవరకు అంతా బాగానే ఉన్న ఇప్పుడు సమస్య హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు విషయంలో తలెత్తింది. 


దీనికోసం ప్రవాసులు ఏడాదికి అదనంగా మరో 500 కువైటీ దినార్లు చెల్లించాల్సి ఉంటుందనేది నిపుణుల మాట. కానీ, పీఏఎం మాత్రం దీన్ని మరింత పెంచాలని చెబుతోంది. ఈ విషయమై ప్రస్తుతం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ఈ రుసుము 500 నుంచి 550 కువైటీ దినార్ల వరకు ఉండొచ్చని మంత్రిత్వశాఖ సూచన ప్రాయంగా తెలియజేసింది. దీంతో రెన్యువల్ ఫీజు 500 కేడీలతో కలుపుకుని మొత్తం 1000 కువైటీ దినార్లు(రూ.2.46లక్షలు) అవుతుంది. కనుక 60 ఏళ్లకు పైబడిన ప్రవాసులు తమ వర్క్/రెసిడెన్సీ పర్మిట్ల రెన్యువల్ కోసం ప్రతి యేటా రూ.2.46లక్షలు చెల్లించడం ఖాయంగా కనిపిస్తోంది.  


Updated Date - 2021-11-26T13:53:55+05:30 IST