Kuwait లో భారత ప్రవాసుడికి యజమాని చిత్రహింసలు.. సాయం కోసం Embassy కి వెళ్తే నో రెస్పాన్స్.. చివరికి

ABN , First Publish Date - 2022-07-06T17:54:38+05:30 IST

పొట్టకూటికోసం కువైత్ వెళ్లిన భారత ప్రవాడు దేశం కాని దేశంలో పడరానిపాట్లు పడ్డాడు. యజమాని చేతిలో చిత్రహింసలకు గురైన అతడు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని సహాయం కోసం భారత రాయబార కార్యాలయానికి వెళ్లగా అక్కడ అతనికి చేదు అనుభవమే ఎదురైంది. చివరికి తోటి ప్రవాసులే అతనికి సాయం చేయడంతో స్వదేశానికి చేరుకున్నాడు.

Kuwait లో భారత ప్రవాసుడికి యజమాని చిత్రహింసలు.. సాయం కోసం Embassy కి వెళ్తే నో రెస్పాన్స్.. చివరికి

ఎన్నారై డెస్క్: పొట్టకూటికోసం కువైత్ వెళ్లిన భారత ప్రవాడు దేశం కాని దేశంలో పడరానిపాట్లు పడ్డాడు. యజమాని చేతిలో చిత్రహింసలకు గురైన అతడు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని సహాయం కోసం భారత రాయబార కార్యాలయానికి వెళ్లగా అక్కడ అతనికి చేదు అనుభవమే ఎదురైంది. చివరికి తోటి ప్రవాసులే అతనికి సాయం చేయడంతో స్వదేశానికి చేరుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటక రాష్ట్రం ఉడిపిలోని కార్కాలాకు చెందిన జయేష్ బంగేరా(38) ఈ ఏడాది మార్చిలో డొమెస్టిక్ లేబర్ వీసాపై కువైత్ వెళ్లాడు. అక్కడ ఓ యజమాని వద్ద పనికి కుదిరాడు. ఆ యజమానికి కువైత్ బార్డర్‌లో ఓ ఫార్మ్‌హౌస్‌ ఉంది. అక్కడ ఉండే అతనికి సంబంధించిన పశువులను చూసుకోవడం జయేష్ పని. ఎల్లప్పుడూ తీవ్ర ఎండలతో మండిపోయే ఆ ప్రాంతంలో రోజుకు 15 నుంచి 16 గంటలు జయేష్‌తో యజమాని పని చేయించేవాడు. పైగా సరిగా భోజనం కూడా పెట్టేది కాదట. జీతం కూడా ఇవ్వలేదు. అదేంటని అడిగితే కొట్టడం, మానసికంగా హింసించడం చేశాడు. 


యజమాని టార్చర్‌ను తట్టుకోలేక జయేష్ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అనంతరం సహాయం కోసం భారత ఎంబసీకి వెళ్లాడు. కానీ, అక్కడ అధికారుల నుంచి సరియైన స్పందన రాలేదు. దాంతో రాయబార కార్యాలయం వద్ద కలిసిన కొందరు భారత ప్రవాసుల సూచన మేరకు కువైత్ తులుకోట సభ్యుడు రోషన్ కుమార్ పూజారీ, ప్రవాసుడు మోహన్ దాస్ ఎం కామత్‌‌లకు ఫోన్ చేసి తన గోడును వెళ్లబోశాడు. జయేష్ పరిస్థితిని అర్థం చేసుకున్న మోహన్ దాస్ వెంటనే అర్తీ క్రిష్ణ అనే భారత ప్రవాసురాలికి విషయం చెప్పారు. దాంతో ఆమె భారత రాయబారి సిబి జార్జ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇబ్బందుల్లో ఉన్న జయేష్‌కు స్వదేశానికి వెళ్లేందుకు విమాన టికెట్ ఏర్పాటు చేయాల్సిందిగా అంబాసిడర్‌ను ఆమె కోరారు. 


ఆ తర్వాత జయేష్ ఆమె సూచన మేరకు తిరిగి భారత ఎంబసీకి వెళ్లాడు. ఈసారి కూడా రాయబార కార్యాలయం నుంచి జయేష్‌కు ఎలాంటి సహాయం అందలేదు. అక్కడి సిబ్బంది జయేష్‌కు ఎలాంటి సాయం చేయకపోగా.. వెంటనే ఎంబసీ నుంచి వెళ్లిపోవాలని మండిపడ్డారు. దాంతో చేసేదేమిలేక జయేష్ ఎంబసీ బయట మండుతున్న ఎండలో అలాగే నిలబడిపోయాడు. ఆ తర్వాత అతడు ఎంబసీలో జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా అర్తీ క్రిష్ణకు తెలియజేశాడు. వెంటనే ఆమె మళ్లీ రాయబారికి ఫోన్ చేసి వెల్ఫేర్ ఫండ్ నిధుల ద్వారా జయేష్‌ను భారత్‌కు పంపించే ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కర్నాటక ఎన్నారై ఫోరం కూడా హెల్ప్ చేయాలని అడిగారు. చివరికి ఎన్నారై ఫోరం సభ్యులతో సాయంతో జయేష్ స్వదేశానికి చేరుకున్నాడు. 


జయేష్ మాట్లాడుతూ.. తాను ఇంతకుముందు దశాబ్దకాలం పాటు దుబాయ్‌లో పని చేసినట్లు తెలిపాడు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోవడంతో స్వదేశానికి వచ్చేసినట్లు చెప్పాడు. ఆ తర్వాత మిత్రుడైన శృంగేరి వాసి సచిన్.. కువైత్‌లో జాబ్ ఉందని చెప్పడంతో మార్చిలో అక్కడికి వెళ్లాడు. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాత తనకు ఎదురైన ఇబ్బందుల గురించి సచిన్‌కు చెప్పినా .. అతడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని వాపోయాడు. ఇక జయేష్ సోమవారం(ఈ నెల 4న) కువైత్ నుంచి ముంబై చేరుకున్నాడు. అక్కడి నుంచి తన స్వస్థలమైన కార్కాలాకు బస్సులో వెళ్లడం జరిగింది.            

Updated Date - 2022-07-06T17:54:38+05:30 IST