నిరీక్షణ

ABN , First Publish Date - 2021-02-21T04:43:35+05:30 IST

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, కల్లుగీత, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు ఆసరా కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు మంజూరు చేస్తోంది..

నిరీక్షణ
వనపర్తి జిల్లాలో పింఛన్‌ తీసుకుంటున్న వృద్ధురాలు (ఫైల్‌)

- రెండేళ్లుగా మంజూరు కాని కొత్త ఆసరా పింఛన్లు  

- దరఖాస్తులు చేసుకొని ఎదురు చూస్తున్న అర్హులు 

- సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులకు పెరుగుతున్న ఒత్తిళ్లు

- రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో పెండింగ్‌లో దరఖాస్తులు  

- ఎన్నికల హామీని అమలు చేయని రాష్ట్ర సర్కారు


(వనపర్తి-ఆంధ్రజ్యోతి) : వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, కల్లుగీత, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు ఆసరా కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు మంజూరు చేస్తోంది.. తెలంగాణ ఏర్పాటు నుంచి అమలవుతున్న ఈ పథకంలో మొదట్లో వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ, కల్లుగీత, చేనేత, ఫైలేరియా, హెచ్‌ఐవీ బాధితులకు రూ.వెయ్యి చొప్పున, దివ్యాంగులకు రూ.రెండు వేల చొప్పున అందజేసింది.. గత ఎన్నికల్లో ఆ పింఛన్లను డబుల్‌ చేసి ప్రతి నెలా పంపిణీ చేస్తోంది.. రెండేళ్ల క్రితం ఎన్నికల హామీలో భాగంగా 57 సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరికి వృద్ధాప్య పింఛన్‌కు అర్హులను చేసి, పింఛన్లు అందజేస్తామని హామీ ఇచ్చింది.. కానీ, ఇప్పటి వరకు ఆ హామీ అమలుకు నోచుకోకపోగా, రెండేళ్లుగా 65 సంవత్సరాలు నిండిన వృద్ధులతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, కల్లుగీత, చేనేత కార్మికులకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది..


వేలల్లో దరఖాస్తులు

టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచింది. గతంలో ఉన్న పింఛన్లను డబుల్‌ చేస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని వెంటనే నిలబెట్టుకున్న ప్రభుత్వం, కొత్త పింఛన్లను మాత్రం మంజూరు చేయడం లేదు. గతంలో 65 సంవత్సరాలు పైబడిన వారు మా త్రమే పింఛన్‌కు అర్హులు. అయితే, ఎన్నికల హా మీలో భాగంగా 57 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్న వారిని కూడా పిం ఛన్‌కు అర్హులను చేస్తామని చెప్పింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా మరో 10 లక్షల మంది లబ్ధిదా రులు పెరుగుతారని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. గత ఎన్నికల్లో పింఛన్‌దారుల ఓట్లు గంపగుత్తగా టీఆర్‌ఎస్‌కు పడ్డాయి. కొ త్తగా అర్హులయ్యే వారు కూడా కలిసివస్తారని భావించింది. కానీ, ఇప్పటివరకు హామీ అమలు కు అడుగులు పడటం లేదు. పైగా రెండు సం వత్సరాల్లో 65 సంవత్సరాలు పైబడి పాత జీవో ప్రకారమే అర్హత సాధించిన వారు, కొత్తగా స దరమ్‌ సర్టిఫికెట్‌ పొందిన వారు, చేనేత, బీడీ, కల్లుగీత కార్మికులు ఇలా అన్ని వర్గాల వారు అర్హత సాధించారు. ఈ మేరకు ఎంపీడీవోలకు దరఖాస్తులు చేసుకున్నా, ఇప్పటి వరకు ఫలితం లేదు. 

ఉదాహరణకు వనపర్తి జిల్లాలో 67,048 మంది లబ్ధిదారులు ప్రస్తుతం పింఛన్‌ పొందు తున్నారు. వీరికి ప్రతి నెలా రూ.15.52 కోట్లు పంపిణీ చేస్తున్నారు. వీరు కాక గడిచిన రెండే ళ్లలో 3,179 మంది మండలాల నుంచి పింఛన్‌ అర్హత సాధించి దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో వృద్ధులు 209 మంది, వితంతువులు 1,851 మంది, దివ్యాంగులు 1,031 మంది, క ల్లుగీత కార్మికులు 18, చేనేత కార్మికులు ఒకరు, బీడీ కార్మికులు ఇద్దరు, ఒంటరి మహిళలు 67 మంది దరఖాస్తుదారులు ఉన్నారు. మునిసిపా లిటీల్లో వందల సంఖ్యలో దరఖాస్తులు చేసు కున్నారు. అధికారికంగా ప్రకటించినవి కాకుండా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు ఒక్కరికీ పింఛన్‌ మంజూ రు కాలేదు. రాష్ట్రంలో సుమారు 1.50 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.


సర్పంచులకు ఒత్తిళ్లు

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రధానంగా ప్రజల నుంచి వచ్చే వినతుల్లో పింఛన్‌ వినతులు ప్రధానమైనవి. తమకు పింఛన్‌ మంజూరు చేయండంటూ ప్రతిరోజూ పంచాయతీ కార్యాలయాల చుట్టూ అనేక మంది వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులు తిరుగుతున్నారు. పంచాయతీలు, వార్డులు చిన్నయూనిట్లు కావడం, ఆ ప్రతినిధులు వారి సమీప వ్యక్తులే కావడంతో ఒత్తిళ్లను ప్రజాప్రతినిధులు తట్టుకోవడం ఇబ్బందికరంగా మారుతోంది. మునిసిపాలిటీల్లో కౌన్సిలర్ల పరిస్థితి ఇంచుమించు అలాగే ఉన్నది. జిల్లాల్లో మెజారిటీ పంచాయతీల పాలకవర్గాలు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవే. దీంతో అటు ప్రభుత్వాన్ని విమర్శించలేక, ఇటు అర్హులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తాము పనిచేయడం కష్టంగా మారుతుందని, ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు అర్హులైన అందరికీ పింఛన్‌ మంజూరు చేయాలని కోరుతున్నారు. 

Read more