దళితబంధు కోసం ఎదురుచూపులు

ABN , First Publish Date - 2022-04-23T06:33:41+05:30 IST

జిల్లాలో దళితబంధు పథకం యూనిట్లు అర్హులందరికీ అందలేదు. ఎప్పుడు అందుతాయోనని ఎదురుచూస్తున్నారు.

దళితబంధు కోసం ఎదురుచూపులు
ఎస్సీ కార్పోరేషన్‌ భవనం ఇదే

జిల్లాలో లబ్ధిదారుల చేతికందని యూనిట్‌లు 

కొంతమందికి మాత్రమే పంపిణీ 

మిగతా వారికి చేకూరని లబ్ధి

కొంతమంది నుంచి సాంకేతిక కారణాలతో తిరిగి వాపస్‌ 

జిల్లాలో 261 మంది లబ్ధిదారుల ఎంపిక 

రూ. 26 కోట్లకు గానూ కేవలం రూ. 17 కోట్లు మాత్రమే విడుదల 

నిర్మల్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో దళితబంధు పథకం యూనిట్లు అర్హులందరికీ అందలేదు. ఎప్పుడు అందుతాయోనని ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ పథకం పరిమితం కాబోతోందన్న అను మానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఈనెల 14వ తేదీన బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని జిల్లాలో దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్దిదారులు కొందరికి యూనిట్‌లను పంపిణీ చేశారు. అయితే మిగతా యూనిట్‌ల సంగతి పక్కన పెడితే వాహనాల పంపిణీ మాత్రం చర్చనీయాంశంగా మారుతోంది. అధికారులు దళిత బంధు లబ్దిదారులకు వాహనాలు పంపిణీ చేసినప్పటికీ సాంకేతిక, ఇతర కారణాలతో తిరిగి వాటిని వెనక్కి తీసుకువెళ్లినట్లు ఆరోపణలు వ స్తున్నాయి. పూర్తిస్థాయిలో నిధులు జమకాకపోవడంతోనే వాహనాల కంపెనీ వారు వాటిని వెనక్కి తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారులు మాత్రం ఈ వాదనను కొట్టివేసి కొన్ని సాంకేతిక కారణాలతో పాటు లబ్ధిదారులకు రంగులు, ఇతర మోడల్‌లు కావాలని కోరినందుకే వాటిని వెనక్కి తీసుకొని కొత్తవాటిని ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. అధికారులు చెబుతున్న దానికి బయట జరుగుతున్న ప్రచారానికి పొంతన లేకుండా పోతోందంటున్నారు. జిల్లా కు మంజూరైన 261 యూనిట్‌లకు గానూ మొత్తం రూ.26 కోట్లు అవ సరం కానుండగా రూ.17 కోట్లను మాత్రమే ఇప్పటి వరకు విడుదలకావడంతో అధికారులు పూర్తిస్థాయిలో యూనిట్‌లను లబ్దిదారులకు అం దించలేకపోతున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. నిర్మల్‌ నియోజకవర్గానికి 100, ముథోల్‌ నియోజకవర్గానికి 100, ఖానాపూర్‌ నియోజకవర్గానికి 61 యూనిట్లు మంజూరయ్యాయి. ఈ 261 ఎస్సీ కుటుంబాలకు గానూ రూ.26.10 కోట్లను వ్యయం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియతో పాటు యూనిట్‌ల కొనుగోలు, కొనుగోలు చేసిన యూనిట్ల పంపిణీ లాంటి ప్రక్రియను పకడ్భందీగా చేపట్టాల్సిన సంబంధిత యంత్రాంగం మాత్రం నిధుల కొరతతో పాటు సాంకేతిక పరిపాలన పరమైన ఆటంకాల కారణంగా ప్రక్రియను పూర్తి చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. అయితే లబ్ధిదారులు మాత్రం తమకు ఎప్పటిలోగా వాహనాలను తిరిగి అందిస్తారోనని ఎదురుచూస్తున్నారు. 

యూనిట్లు ఇలా ఇచ్చి.. అలా తీసుకుపోయారు !

కాగా దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు ఆర్భాటంగా అఽధికారులు యూనిట్‌లను పంపిణీ చేశారు. అయితే కార్లు, ఇతర వా హనాలు మంజూరైన వారికి మాత్రం నిరాశ ఎదురయ్యింది. అధికారు లు అందరి సమక్షంలో ఈ వాహనాలను పంపిణీ చేసిన కొద్దిసేపట్లోనే లబ్ధిదారుల నుంచి తిరిగి వెనక్కి తీసుకోవడం వివాదాస్పదమవుతోంది. తమకు వాహనాలను ఇచ్చి వెంటనే వెనక్కి తీసుకోవడం పట్ల సంబంధిత లబ్దిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం వారికి నచ్చజెప్పి వాహనాలకు సంబందించిన డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ పూర్తి కాలేదని, ఆ ప్రక్రియ పూర్తి కాగానే వాహనాలను తిరిగి ఇస్తామంటూ చెప్పారంటున్నారు. అయితే రెండు, మూడు రోజుల్లో పూర్తి కావాల్సిన డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ దాదాపు వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తికాకపోవడం పట్ల లబ్దిదారులుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో నిధులు విడుదలకాకపోవడంతోనే అధికారులు వాహనాలను వెనక్కి తీసుకున్నారని, నిధులు విడుదలకాగానే ఆ వాహనాలను లబ్ధిదారులకు అందిస్తారంటున్నారు. 

మరో రూ. 9 కోట్ల కోసం ఎదురుచూపులు

కాగా జిల్లాలో దళితబంధు పథకం కింద 261 కుటుంబాలను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. దీనికోసం రూ. 26.10 కోట్లు అవసరం అవుతాయని నిర్ధారించారు. దీనికి అనుగుణంగా లబ్దిదారులు కోరుకున్న యూ నిట్‌లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల విలువైన యూనిట్‌లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి కేవలం రూ.17 కోట్లు మాత్రమే విడుదల కావడంతో అధికారులు 261 యూనిట్‌లను సమకూర్చలేకపోయారంటున్నారు. ఇందులో ప్రధానంగా వాహనాలకు సంబంధించిన యూ నిట్‌ లను మాత్రం మిగతా రూ.9 కోట్లు వచ్చే వరకు వాహన యూనిట్‌లను అందించలేని పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాహనాలు కాకుండా ఇతర యూనిట్‌ల కోసం ఎంపికైన లబ్ధిదారులకు మాత్రం వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయంటున్నారు. 

అందరికీ యూనిట్‌లు అందిస్తాం

 దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులందరికీ వారు కోరుకున్న యూనిట్‌లను అందిస్తున్నాం. ఇప్పటికే పంపిణీ ప్రక్రియ పూ ర్తయ్యింది. వాహనాలు పొందిన లబ్ధిదారులు మాత్రం కలర్‌ విషయంలోనూ, ఇతర మోడల్‌ విషయంలోనూ అభ్యంతరం వ్యక్తం చేయడం తో వాటిని వెనక్కి తీసుకున్నాం. రెండు, మూ డు రోజుల్లో వారు కోరుకున్న వాహనాలను అందిస్తాం. అలాగే రూ. 26 కోట్లకు గానూ ఇప్పటి వరకు రూ.17 కోట్లు మంజూరయ్యాయి. మిగతా రూ.9 కోట్లు త్వరలోనే విడుదలకానున్న కారణంగా ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. దళితబంధు పథకాన్ని పకడ్భందీగా అమలు చేస్తున్నాం. 

- ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ, జిల్లా కలెక్టర్‌

ఆందోళన చెందవద్దు

దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధి దారులు యూనిట్ల పంపిణీ విషయంలో ఎ లాంటి ఆందోళనకు గురికావద్దు. సాంకేతిక కారణాలతో కొంతమంది లబ్ధిదారుల నుంచి యూనిట్‌లను వెనక్కి తీసుకున్నాం. డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ పూర్తి కాగానే వాటిని తిరి గి లబ్ధిదారులకు ఇస్తాం. ఈ వ్యవహారం పై తప్పుడు ప్రచారం తగదు. దళితులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయడమే ప్రభుత్వధ్యేయం. మొదటిదశ ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వం రెండోదశ అమలుకు చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి. 

- హన్మాండ్లు, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ, నిర్మల్‌ 

Updated Date - 2022-04-23T06:33:41+05:30 IST