రుణాల కోసం ఎదురుచూపులు

ABN , First Publish Date - 2020-08-08T05:53:50+05:30 IST

వెనుకబడిన కులాలకు ఆర్థిక చేయూతనిచ్చి అభివృద్ధిపథంలో నడపాల్సిన బీసీ కార్పొరేషన్‌ శాఖ నిధులు లేక కునారిల్లుతోంది.

రుణాల కోసం ఎదురుచూపులు

అలంకారప్రాయంగా బీసీ కార్పొరేషన్‌

నిధులు లేక స్తంభించిన కార్యకలాపాలు

మూడు సంవత్సరాలుగా జాడలేని టార్గెట్‌

నిరుద్యోగులకు తప్పని ఎదురుచూపులు


 మంచిర్యాల టౌన్‌, ఆగస్టు 7:  వెనుకబడిన కులాలకు ఆర్థిక చేయూతనిచ్చి అభివృద్ధిపథంలో నడపాల్సిన బీసీ కార్పొరేషన్‌ శాఖ నిధులు లేక కునారిల్లుతోంది. మూడేళ్లుగా ఎలాంటి నిధులు విడుదల కాకపోవడం తో అలంకారప్రాయంగా మారింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన రూ. 4 కోట్ల 90 లక్షలు మినహా ప్రభుత్వం మళ్లీ నిధులు మంజూరు చేయలేదు. 2015-16లో మంజూరైన 269 యూనిట్లలో నేటికీ 164 యూనిట్లు గ్రౌండింగ్‌ కాకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడు తోంది. 2016- 17, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క యూనిట్‌ మంజూరు కాలేదు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేస్తానని పదేపదే చెబుతున్న ప్రభుత్వం హామీల వరకే పరిమితమైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్‌ కేటాయింపులు జరుపుతామని ప్రభుత్వం చెబుతుండటంతో రుణాల కోసం ఏళ్లతరబడి వేచి చూస్తున్న ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.


కేటగిరీలుగా విభజించినా అందని రుణాలు 

చిరు వ్యాపారాలు మొ దలుకొని భారీ వాహనాల కొనుగోలుకు రుణం మంజూరు చేసేందుకు దరఖాస్తుదారులను మూడు కేటగిరీలుగా విభజించింది. కేటగిరీ-1 కింద రూ.లక్ష వరకు, కేటగిరీ-2 కింద రూ. 2 లక్షల వరకు, కేటగిరీ-3 కింద రూ. 12 లక్షల వరకు రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. అయితే కేటగిరీ-1 కింద కంటి తుడుపు చర్యగా కొందరికి సబ్సిడీ రుణాలు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,200 మందిదరఖాస్తుదారులు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. 


లక్ష రుణంలో రూ. 50వేలు మంజూరు...

కేటగరీ-1 కింద దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు లక్ష రూపాయల రుణం మంజూరు చేయా ల్సి ఉండగా కేవలం రూ. 50 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. జిల్లా వ్యా ప్తంగా దరఖాస్తు చేసుకున్న వారిలో 990 మందికి రూ.4 కోట్ల 90 లక్షలు మంజూరయ్యా యి. రూ. 50 వేలు రుణానికి సంబంఽధించి ఎలాంటి పథకం రూపొందించకపోయినా అప్పటికప్పుడు సృష్టించి తూతూమంత్రంగా జారీ చేశారు. కేటగిరీ-1 కింద దరఖాస్తులు చేసుకున్న 5 సెక్టార్లలో కేవ లం ఐఎస్‌బీ (ఇండస్ట్రీ సర్వీస్‌ బిజినెస్‌) సెక్టార్‌కు మాత్రమే రూ. 50 వేల చొప్పున రుణాలు మంజూరు చేశారు. ఇంకా కుల వృత్తులు, పశు సంవర్ధకశాఖ, వ్యవసాయ రంగం, రవాణా రంగానికి సంబంధించి ఒక్క దరఖాస్తుదారునికి కూడా రుణం మంజూరు చేయకపోవడం గమనార్హం. 


మూడేళ్లుగా జాడలేని రుణాలు 

మూడేళ్లుగా బీసీ కార్పొరేషన్‌కు బడ్జెట్‌ కేటాయించకపోవడంతో స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకొన్న నిరుద్యోగులు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. జిల్లాలో 4 లక్షలకు పైగా బీసీలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 269 వ్యక్తిగత రుణాలు మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 105 యూనిట్లకు నిధులు విడుదల కావడం గమనార్హం. మిగిలిన 164 మందికి ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రూపుల విషయానికి వస్తే నాయీబ్రాహ్మణ సంఘానికి సంబంధించి మంచిర్యాల పట్టణంలో కేవలం ఒకే ఒక్క యూనిట్‌కు రూ.30 లక్షల రుణం మంజూరైంది. అదికూడా గ్రౌండ్‌ లెవల్లోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2016-17, 2018-19, 2019-20 సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం నేటికీ ఎలాంటి లక్ష్యం విధించకపోగా పైసా విడుదల కాలేదు. గ్రూపు రుణాలకు సం బంధించి యువకులు ఫర్మ్‌ రిజిస్ట్రేషన్‌లు చేయించుకొని మరీ నిరీక్షిస్తున్నారు. రుణాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ గతంలో యువకులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు.  


మూడు సంవత్సరాలుగా పథకాలు లేవు..బీసీ వెల్ఫేర్‌ అధికారి ఖాజా నజీం అలీ

వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖలో మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టడంలేదు. 2017-18 సంవత్సరం మినహా ఇతరత్రా ఒక్క లోనుకూడా మంజూరు చేయలేదు. నిధులు విడుదల చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 5 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా యి. నిధులు విడుదలైతే తప్ప రుణాలు జారీ చేసే అవకాశం లేదు.

Updated Date - 2020-08-08T05:53:50+05:30 IST