ఏడాదిగా ఎదురుచూపులు

ABN , First Publish Date - 2022-01-21T05:52:58+05:30 IST

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి అన్నదాతలకు మద్దతు ధర దక్కేలా చూస్తున్న నిర్వాహకులకు ఏడాదిగా కమీషన్‌ డబ్బు అందడం లేదు.

ఏడాదిగా ఎదురుచూపులు

ధాన్యం కొనుగోలు కేంద్రాల  నిర్వాహకులకు అందని కమీషన్‌

సంగారెడ్డి జిల్లాలో గతేడాది (2020-21) బకాయిలు రూ.8.66 కోట్లు 

గత ఖరీఫ్‌ బకాయిలు రూ.5 కోట్లు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జనవరి 21:  ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి అన్నదాతలకు మద్దతు ధర దక్కేలా చూస్తున్న నిర్వాహకులకు ఏడాదిగా కమీషన్‌ డబ్బు అందడం లేదు. ఫలితంగా వారికి ఏడాదిగా ఎదురుచూపులు తప్పడం లేదు. అటు రైతులకు, ఇటు సర్కారుకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ ధాన్యం కొనుగోలును సమర్థవంతంగా చేపడుతున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌), ఐకేపీ స్వయం సహాయక సంఘాల శ్రమకు ఫలితం దక్కడం లేదు. 


జిల్లాలో గతేడాది బకాయిలు రూ.8.66 కోట్లు 

సంగారెడ్డి జిల్లాలో 2020-21 ఖరీఫ్‌, రబీ సీజన్‌కు సంబంధించి పీఏసీఎస్‌లు, స్వయంసహాయక సంఘాలకు సర్కారు నుంచి కమీషన్ల రూపంలో రూ.8.66 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో 2020-21 ఖరీ్‌ఫలో కొనుగోలు కేంద్రాల ద్వారా 87,475 మెట్రిక్‌ టన్నుల వరిని సేకరించారు. కమీషన్‌ రూపంలో రూ.2,79,92,000 ప్రభుత్వం పీఏసీఎ్‌సలకు, ఐకేపీ సంఘాలకు చెల్లించాల్సి ఉంది. 2020-21 రబీ సీజన్‌కు సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా 1,83,229 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన పీఏసీఎ్‌సకు, ఐకేపీ సంఘాలకు కమీషన్‌ రూపంలో ప్రభుత్వం రూ.5,86,33,280 చెల్లించాల్సి ఉన్నది. 2020-21 సంవత్సరం గడిచి ఏడాది కావస్తున్నా ఆ సంవత్సరంలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి కమీషన్‌ రూపంలో ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.8,66,25,280  చెల్లించకపోవడంతో పీఏసీఎ్‌సలు, ఐకేపీ సంఘాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 


గత ఖరీఫ్‌ సీజన్‌ బకాయిలు రూ.5 కోట్లు

 (2021-22) ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి జిల్లాలోని ఆయా సంఘాలు 1,56,300 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఆయా సంఘాలకు రూ.5,00,16,000ను చెల్లించాలి. కమీషన్‌ రూపంలో ఐకేపీ సంఘాలకు, పీఏసీఎస్‌లకు కమిషన్‌ రూపంలో చెల్లించాల్సిన డబ్బు కోసం జిల్లా యంత్రాంగం లేఖలు రాస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదని తెలిసింది. 


మెట్రిక్‌ టన్నుకు రూ.320 చొప్పున కమీషన్‌

రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి మెట్రిక్‌ టన్నుకు రూ.320 చొప్పున కమీషన్‌ రూపంలో ప్రభుత్వం పీఏసీఎస్‌లకు, ఐకేపీ సంఘాలకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కమిషన్‌ డబ్బును చెల్లిస్తే ఆయా సంఘాల ఆదాయం పొంది ఇతరత్రా లావాదేవీలను నిర్వహించే వీలుంటుందని పీఎసీఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2022-01-21T05:52:58+05:30 IST