Advertisement

హోరెత్తిన పల్లెపోరులో కట్టలు తెంచుకున్నాయ్‌!

Feb 27 2021 @ 23:26PM

ఓటు కోసం రూ.200 కోట్ల ఖర్చు

మందు, చీర, సారెలకు మరో 120 కోట్లు

వెరసి పంచాయతీ ఎన్నిక ఖర్చు రూ.320 కోట్ల పై మాటే!


1992లో రాపూరు నుంచి పోటీ చేసిన ఓ నాయకుడు ఓటుకు రెండు రూపాయలు పంచారు. పంపకాల కోసమే రూ.2 నోట్ల కట్టలు తెచ్చారట. అప్పట్లో అది పెద్ద విశేషం. ఇదే ప్రాంతంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు వెయ్యి రూపాయలు పంచారు. ఇవే ఎన్నికల్లో మరో నియోజకవర్గంలో ఒక అభ్యర్థి ఓటుకు రెండు వేలు పంచారు. మొన్నటి వరకు ఇది చాలా పెద్ద విశేషం. 

 మరి ఇప్పుడు..

అదే రాపూరులో మండలంలోని ఒక పంచాయతీలో  ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు పంచారు. ఆ పంచాయతీలో పోటీలో ఉన్నది మాత్రం ముగ్గురే. పీఠం కోసం ఓటరుకు ఎడపెడా తాయిలాలు అందజేశారు. 20 ఏళ్లలో ఎంత మార్పు!?.  


నెల్లూరు (ఆంధ్రజ్యోతి), ఫిబ్రవరి 27 : రాపూరులో డబ్బున్న వాళ్లు ఎవరో పంచారులే.. అన్ని చోట్లా ఇలా ఉంటుందా..!? అనే సందేహం మీకు రావచ్చు. జిల్లాలో అత్యంత వెనుకబడిన ఉదయగిరి నియోజవకర్గం సీతారామపురం మండలంలో సైతం ఓటు రేటు ఇంత కన్నా ఎక్కువే పలికింది. ఒక పంచాయతీలో 10 మంది ఓటర్లను టోకుగా 1,20,000 (లక్షా ఇరవై వేలు) ఇచ్చి కొన్నారు. ఓటు వేయడం కోసం బెంగళూరు నుంచి వచ్చిన ఆ బృందం మొత్తం నగదు చేతిలో పెడితే కాని వ్యాను దిగలేదట. ఈ మండలంలో చాలా పంచాయతీల్లో ఓటు రేటు రూ.5వేలు పలికింది. అక్కడ ఇక్కడ కాదు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్లా ఓటు రేటు కనిష్ఠంగా రూ.500లతో మొదలై పోలింగ్‌ సమయం దగ్గర పడే కొద్దీ రెండు వేల వరకు పలికింది. ప్రచార హోరు లేకుండా, అసలు ఎన్నికల హడావుడే కనిపించకుండా, ప్రశాంతంగా జరిగిన ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చేసిన ఖర్చు ఎంతో తెలుసా!? రమారమి 320 కోట్ల రూపాయలు. నగదు రూపంలో పంపకాలకైతేనేం.. మందు పంపకాలకైతేనేం.. ఆడపడుచుల ఓట్లను ఆకర్షించడానికి ముక్కుపుడకలు, చీరలు, కుక్కర్ల ఖర్చు అయితేనేం మొత్తం కలిపితే అభ్యర్థులు వ్యయ భారం అక్షరాల 320 కోట్ల పైమాటే.. 


వెయ్యి మంది జనాభా కలిగిన ఒక పంచాయతీకి 14వ ఆర్థిక సంఘం నిధుల కింద ఏడాదికి రూ.2.50 నుంచి 3 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నుంచి మరో మూడు లక్షలు. జనరల్‌ పంఢ్‌ కింద పంచాయతీ జనాభా ఆధారంగా పీసీ,టీటీ పద్దుల కింద ఒక్కొక్కరికి రూ.6 (వెయ్యి మంది జనాభా ఉంటే 6వేలు) ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చే నిధులు ఇవే. ప్రత్యేకించి కొన్ని పంచాయతీలకు సీనరైజ్‌ చార్జీస్‌ కింద భారీగా ఆదాయం రావచ్చునేమోగానీ మెజారిటీ పంచాయతీలకు మాత్రం ప్రభుత్వ పద్దుల నుంచి వచ్చే నిధులు స్వల్పమే. కానీ, ఈ పంచాయతీ సర్పంచ్‌ గిరి కోసం, వార్డు సభ్యుల కోసం బరిలోని అభ్యర్థులు చేసిన ఖర్చు ఎంతో తెలుసా!? కనిష్ఠంగా లెక్కించినా వంద కోట్ల పైమాటే. ఏకగ్రీవాలు మినహాయిస్తే జిల్లా పరిధిలో 751 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో సర్పంచ్‌ స్థానానికి 2522 మంది పోటీ పడ్డారు. పలు పంచాయతీల్లో త్రిముఖ పోటీ నెలకొంది. గెలుపే ధ్యేయంగా 30 లక్షలు, 40లక్షలు ఖర్చు చేసిన అభ్యర్థులూ ఉన్నారు. సగటున సర్పంచ్‌ స్థానానికి 5లక్షల కన్నా తక్కువ ఖర్చు పెట్టిన అభ్యర్థులను వేళ్ల మీద లెక్కించవచ్చు. ఎందుకంటే ఓటు రేటు ఎక్కడా రూ.500లకు తగ్గలేదు.  సగటున ఒక అభ్యర్థి ఓట్ల పంపకాల కోసం రూ. 5లక్షలే ఖర్చు చేశారనుకున్నా ఓట్ల కొనుగోలుకు చేసిన వ్యయం 120 కోట్ల రూపాయలు. ఇక 5537 వార్డుల్లో 11,633 మంది పోటీ పడ్డారు. వీరు ఓటర్లకు భారీగానే ఖర్చు పెట్టారు. రాపూరు ప్రాంతంలో ఓటుకు రూ.500 పంచారు. ఇది చాలా తక్కువ మొత్తంగా ప్రజలు చెప్పుకున్నారంటే వార్డు మెంబర్ల వ్యయం ఏ మేరకు ఉంటుందో ఊహించుకోవచ్చు. ఓటు కోసం సర్పంచ్‌ అభ్యర్థి ఎంత ఇస్తున్నాడో, వార్డు మెంబరు అంతే ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు ఓట్ల విలువ ఒకటే కదా..!? అనే లాజిక్‌ను ఓటర్లు బాగా వంట పట్టించుకున్నారు. బరిలోని 11వేల మంది వార్డు మెంబర్లు ఓటు కోసం 50 నుంచి వంద కోట్లకుపైగా పంపిణీ చేయకతప్పలేదని సమాచారం. సర్పంచ్‌ అభ్యర్థులు, వార్డు అభ్యర్థులు ఓటు కోసం 200 కోట్ల మేరకు పంపిణీ చేశారనడంలో అతిశయోక్తి కాదు. 


మందుబాబులకు..

ఓటు రేటు  విషయంలో తేడాలు కనిపించాయి కానీ మందు విషయంలో మాత్రం ఒకటే పద్ధతి కనిపించింది. ఇంట్లో ఉన్న పురుషలకు ఒక క్వార్టర్‌ చొప్పున పంపిణీ చేశారు. దాదాపుగా ప్రతి ఒక్కరికీ రమారమి రూ.వెయ్యి గిట్టుబాటు అయ్యింది. బరిలో సర్పంచ్‌ అభ్యర్థులు ఇద్దరు ఉన్నారనుకుంటే వారి తరఫున రెండు క్వార్టర్లు, వార్డుకు ఇద్దరు పోటీలో ఉన్నారంటే మరో రెండు క్వార్టర్లు ఇలా  4  క్వార్టర్లు గిట్టుబాటు అయ్యాయి. అలవాటు ఉన్నా, లేకున్నా సంబంధం లేదు. ఉన్న వాళ్లు తాగుతారు... అలవాటు లేనివాళ్లు మరొకరికి విక్రయిస్తారు. అంతేకాని మందు విషయంలో వద్దు అనే మాటే లేదు. పంచాయతీలలో మొత్తం 7,60,211 మంది పురుష ఓటర్లు ఉన్నారు. వీరిలో ఒకరికి నాలుగు క్వార్టర్ల లెక్క వేసుకున్నా 30లక్షల 40వేల క్వార్టర్లు. క్వార్టర్‌ ధర 200లకు తక్కువ లేదు. ఈ లెక్కన మద్యం కోసం చేసిన ఖర్చు కనిష్ఠంగా 60 కోట్లు. 


ఆడపడుచులకు అంతే లెక్క:  

మగాళ్లకు మందు ఇచ్చారు. మరి ఆడపడుచులను సంతోషపెట్టాలిగా. అందులో భాగంగానే ఇంటింటికి చీరలు, కుంకుమ బరిణెలు, ముక్కుపుడకలు పంపిణీ చేశారు. ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో 7,83,912 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. చీరలు, ముక్కుపుడకలు, వెండి కుంకుమ బరిణెలు ఇలా ఎంత కనిష్ఠంగా లెక్కించినా మహిళా ఓట్లను ప్రలోభపెట్టడం కోసం చేసిన ఖర్చు 60 కోట్లకు ఏమాత్రం తక్కువ ఉండదని అంచనా. 


అందరినీ సమానంగా...

సూక్ష్మంగా గమనిస్తే పంచాయతీ ఎన్నికల్లో సమానత్వం కనిపిస్తోంది. ఎలాగంటారా..!? అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు పంపకాల్లో చాలా అసమానతలు కనిపిస్తాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఇస్తారు. ఖచ్చితంగా తమ పార్టీకి ఓట్లు పడుతాయని విశ్వసించే వర్గాలకు డబ్బులు ఇవ్వకపోవడం లేదా చాలా తక్కువ మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది. అన్ని ప్రాంతాలకు, అందరికి అన్ని పార్టీల అభ్యర్థులు డబ్బులు ఇవ్వరు.  నియోజకవర్గం మొత్తంపై 50 నుంచి 60 శాతం మంది ఓటర్లకు మాత్రమే పంపకాలు చేస్తారు. దీనికి సంబంధించి అసెంబ్లీ అభ్యర్థుల లెక్కలు వేరుగా ఉంటాయి. కానీ ఈ పంచాయతీ ఎన్నికల్లో అంతటా, అన్నింటా సమానవత్వం కనిపించింది. ఐదు, పది ఓట్లు ఫలితాలను తారుమారు చేస్తాయి కాబట్టి ఒక్క ఓటరును నిర్లక్ష్యం చేయలేదు. అందరినీ సమానంగా చూశారు. ఎన్నికల వ్యయం కూడా గతానికి ఇప్పటికి చాలా తేడా కనిపించింది. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండల పరిధిలోని పంచాయతీలన్నీ కలిపి 30 నుంచి 40 లక్షలు ఖర్చు చేస్తే ఇప్పుడు ఒక్కో మండలంలో 5 నుంచి 6 కోట్లు ఖర్చు చేశారు. మొత్తమ్మీద ఈ పంచాయతీ ఎన్నికల ప్రభావం జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలపై కూడా పడుతుందనడంలో ఏ మాత్రం అనుమానం లేదు. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.