ఖర్చు రూ.1లక్ష... ఆదాయం రూ.3లక్షలు

ABN , First Publish Date - 2022-07-07T04:57:52+05:30 IST

వరి, పత్తి వంటి సంప్రదాయ పంటల సాగు నుంచి కొందరు రైతులు ఉద్యాన పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో జిల్లాలో 850 ఎకరాల్లో బొప్పాయి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.

ఖర్చు రూ.1లక్ష... ఆదాయం రూ.3లక్షలు
వీవీపాలెంలో బొప్పాయి తోట

 బొప్పాయి పంటతో భారీగా లాభాలు

జిల్లాలో ఏటేటా విస్తరిస్తున్న సాగు

 జిల్లాలో 850ఏకరాల్లో పంట, సగం రఘనాఽథపాలెం మండలంలోనే సాగు

రఘనాథపాలెం,జూలై6: వరి, పత్తి వంటి సంప్రదాయ పంటల సాగు నుంచి కొందరు రైతులు ఉద్యాన పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో జిల్లాలో 850 ఎకరాల్లో బొప్పాయి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. రఘనాధపాలెం, కామేపల్లి, ఏన్కూరు, కూసుమంచి, చింతకాని మండలాల రైతులు ఇప్పటికే బొప్పాయి విత్తనాలు నాటారు.  వ్యవసాయం దండగా అనే విధానం నుంచి.. సాగు లాభాలు బాగు అనే ఉద్యన పంటలను సాగు చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఆయా మండలాలు ఉండటంతో పాటుగా మార్కెట్‌ విలువ ఎక్కువగా ఉండే బోప్పాయి సాగును రైతులు ఎంచుకుంటున్నారు.

10ఎకరాల నుంచి నేడు 450 ఎకరాల్లో బొప్పాయి

పదేళ్ల క్రితం మండల వ్యాప్తంగా పది ఎకరాలు మాత్రమే బొప్పాయి సాగు ఉండేది. కానీ ఇప్పుడు కొటపాడు, వీర్లపుడి, పుఠానితండా,పంగిడి, మూలగూడెం, వాయిదాలతండా, వీ వెంకటాయపాలేం, వేపకుంట్ల గ్రామ పంచాయతీల్లో ఈ సాగును రైతులు చేపట్టారు. గత సంవత్సరం మండలంలో 400ఎకరాల్లో బొప్పాయి సాగు కాగా, ఈ సంవత్సరం మరో 450ఎకరాల్లో పెరిగింది.

ఏకరాకు రూ.2లక్షల ఆదాయం

బొప్పాయి సాగుకు కూలీల ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. సేంద్రియ ఏరువులు, వైరస్‌ నివారణ మందుల వాడితే సరిపోతుంది. ఎకరానికి రూ.1లక్ష వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మార్కెట్‌ ధరను బట్టి సుమారు రూ.3లక్షల వరకు ఆదాయం వస్తుంది. అంటే ఎకరానికి ఏడాదికి రూ.2లక్షల ఆదాయం అందుతోంది.

హెక్టారుకు ప్రభుత్వ సబ్సిడీ రూ.22,500

బొప్పాయి సాగుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇందుకోసం బొప్పాయి మొక్కల బిల్లులు, సేంద్రియ ఎరువుల బిల్లులు, వైరస్‌ నివారణ మందుల బిల్లులు ఉద్యనశాఖ అధికారులకు అందించాలి.. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన వ్యవసాయ అధికారులు  మొదటి సంవత్సరం రూ.17,000, మరుసటి ఏడాది రూ.5,500 అందజేస్తారు.

  ఉచితంగా డ్రిప్‌, విత్తనాలు ఇవ్వాలి..

హజ్మిరా భద్య, గిరిజన రైతు

12ఏళ్లుగా బొప్పాయి సాగు చేస్తున్నా.. సూర్యతండా నుంచి విచ్చి వీ వెంకటాయపాలెంలో ఈ సాగు చేస్తున్నా. గతంలో ప్రభుత్వం నుంచి ఉచితంగా డ్రిప్‌, విత్తనాలు అందించారు. ఇప్పుడు రావటం లేదు. బొప్పాయి సాగుకు ఎకరాకు రూ.1లక్ష పెట్టుబడి పెడితే, రూ.3లక్షల దిగుబడి వస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకం పెరిగితే బాగుంటుంది.

రైతుల్లో అవగాహన పెరిగింది.

 గుడిమల్ల సందీప్‌కుమార్‌, ఖమ్మం ఉద్యాన అధికారి

రైతుల్లో అవగాహన బాగా పెరిగింది. ఉద్యన పంటల సాగు దిశగా ప్రతి సంవత్సరం సాగు విస్తీర్ణం పెరు గుతోంది. గతేడాది మండలంలో 400ఎకరాల్లో జరిగితే, ఈఏడాది మరో 450 ఎకరాలు పెరిగింది. ప్రభుత్వం నుంచి బొప్పాయి సాగుకు హెక్టారుకు రూ.22500 సబ్సిడీ అందిస్తోంది. మొదటి సంవత్సరం రూ.17,000, రెండోఏడాది రూ.5,500 అందిస్తాం. రైతులు బొప్పాయి మొక్కల నుంచి అన్ని బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది.

Updated Date - 2022-07-07T04:57:52+05:30 IST