ఖరీదైన కరోనా వైద్యం

ABN , First Publish Date - 2021-05-11T05:02:14+05:30 IST

కరోనా పేరు చెప్పి ఫార్మా కంపెనీలు ప్రజలను దోచుకుంటున్నాయి.

ఖరీదైన కరోనా వైద్యం

ఇంటి దగ్గర వాడే మందుల ధరలు భారీగా పెంపు
ఐవర్‌ మెక్టిన్‌ స్ర్టిప్‌ రూ.300 నుంచి రూ.450కు...
పల్స్‌ ఆక్సీమీటర్‌ రూ.2,500-3,000
ఆక్సిజన్‌ సిలిండర్‌ రూ.25 వేలు
ఆక్సిజన్‌ సిలిండర్‌ ఫ్లో మీటర్‌ వాల్వ్‌ రూ.5 వేలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కరోనా పేరు చెప్పి ఫార్మా కంపెనీలు ప్రజలను దోచుకుంటున్నాయి. చిన్నపాటి లక్షణాలే కదా అని హోం ఐసోలేషన్‌ (ఇంటి దగ్గర)లో వుండి చికిత్స తీసుకునే వారిని సైతం వదలడం లేదు. వారు వినియోగించే మందుల ధరలన్నీ పెంచేశారు. వీటిపై ఎవరి నియంత్రణ కనిపించడం లేదు. ఔషధ నియంత్రణ విభాగం, విజిలెన్స్‌ వర్గాలు మందుల దుకాణాలు, వైద్య పరికరాలు విక్రయించే దుకాణాలపై ఎందుకు దృష్టిసారించడం లేదో అర్థం కావడం లేదు.


పల్స్‌ ఆక్సీమీటర్‌ రూ.2,500 పైనే

కరోనా లక్షణాలు ఉంటే...ఆక్సిజన్‌ శాచురేషన్‌ ఎంత వుందో చూసుకోవడానికి  ‘పల్స్‌ ఆక్సీమీటరు’ కొనుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి ఇంతకు ముందు రూ.450 నుంచి రూ.వేయి వరకు లభించేవి. తక్కువ ఖరీదువి వారం రోజులే పనిచేసేవి. బ్రాండెడ్‌ రూ.1600 ఉండేవి. ఇప్పుడు ఏ బ్రాండ్‌ అయినా సరే రూ.2,500 నుంచి రూ.3 వేల మధ్య విక్రయిస్తున్నారు. ఎంఆర్‌పీపై అధికంగా అమ్ముతున్నారా? అంటే అదీ లేదు. ఎవరికి నచ్చినంత వారు ముద్రించుకొని అమ్మేసుకుంటున్నారు. వాటికి కూడా ముందుగా ఇండెంట్‌ పెట్టుకొని తీసుకోవలసి వస్తోంది.


ఐవర్‌ మెక్టిన్‌ రూ.450

కరోనా నియంత్రణ కోసం ఐవర్‌మెక్టిన్‌ను వాడాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. ఇది పది మాత్రాల స్ట్రిప్‌ ఇంతకు ముందు రూ.300 ఉండేది. ఇప్పుడు అదే రూ.450 చేసి అమ్ముతున్నారు. అంటే 50 శాతం రేటు పెంచేశారు. జ్వరానికి వినియోగించే డోలో, పారాసిటామల్‌, యాంటీ బయాటిక్‌గా అంతా వాడుతున్న డాక్సీసైక్లిన్‌, విటమిన్‌ సి, జింక్‌ మాత్రల రేట్లు కూడా 50 శాతం పెంచేశారు. పైగా అడిగిన వెంటనే వీటిని ఇవ్వడం లేదు. స్టాకు లేదని, సాయంత్రం లేదా రేపు రావాలని చెబుతున్నారు. కరోనాలో కొందరికి దగ్గు వస్తోంది. దాంతో దగ్గు నివారణకు ఉపయోగించే టానిక్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. అపోలో, మెడిప్లస్‌ వంటి షాపుల్లో ఇవి లభ్యం కావడం లేదు. ఉన్నా పాత రేట్లను తీసేసి కొత్త రేట్లతో విక్రయిస్తున్నారు. ఈ నెల రోజుల్లో ఎందుకు ఈ రేట్లు అన్నీ పెరిగాయి? అనే దానికి వారు సమాధానం చెప్పడం లేదు. కంపెనీ పెంచేసింది అంటున్నారు.


ఫ్లో మీటర్‌ వాల్వ్‌ రూ.5 వేలు!

చాలామంది ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నాక కూడా ఆక్సిజన్‌ అవసరం పడుతోంది. అటువంటి వారు సిలిండర్లు సమకూర్చుకుంటున్నారు. గతంలో ఈ సిలిండర్‌ రూ.6 వేల నుంచి రూ.7 వేల మఽధ్య లభించేది. ఇప్పుడు అదే సిలిండర్‌ రూ.20 వేల నుంచి రూ.30 వేల మధ్య విక్రయిస్తున్నారు. ఎంవీపీ కాలనీలో అనుమతి లేకుండా వీటిని అమ్ముతున్న వ్యక్తిపై పలువురు ఫిర్యాదు చేయడంతో శనివారం అధికారులు పట్టుకున్నారు. అయినా ఈ దందా ఆగడం లేదు. ఈ సిలిండర్‌కు ఫ్లో మీటర్‌, వాల్వ్‌ ఉంటాయి. ఇవి ఇంతకు ముందు రూ.600 నుంచి వేయి రూపాయలకు లభించేవి. ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు అమ్ముతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి విశాఖపట్నం రైల్వే అధికారులు డీజిల్‌ లోకోషెడ్‌లో పాత వస్తువులు ఉపయోగించి రూ.450కే ఈ వాల్వ్‌లను తయారుచేశారు. వీటినే రైల్వే ఆస్పత్రిలో వినియోగిస్తున్నారు. 

Updated Date - 2021-05-11T05:02:14+05:30 IST