విపత్కర వేళ దోపిడీ

ABN , First Publish Date - 2021-04-24T05:12:29+05:30 IST

-జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. సగటున 1,000కిపైగా కేసులు నమో దవుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా కొవిడ్‌ వ్యాప్తి చెందుతోంది. కేసుల నమోదుకు తగ్గట్టు రికవరీ శాతం లేదు. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. శుక్రవారం 1,050 కేసులు నమోదుకాగా...నలుగురు మృత్యు వాత పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటిం చింది.

విపత్కర వేళ దోపిడీ


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వ విధానాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగులకు చికిత్స వద్దంటూనే.. మరోవైపు దోపిడీకి అవకాశం కల్పిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజురోజుకూ కేసులు ఉధృతమవుతున్న వేళ ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్లు లేక సామాన్య, పేదలు సైతం ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. విపత్కర పరిస్థితిలో కనికరం చూపాల్సిన ప్రైవేటు యజమాన్యాలు అందినంత దోచుకుంటున్నాయి.  దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా దృష్టిసారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

-జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. సగటున 1,000కిపైగా కేసులు నమో దవుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా కొవిడ్‌ వ్యాప్తి చెందుతోంది. కేసుల నమోదుకు తగ్గట్టు రికవరీ శాతం లేదు. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. శుక్రవారం 1,050 కేసులు నమోదుకాగా...నలుగురు మృత్యు వాత పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటిం చింది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత వేధిస్తోం ది. బాధితులు వస్తున్నా బెడ్లు లేకపోవడంతో తిరిగి హోం ఐసోలేషన్‌కు పంపుతున్నారు.  ఈ పరిస్థితుల్లో కొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. బెడ్ల కొరతపై విమర్శలు వెల్లువెత్తడంతో యంత్రాంగం మేల్కొంది. శ్రీకాకుళం నగరంలో దాదాపు 15 కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కరోనా రోగులను చేర్చుకొని చికిత్సలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో మౌలిక వసతుల స్థితిగతులపై వివరాల సేకరణ జరుగుతోంది. సుమారు 1,500 బెడ్లను ఆయా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 


రూ.లక్షలు వసూళ్లు

 ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా రోగులను చేర్చుకొని చికిత్సలు అందించేందుకు ఎవరికీ ఇంకా అధికారికంగా అనుమతులు లేవు. కానీ శ్రీకాకుళం నగరంలో కార్పొరేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు మాత్రం ఇప్పటికే ఆసుపత్రుల్లో బెడ్లు ఏర్పాటుచేసి వైద్యం అందిస్తున్నారు.  ఇటీవల ప్రారంభించిన ఒక ఆసుపత్రిలో ఎటువంటి అనుమతి లేకుండానే గత నెల రోజులుగా కరోనా బాధితులను ఇన్‌పేషెంట్‌లుగా చేర్చుకొని భారీగా సొమ్ములు గుంజినట్లు సమాచారం. బాధితుల అవసరాలను, వారి ఆర్థిక స్థోమతను అంచనా వేసుకుంటున్న కార్పొరేట్‌ మాయగాళ్లు కరోనా టెస్ట్‌కు రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. ఇక ఆన్‌పేషెంట్‌గా చేరాలనుకుంటే నగరంలో ఒకటి రెండు ఆసుపత్రుల్లో రూ.2 నుంచి రూ.3 లక్షలు చేతిలో పట్టుకుంటేనే ప్రవేశం ఉంటుంది. లేదంటే  బెడ్లులేవనే సాకులు చెబుతున్నారు. ఆసుపత్రికి వెళ్లినా ముందుగా బెడ్లు లేవని చెబుతూ.. తరువాత ఎవరైనా సిఫారసు చేస్తే, అసలు విషయం చెబుతున్నారు. బెడ్లు , గది, చికిత్స అందించే వైద్య సిబ్బంది ధరించే కిట్ల చార్జీలు కూడా రోగిపైనే బాదుతున్నారు. 


సర్వేతో కాలక్షేపం 

వైద్యశాఖ అధికారులు ఇంకా సర్వే చేస్తున్నామని చెబుతుండగా ఆసుపత్రు వర్గాలు మాత్రం కరోనా రోగులకు బెడ్లు లేవని చెబుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా నలుమూలల నుంచి ప్రతిరోజూ వందల సంఖ్యలో నగరానికి కరోనా చికిత్స కోసం వస్తున్నారు. వీరికి టెస్ట్‌ల పేరుతో ల్యాబ్‌లకు రిఫర్‌ చేసి వ్యాధి నిర్థారణ జరిగాక బెడ్లు లేవంటున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం ప్రస్తుత పరిస్థితిలో బెడ్‌ సంపాదించాలంటే ఉన్నతస్థాయి అధికారి నుంచో లేక ప్రజాప్రతినిధుల నుంచో సిఫారసులు చేయించుకోవాల్సి వస్తోందని కొందరు బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కాకుండా వారి సొంత అజెండాతో రేట్లు నిర్ణయించి కరోనా టెస్ట్‌లు నుంచి అన్నిటికీ ప్రతి రోగి నుంచి ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నారు. వాస్తవానికి అధికారులు కార్పొరేట్‌ దోపిడీపై అనేక ఫిర్యాదులు అందడంతో ప్రెవేటు ఆసుపత్రుల్లో నిర్దేశించిన బెడ్లను జియో ట్యాగ్‌ చేయాలని భావిస్తున్నది. కానీ ఈ ప్రక్రియ ఇంకా వైద్య ఆరోగ్యశాఖ పూర్తి చేయలేదు. దీంతో కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కరోనా రోగుల దోపిడీని అరికట్టేందుకు సమగ్ర ప్రణాళిక అమలుచేయాల్సిన అవసరం  ఉంది. 



Updated Date - 2021-04-24T05:12:29+05:30 IST