దోపిడీ కేంద్రాలు ఈ టోల్‌ ప్లాజాలు!

ABN , First Publish Date - 2022-04-07T07:04:28+05:30 IST

కేంద్రప్రభుత్వం టోల్‌గేట్‌ల వద్ద ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం లేని ఫాస్ట్‌టాగ్‌ విధానం పేరిట అదనపు భారం మోపుతోంది, పెట్రోలియం ధరలు పెంచుతోంది. ఇవి చాలవన్నట్టు తాజాగా టోల్‌ రుసుం 10.2శాతం పెంచుతూ...

దోపిడీ కేంద్రాలు ఈ టోల్‌ ప్లాజాలు!

కేంద్రప్రభుత్వం టోల్‌గేట్‌ల వద్ద ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం లేని ఫాస్ట్‌టాగ్‌ విధానం పేరిట అదనపు భారం మోపుతోంది, పెట్రోలియం ధరలు పెంచుతోంది. ఇవి చాలవన్నట్టు తాజాగా టోల్‌ రుసుం 10.2శాతం పెంచుతూ (హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ ప్రకారం) ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి టోల్‌ ఛార్జీలను పెంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జాతీయ రహదారుల నిర్మాణాన్ని లేదా అభివృద్ధి పనులను బిఓటి (బిల్డ్– ఆపరేట్‌– ట్రాన్స్‌ఫర్‌: నిర్మించు నిర్వహించు బదలాయించు) పద్ధతిలో కంట్రాక్టర్లకు ఇస్తారు. కంట్రాక్టరు ముందుగా పెట్టుబడి పెట్టి, ఆ పెట్టుబడిని టోల్‌ ప్లాజాల ద్వారా తిరిగి వసూలు చేసుకొంటారు. కంట్రాక్టర్‌ ఏదైనా జాతీయ రహదారిని అభివృద్ధి చేసిన సందర్భంలో ఆ రహదారి నిర్మాణానికి చేసిన వ్యయాన్ని బట్టి టోల్‌ టాక్సును నిర్ణయిస్తారు. టోల్‌ టాక్స్ నిర్ణయించడంలో కంట్రాక్టర్‌ ఆ రహదారి అభివృద్ధి నిమిత్తం చేసిన వ్యయం, వ్యయంపై వడ్డీ, టోల్‌ గేట్‌ల నిర్వహణకు అయ్యే ఖర్చులను కలుపుకొంటారు. ఉదాహరణకి విజయవాడ–హైదరాబాద్‌ రహదారి అభివృద్ధికి రూ.1000కోట్లు కంట్రాక్టరు ఖర్చు చేస్తే, ఆ వెయ్యి కోట్లు తిరిగి వసూలు చేడానికి 15 సంవత్సరాల గడువు పడుతుంది. ఆ వెయ్యి కోట్లకు 15 సంవత్సరాలకు ఎంత వడ్డీ పడుతుందో ముందుగానే లెక్కించి టోల్‌ రుసుమును నిర్ణయిస్తారు. అందువల్ల టోల్‌ రుసుమును స్థిరంగా వసూలు చేయాలే కాని మార్కెట్‌ సూచి ప్రకారం పెంచాల్సిన అవసరం లేదు. కాని కేంద్రప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా ప్రతి ఏడాదికి టోల్‌ రుసుమును పెంచడం ద్వారా వాహనదారులపై అదనపు భారాన్ని మోపుతోంది. కేంద్రప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై విచ్చలవిడిగా పన్నులు వేయడంతోపాటు టోల్‌ ప్లాజాలను ఒక ఆదాయ వనరుగా మార్చుకుంది. దేశవ్యాప్తంగా టోల్‌ రుసులు పెంచిన కేంద్రప్రభుత్వం కంటితుడుపుగా ప్రతి 60 కి.మీ.కి ఒక టోల్‌ ప్లాజా ఉంటుందని, ఈ కారణంగా టోల్‌ ప్లాజాల సంఖ్య తగ్గిపోతుందని ప్రకటించింది. వాస్తవంలో టోల్‌ ప్లాజాల సంఖ్యను ఎప్పటికి తగ్గిస్తుందో తెలియదుకాని, పెంచిన టోల్‌ రుసుములను మాత్రం తక్షణం అమల్లోకి తీసుకువచ్చింది.


ఇక ఫాస్ట్‌టాగ్‌ పేరిట కూడా కేంద్రప్రభుత్వం ప్రజలపై భారం మోపి, కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసింది. 2017 సంవత్సరపు లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 25 కోట్లకుపైగా వాహనాలు వున్నాయి. ఈ వాహన యజమానుల చేత ఫాస్ట్‌టాగ్‌లను ఏర్పాటు చేయించింది. ఫాస్ట్‌టాగ్‌లకు సంబంధించిన కంట్రాక్ట్‌లను ప్రైవేటు బ్యాంకులతోపాటు ఎయిర్‌టెల్‌, జియో వంటి సంస్థలకు అనుమతించింది. ఈ సంస్థలు ఫాస్ట్‌టాగ్‌ సదుపాయం కల్పించినందుకు ఒక్కొక్క వాహన యజమాని నుంచి రూ.100 వసూలు చేయడంతోపాటు, ప్రతి వాహనదారుడు కనీసం తమ ఖాతాలో కనీసం రూ.200లు డిపాజిట్‌గా ఉంచాలన్న నిబంధనను విధించాయి. ఈ ప్రకారం వాహన యజమానులు చేస్తే ఆయా బ్యాంక్‌లు, ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలకు దాదాపు రూ.75 వేల కోట్ల మేరకు ప్రయోజనం చేకూరింది. కొన్ని సంస్థలు డిపాజిట్‌ రూ.500గా వసూలు చేస్తున్న పరిస్థితిలో ఆయా సంస్థలకు ఆయాచితంగా ఎంత డబ్బు లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు.


నిజానికి 2004 సంవత్సరానికి ముందువరకు భారతదేశంలో టోల్‌ విధానం లేదు. 2004లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణ చతుర్భుజి పేరిట జాతీయ రహదారుల విస్తరణ కార్యక్రమం చేపట్టింది. నాటి నుంచే ఈ టోల్‌ విధానం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.4 లక్షల కి.మీ. జాతీయ రహదారులు ఉండగా, ఇందులో 24,996 కి.మీ.కు 7 రూపాయల వంతున టోల్‌ టాక్స్‌ వసూలు చేస్తున్నారు. రానున్న అయిదేళ్లలో టోల్‌టాక్స్‌ పరిధిలోకి 27 వేల కిలోమీటర్లను తీసుకురానున్నట్టు ఇటీవల కేంద్ర ఉపరితల రావాణా మంత్రివర్యులు గడ్కారీ స్వయంగా పార్లమెంటులో ప్రకటించారు.


ప్రజలు గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే– జాతీయ రహదారుల అభివృద్ధికి గాను కేంద్రప్రభుత్వం ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తులపై రోడ్‌ డెవలప్‌మెంట్‌ సెస్సును విధిస్తోంది. ప్రస్తుతం ప్రజలు ప్రతి లీటరు డీజిల్–పెట్రోల్‌ ధరలో 7 రూపాయలను జాతీయ రహదారుల అభివృద్ధికి చెల్లిస్తున్నారు. ఈ సెస్సు ద్వారా కేంద్ర ప్రభుత్వం 2018–19 సంవత్సరంలో 17 వేల కోట్ల రూపాయలను వసూలు చేసింది. నిబంధనల ప్రకారం ఈ నిధులను రహదారులు అభివృద్ధికి వినియోగించాలి. ఇందుకు విరుద్ధంగా ఈ నిధులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. 


ఇక రాష్ట్ర ప్రభుత్వాల టాక్స్‌ విషయానికి వస్తే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానం అమలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో స్కూటర్ల ధరను బట్టి 9శాతం, కార్లలో 10 లక్షల లోపు ధర కలిగిన వాటికి 12 శాతం, 10 లక్షలు ధర దాటిన కార్లకు 14 శాతం రోడ్‌ టాక్సు వసూలు చేస్తున్నారు. ఒక వాహనం ఉండగా మరో వాహనాన్ని కొంటే అదనంగా రెండు శాతం వసూలు చేస్తున్నారు.


ప్రపంచంలో మరే దేశంలో లేనివిధంగా భారతదేశంలో రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం పేరిట పెట్రోలు–డీజిలు ధరలను దారుణంగా పెంచుతున్నారు. 2014–2018 ప్రపంచ మార్కెట్లో పెట్రోలియం బారెల్‌ ధర 50 డాలర్ల కంటే తక్కువ ఉన్న సమయంలో ప్రభుత్వం పెట్రోలు–డీజిలు ధరలు తగ్గించకుండా పన్నుల మీద పన్నులు వేసింది. కాని పెట్రోలియం ధర పెరిగినప్పుడు మాత్రం రిటైల్‌ ధరను యథావిధిగా పెంచుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వంట గ్యాస్‌ ధర నాలుగు రూపాయలు, పెట్రోల్‌ ధర 90 పైసలు పెరిగితే బీజేపీ నేతలు ఖాళీ సిలెండర్లను, ఎడ్ల బండ్లను రోడ్లపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు వారు ఆ గతాన్ని మరచి ధరలు పెంచుతున్నారు. అంతేగాక దేశవ్యాప్తంగా ఒకే పన్ను అంటూ కబుర్లు చేప్పిన నేతలు ఆర్థిక అవసరాలు అంటూ పెట్రోలియం ఉత్పత్తుల విషయానికి వచ్చేసరికి మాటమార్చారు. ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా పెట్రోలియం ఉత్పత్తులను కూడా క్రమంగా జిఎస్‌టి పరిధిలోకి తీసుకువస్తామని ప్రకటించినా ఆచరణకు వచ్చేసరికి అదనంగా పన్నులపై పన్నులు విధిస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. 

అన్నవరపు బ్రహ్మయ్య

Updated Date - 2022-04-07T07:04:28+05:30 IST