కాబూల్ మిలటరీ ఆసుపత్రి సమీపంలో పేలుడు.. కాల్పుల మోత!

ABN , First Publish Date - 2021-11-02T21:31:16+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మరోమారు బాంబు పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ఇక్కడి మిలటరీ ఆసుపత్రి

కాబూల్ మిలటరీ ఆసుపత్రి సమీపంలో పేలుడు.. కాల్పుల మోత!

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మరోమారు బాంబు పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ఇక్కడి మిలటరీ ఆసుపత్రి సమీపంలో తొలుత పేలుళ్లు సంభవించాయని, ఆ తర్వాత తుపాకుల మోత వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పేలుడు సంభవించినట్టుగా చెబుతున్న ప్రాంతంలో నెలకొన్న దట్టమైన పొగలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. సెంట్రల్ కాబూల్‌లోని వజీర్ అక్బర్ ఖాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. 


సర్దార్ మొహమ్మద్ దావూద్ ఖాన్ ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద పేలుళ్లు సంభవించినట్టు తాలిబన్ అంతర్గతశాఖ అధికార ప్రతినిధి ఖరీ సయీద్ ఖోస్తీ తెలిపారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టం వాటిల్లినట్టు ఎలాంటి సమాచారమూ లేదన్నారు.


పేలుళ్లు జరిగిన ప్రాంతం నుంచి తప్పించుకున్న హెల్త్ వర్కర్ ఒకరు మాట్లాడుతూ.. తొలుత పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని, ఆ తర్వాత కొన్ని నిమిషాలపాటు తుపాకుల మోత వినిపించినట్టు పేర్కొన్నాడు. పది నిమిషాల తర్వాత మరోసారి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్టు తెలిపాడు. అయితే, ఈ ఘటన ఆసుపత్రిలో ప్రాంగణంలో జరిగిందా? లేదా? అన్న విషయంలో మాత్రం స్పష్టంగా తెలియదని వివరించాడు. 


ఈ ఏడాది ఆగస్టులో కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఇస్లామిక్ సేట్ ఉగ్రవాద సంస్థ మసీదులు, ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. 2017లో ఈ ఆసుపత్రిపై జరిగిన దాడిలో 30 మంది మరణించారు. తాజా ఘటనపై ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు. 

Updated Date - 2021-11-02T21:31:16+05:30 IST