పత్తి చేనులో పేలుడు

ABN , First Publish Date - 2022-01-17T05:54:11+05:30 IST

పట్టణ సమీపంలోని ఓ పత్తి పొలంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నాటుబాంబు పేలింది.

పత్తి చేనులో పేలుడు
సంఘటన జరిగిన పత్తి చేను

మహిళకు తీవ్ర గాయాలు
నాటు బాంబులుగా గుర్తింపు
పొలంలో దాచిన దుండగులు
పేలని మరో బాంబు నిర్వీర్యం
పరిశీలించిన ఫ్యాక్షన్‌ జోన్‌ పోలీసులు


పత్తికొండ, జనవరి 16: పట్టణ సమీపంలోని ఓ పత్తి పొలంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నాటుబాంబు పేలింది. ఈ ఘటనలో పొలంలో కూలి పనికి వెళ్లిన ఓ మహిళ అరచేయి తెగిపోయింది. అక్కడే ఉన్న మరో పేలని బాంబును పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఈ ఘటన పత్తికొండ ప్రాంతంలో కలకలం రేపింది. పత్తికొండ పట్టణానికి చెందిన చాంద్‌బాషాకు కర్నూలు రహదారిలో స్ర్తీశక్తి భవనం వెనుక 5 ఎకరాల పొలం ఉంది. ఈ ఏడాది పత్తి, టమోటా సాగు చేశాడు. రెండు నెలల క్రితం చాంద్‌బాషా చనిపోయాడు. ఆయన భార్య కొలిమి బీబీ పొలం పనులు చూసుకుంటోంది. పత్తి పంట చేతికి రావడంతో వారం నుంచి కోత పనులు చేపట్టారు. బీబీ ఆడపడుచు (చాంద్‌బాషా అక్క) హయ్యత్‌ బీ అదే పొలంలో కూలి పనులకు వెళ్లింది. పత్తి కోసే సమయంలో హయ్యత్‌బీకి పొలంలో నీలిరంగు ప్లాస్టిక్‌ కవర్‌లో రెండు బంతుల వంటి వస్తువులు కనిపించాయి. దారాలు చుట్టి ఉండడంతో ఒక బంతిని చేతికి తీసుకుని విప్పేందుకు ప్రయత్నించింది. దీంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. హయ్యత్‌బీ కుడిచేయి ఛిద్రమైంది. ఆ పక్కనే ఉన్న బీబీకి స్వల్ప గాయాలు అయ్యాయి. పేలుడు శబ్దానికి పొలంలో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. పక్క పొలంలో పనులు చేసుకుంటున్న రంగస్వామి శబ్దం విని అక్కడికి పరుగున చేరుకున్నాడు. పేలింది నాటుబాంబు అని గుర్తించాడు. గాయపడ్డ ఇద్దరినీ పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. పేలుడు గురించి పత్తికొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ భూపాలుడు సిబ్బందితో కలిసి సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. పేలని మరో నాటుబాంబును స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేయించారు.

ఎవరివి..? ఎవరి కోసం..?

పత్తికొండ ప్రాంతంలో దశాబ్దాల క్రితమే బాంబుల సంస్కృతి అంతరించిపోయింది. ఉన్నట్లుండి పొలాల్లో నాటుబాంబు పేలుడు సంభవించగానే అన్ని వర్గాల్లో అలజడి మొదలయింది. ఎవరైనా తమ ప్రత్యర్థులపై దాడి చేసేందుకు వీటిని సిద్ధం చేసుకున్నారా..? లేక అడవి పందుల కోసం వాటిని ఏర్పాటు చేశారా అన్న చర్చ జరుగుతోంది. అయితే పందుల వేటకు దారం చుట్టిన బాంబులను ఉపయోగించే అవకాశం లేదని, సైజు చిన్నదిగా ఉన్నా ప్రత్యర్థులను భయపెట్టేందుకు ఇలాంటివి ఉపయోగించే అవకాశం ఉందని గతంలో ప్యాక్షన్‌ గొడవలను చూసిన కొందరు వృద్ధులు చెబుతున్నారు. గొడవలతో సంబంధం లేని వ్యక్తుల పొలాల్లో నాటుబాంబులు దాచడంతో మిగిలిన పొలాలల రైతులు సైతం భయపడుతున్నారు.

కర్నూలు ఫ్యాక్షన్‌ జోన్‌ టీమ్‌ ఎస్‌ఐ సోమ్లానాయక్‌ నేతృత్వంలో పత్తికొండలో నాటుబాంబు పేలుడుపై విచారణ చేపట్టారు. సంఘటనా స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసిన నాటుబాంబును పరిశీలించారు.

దర్యాప్తు చేస్తున్నాం

నాటుబాంబు పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఫ్యాక్షన్‌ జోన్‌ టీమ్‌ కూడా పరిశీలించి వెళ్లింది. బాంబు చిన్నసైజులో ఉండడంతో పందుల వేట కోసం తయారు చేసి ఉంటారని భావిస్తున్నాం. మరింత లోతుగా విచారిస్తాం. బాంబులను ఎవరు అక్కడ పెట్టారన్నది గుర్తించే దిశగా దర్యాప్తు సాగిస్తున్నాం.
 
- భూపాలుడు, ఎస్‌ఐ

శబ్దానికి భయపడ్డాను..

మా వదిన పనిచేస్తున్న వైపు నుంచి పెద్ద శబ్దం, పొగ రావడంతో ఒక్కసారిగా భయపడి పోయాను. వెళ్లి చూస్తే ఆమె అరచేయి తెగిపోయి రక్తం కారుతోంది. మా వదిన కూలపడి ఉండడం గమనించాను. పక్క పొలాల కూలీలు సాయం చేయడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చాం. మా పొలంలో బాంబులు ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో తెలియడం లేదు.  

 - బీబీ

మంత్రించిన నిమ్మకాయ అనుకున్నా..

మా తమ్ముడు చాంద్‌బాషా పొలంలో పత్తి కోసేందుకు మరదలు బీబీతో కలిసి శనివారం ఉదయమే వెళ్లాను. మధ్యాహ్న 3.30గంటల ప్రాంతంలో అవతల సాలలో నా మరదలు, ఇవతల నేను పత్తి కోస్తున్నాం. నా పక్కనే నీలిరంగు కవర్‌లో నిమ్మకాయల వంటివి కనిపిస్తే కవర్‌ విప్పి చూశాను. దారాలు చుట్టి ఉండడంతో ఏదైన మంత్రించి అక్కడ పెట్టారేమో అని దారం తీసేందుకు ప్రయత్నించాను. నేను పట్టుకున్న బంతి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. నా అరచేయి ఛిద్రమైంది. నాలుగు వేళ్లు తెగిపోయాయి. కాళ్లకు గాయాలయ్యాయి. భయంతో బిగుసుకుపోయాను. ఆ శబ్దానికి నా మరదలు, పక్క పొలం రైతులు పరిగెత్తుకుని వచ్చి నన్ను ఆసుపత్రికి తీసుకువచ్చారు. నాలుగు వేళ్లు ఇక రావని వైద్యులు చెబుతున్నారు. 13 ఏళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. ముగ్గురు కొడుకులను, మాటలు రాని కూతురును కూలి పనులు చేసి పోషించాను. ముగ్గురు కొడుకులకు పెళ్లి చేశాను. మాటలు రాని కూతురికి వివాహం చేయలేకపోయాను. నేనే పోషిస్తున్నాను. బాంబు పేలి చేయి పనికిరాకుండా పోయింది. ఇకపై ఎలా బతకాలి..? నా కూతురు పరిస్థితి ఏమిటి..? ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.                                 

- హయ్యత్‌ బీ

Updated Date - 2022-01-17T05:54:11+05:30 IST