పొలాల్లో పేలుడు పదార్థాలు

ABN , First Publish Date - 2020-10-21T11:33:13+05:30 IST

హత్తి బెళగల్‌ సమీపంలో రెండేళ్ల క్రితం ఘోరం చోటుచేసుకుంది. మైనింగ్‌ కోసం నిల్వ చేసిన భారీ మందుగుండు సామగ్రి పేలుడు కారణంగా 13 మంది మృతి చెందారు.

పొలాల్లో పేలుడు పదార్థాలు

పోతుదొడ్డి కేంద్రంగా వ్యాపారం

అనుమతులు లేకుండా దందా..?

గోదాము వద్ద వాచ్‌మన్‌ కూడా లేడు

హత్తి బెలగళ్‌ ప్రమాదాన్ని మరిచారా..?


ప్యాపిలి, అక్టోబరు 20: హత్తి బెళగల్‌ సమీపంలో రెండేళ్ల క్రితం ఘోరం చోటుచేసుకుంది. మైనింగ్‌ కోసం నిల్వ చేసిన భారీ మందుగుండు సామగ్రి పేలుడు కారణంగా 13 మంది మృతి చెందారు. వీరందరూ జార్ఖండ్‌, ఒడిస్సా, చత్తీష్‌ఘడ్‌కు చెందిన కార్మికులు. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు తేల్చారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ దుర్ఘటన తరువాత జిల్లాలోని అన్ని గనులనూ అధికారులు తనిఖీ చేశారు. హడావుడి చేశారు. కానీ ఆ తరువాత పట్టించుకోవడం మానేశారు. దీంతో జిల్లాలో మరోమారు పేలుడు పదార్థాల అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది.


పొలాల్లో గోదాము

ప్యాపిలి మండలంలోని పోతుదొడ్డి గ్రామం కేంద్రంగా పేలుడు సామగ్రి (జిలెటిన్‌ స్టిక్స్‌ ఎక్స్‌ప్లోజర్స్‌) అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యాపారి నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యాపారం సాగిస్తుట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదారేళ్లుగా పోతుదొడ్డి అడ్డాగా జిలెటిన్‌ స్టిక్స్‌ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని సమాచారం. ఈ ప్రాంతంలో మైనింగ్‌ ఎక్కువగా ఉంది. పేలుడు పదార్థాలకు డిమాండ్‌ ఎక్కువ. దీన్ని ఆసరగా చేసుకుని గ్రా సమీపంలోని ఓ పొలంలో గోదాము ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు పేలుడు సామగ్రిని సరఫరా చేస్తున్నారని తెలిసింది. 


రాత్రిపూట గోప్యంగా..

పోతుదొడ్డి పొలాల్లో ఉన్న గోదాము వద్దకు అర్ధరాత్రి సమయంలో అక్రమంగా పేలుడు పదార్థాల లోడుతో వాహనాలు వస్తున్నట్లు తెలిసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ నిల్వ ఉంచుతున్నారని, పొరపాటున పేలితే తమ పరిస్థితి ఏమిటని సమీప గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గోదాము నుంచి నిత్యం జిలెటిన్‌ స్టిక్స్‌ను తరలిస్తుంటారని, ఎలాంటి భద్రతా చర్యలూ పాటించడం లేదని రైతులు అంటున్నారు. గోదాము వద్ద వాచ్‌మన్‌ కూడా లేరని, పొరపాటున పశువులు ఆ ప్రాంతానికి వెళితే పెను ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


రూ.లక్షల్లో వ్యాపారం

పోతుదొడ్డి కేంద్రంగా ప్రతి నెలా రూ.50 లక్షలకు పైగా విలువైన పేలుడు పదార్థాలను అమ్ముతున్నట్లు తెలిసింది. హైదరాబాదు ప్రాంతం నుంచి ఇక్కడికి పేలుడు పదార్థాలను తీసుకువస్తున్నట్లు తెలిసింది. 


విచారిస్తాం

పోతుదొడ్డి సమీపంలో పేలుడు పదార్థాల నిల్వలు, అక్రమ వ్యాపారం గురించి విచారణ జరిపిస్తాం. అనుమతి లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు తేలితే గోదామును సీజ్‌ చేస్తాం. వ్యాపారిపై చర్యలు తీసుకుంటాం.

- శివరాముడు, తహసీల్దారు, ప్యాపిలి 

Updated Date - 2020-10-21T11:33:13+05:30 IST