Express buses: ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో పార్శిల్‌ సేవలు

ABN , First Publish Date - 2022-08-03T16:16:11+05:30 IST

ప్రభుత్వ రవాణా సంస్థ ఎక్స్‌ప్రెస్‌ బస్సు(Express buses)ల్లో బుధవారం నుంచి పార్శిల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలివిడతగా ఏడు నగరాల

Express buses: ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో పార్శిల్‌ సేవలు

                                        - నేటినుంచి అందుబాటులోకి 


చెన్నై, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రవాణా సంస్థ ఎక్స్‌ప్రెస్‌ బస్సు(Express buses)ల్లో బుధవారం నుంచి పార్శిల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలివిడతగా ఏడు నగరాల నుంచి చెన్నైకి పార్శిల్‌ సేవలు ప్రారంభిస్తున్నట్లు రవాణా సంస్థ(Transport company) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇళంగోవన్‌ తెలిపారు. ఆ పార్శిల్‌ సేవలకు మంత్లీ, డైలీ పద్ధతిన అద్దె నిర్ణయించామని, ఆమ్నీ బస్సులు, లారీల్లో చెల్లించే అద్దెకన్నా తక్కువలో వ్యాపారులు, రైతులు, ప్రైవేటు సంస్థలు పార్శిళ్లను చెన్నై నగరానికి సకాలంలో చేరవేయగలుగుతారని తెలిపారు. అంతే కాకుండా 24 గంటల్లోగానే పార్శిళ్లను గమ్యస్థానానికి చేర్చుతామన్నారు. తొలివిడతగా తిరుచ్చి, మదురై, తిరునల్వేలి, తూత్తుకుడి, సెంగోటై, కోయంబత్తూరు(Coimbatore), హోసూరు నగరాల నుంచి చెన్నైకి నడిపే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ పార్శిల్‌ సేవలు ప్రారంభమవుతాయన్నారు. తిరునల్వేలి నుంచి చెన్నైకి 80 కేజీల పార్శిల్‌కు రూ.390 చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సరకులను కోయంబేడు(Koyambedu) బస్‌స్టేషన్‌లో పొందాల్సి ఉంటుందన్నారు. ఇదే విధంగా తిరుగు ప్రయాణంలో చెన్నై నుంచి ఆ ఏడు నగరాలకు రోజూ పార్శిల్‌ బుకింగ్‌ చేసుకోవచ్చన్నారు. నెలవారి ప్రాతిపదికగా పార్శిల్‌ పంపించేందుకు మంత్లీ పాస్‌ ఇస్తామని, ఆ పాస్‌లో ఏఏ రోజుల్లో పార్శిళ్ళను పంపుతారో ఆ తేదీలను టిక్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇదే విధంగా త్వరలోనే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కొరియర్‌ సేవలను కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Updated Date - 2022-08-03T16:16:11+05:30 IST