ప్రైవేట్‌కు పొడిచెత్త అప్పగింత

ABN , First Publish Date - 2020-07-06T10:11:25+05:30 IST

బొబ్బిలి మునిసిపాలిటీలో రోజువారీగా ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను ప్రైవేట్‌ సంస్థకు అప్పగించేందుకు ఒప్పందం కుదిరింది.

ప్రైవేట్‌కు పొడిచెత్త అప్పగింత

బొబ్బిలి, జూలై 5: బొబ్బిలి మునిసిపాలిటీలో రోజువారీగా ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను ప్రైవేట్‌ సంస్థకు అప్పగించేందుకు ఒప్పందం కుదిరింది.   హైదరాబాద్‌కు చెందిన మెసర్స్‌ బంకా బయో లూ కంపెనీకి బీవోటీ (బిల్ట్‌, ఆపరేషన్‌, ట్రాన్స్‌ఫర్‌) ప్రాతిపదికన పదేళ్ల పాటు చెత్తను ఉచితంగా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఇందుకోసం రామన్నదొరవలస సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పార్కులో 50 సెంట్ల భూమిని సదరు సంస్థకు కేటాయించారు.  రోజూ 20.50 మెట్రిక్‌ టన్నుల పొడిచెత్తను మునిసిపల్‌ పారిశుధ్య కార్మికు లతో సేకరించి వారికి ఇస్తారు.  గత ప్రభుత్వ హయాంలో తడిచెత్తను క్యూబ్‌ బయో ఎనర్జీ సంస్థ కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకు 2.5 ఎకరాలను 20 ఏళ్ల పాటు కేటాయించారు. చదరపు మీటరుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ. 10,115 ఆ సంస్థ తడిచెత్త కోసం మునిసిపాలిటీకి చెల్లిస్తుంది. పొడిచెత్తను మాత్రం ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయించారు. 


మరుగుదొడ్ల నుంచి సేకరించిన మల బురదను ట్రీట్‌ మెంట్‌ చేసేందు కు ఫీకల్‌ స్లడ్జ్‌  ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు సాలిడ్‌ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ పార్కులో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం బంకా బయో లూ కంపెనీకి భూమి, విద్యుత్‌, బోర్‌వెల్‌ను మునిసిపాలిటీ నిధులతో సమకూర్చనున్నారు.  ఇంటింటి నుంచి సేకరించే తడి, పొడి చెత్తలను రెండు వేర్వేరు ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించా లని ప్రభుత్వం ఆదేశించిందని  మునిసిపల్‌ కమిషనర్‌ ఎంఎం నాయుడు తెలిపారు. ఇప్పటికే తడి చెత్తను అప్పగించగా, రేపో మాపో పొడిచెత్తను కూడా అప్పగిస్తామన్నారు. 31 వార్డుల పరిధిలో  14437 ఇళ్లు,  66.4 కిలోలమీటర్ల కాలువలు, 42 కిలోమీటర్ల రహదారులు, 874 వ్యాపార సంస్థల నుంచి సేకరించిన చెత్తలను  ఆ సంస్థలు వేర్వేరుగా ట్రీట్‌మెంట్‌ చేస్తాయని తెలిపారు. మరుగుదొడ్ల నుంచి సేకరించిన మలాన్ని కూడా ట్రీట్‌మెంట్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.  మల బురదను సేకరించే వాహ నాలకు జియోట్యాగింగ్‌ ఉంటుందని చెప్పారు. 

Updated Date - 2020-07-06T10:11:25+05:30 IST