30 వరకు సెలవుల పొడిగింపు

ABN , First Publish Date - 2022-01-17T07:49:13+05:30 IST

రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులను ఈ నెల 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇంతకుముందు ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను

30 వరకు సెలవుల పొడిగింపు

అన్ని విద్యాసంస్థలకు పొడిగించిన ప్రభుత్వం..

కేసులు పెరుగుతుండడం వల్లే


హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులను ఈ నెల 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇంతకుముందు ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సెలవులను పొడిగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకూ ఇది వర్తించనుంది. మెడికల్‌ కాలేజీలు మినహా ఇతర విద్యాసంస్థలన్నింటికీ ఈ సెలవులు అమల్లోకి వస్తాయి. కాగా, ప్రభుత్వం సెలవులను పొడిగించడంతో ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ విద్యా బోధనపై దృష్టి పెట్టాయి. పలు స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్‌ క్లాసులు ఉంటాయంటూ విద్యార్థుల ఫోన్లకు సమాచారం అందిస్తున్నాయి.


ప్రస్తుతం ఉన్న కరోనా తీవ్రత ఎన్ని రోజులపాటు కొనసాగుతుందనే విషయంలో స్పష్టత లేకపోవడంతో ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసుల వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కూడా ఇలాంటి సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులనే నిర్వహించాయి. కాగా, ప్రభుత్వ పరిధిలోని విద్యా సంస్థలకు సంబంధించి ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ నెల 30 తర్వాత కూడా సెలవులను మళ్లీ పొడిగించాల్సి వస్తే.. అప్పుడు ఆన్‌లైన్‌ బోధనపై నిర్ణయం తీసుకునే అవకాశ ఉండవచ్చని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గురుకుల విద్యాసంస్థలు మాత్రం ఆన్‌లైన్‌ బోధనకు సిద్ధమవుతున్నాయి. మైనారిటీ గురుకుల సొసైటీ ఓ అడుగు ముందుకేసి.. సోమవారం (ఈ నెల 17) నుంచే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావాలంటూ ఆ సొసైటీ పరిధిలోని విద్యాసంస్థలు.. విద్యార్థుల, వారి తల్లిదండ్రుల ఫోన్లకు ఆదివారం సాయంత్రానికే ఎస్‌ఎంఎ్‌సలు పంపించాయి. మిగతా గురుకుల సొసైటీలు కూడా దశలవారీగా ఆన్‌లైన్‌ బోధనకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, టీచర్లు మినహా ప్రధానోపాధ్యాయులు, ఇతర సిబ్బంది సోమవారం నుంచి ఎప్పటిలాగే గురుకులాలకు హాజరుకావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.


ప్రవేశ పరీక్షలపైనా ఎఫెక్ట్‌ !

గురుకులాల్లో ఆయా తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలపైనా కరోనా, సెలవులు, ఆన్‌లైన్‌ క్లాసుల ప్రభావం పడే అవకాశం ఉంది. 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు ముందస్తుగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని గురుకులాలు సన్నద్ధమయ్యాయి. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ముందస్తు నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది. గతంలో మాదిరిగానే ప్రవేశ పరీక్షల నిర్వహణ, అడ్మిషన్ల ప్రక్రియపైనా ఎఫెక్ట్‌ పడనుంది. కరోనా కేసులు పెరుగుతుండటం, విద్యా సంస్థలకు సెలవులు  ప్రకటించిన నేపథ్యంలో నేటి నుంచి అన్ని వర్సిటీల పరిధిలో నిర్వహించే పరీక్షల్ని అధికారులు వాయిదా వేశారు. ఆయా పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించనున్నది త్వరలోనే ప్రకటిస్తారు. కాగా, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీలకు 30 వరకు సెలవులను పొడిగించినట్లు యూనివర్సిటీ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. 


కేసీఆర్‌కు విద్యావంతుల తెలంగాణ ఇష్టం లేదు: ప్రవీణ్‌

విద్యావంతులతో కూడిన తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్‌కు ఇష్టంలేదని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. గుళ్లలో, బస్సుల్లో, సినిమా హాళ్లలో, బార్లలో, రాజకీయ సమావేశాల్లో, రైతుబంధు సంబరాల్లో.. ఇలా ఎక్కడ చూసినా జనం కనిపిస్తున్నారని, వారందరికీ రాని ఒమిక్రాన్‌ కేసులు.. కేవలం స్కూళ్లలో మాత్రమే వస్తాయా? అని ప్రశ్నించారు. ఇదెక్కడి విచిత్రం? అంటూ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. కాగా, సంక్రాంతి సెలవులు ముగియడంతో ఏపీలో పాఠశాలలు, ఇంటర్‌ కళాశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవులపై పునరాలోచన లేదని ఏపీ ప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసింది.  


పొడిగింపు సరికాదు: ట్రస్మా, యూటీఎఫ్‌

విద్యాసంస్థలకు సెలవులను పొడిగించడం పట్ల తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ట్రస్మా) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. థియేటర్లు, మాల్స్‌, వైన్స్‌, బార్స్‌, క్లబ్స్‌, ప్రజలు గుమిగూడే పొలిటికల్‌ సమావేశాలకు లేని సెలవులు విద్యాసంస్థలకు ఎందుకని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, ప్రతినిధులు మధుసూధన్‌, రమణారావు తదితరులు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. సెలవుల పొడిగింపు వల్ల విద్యార్థుల చదువు దెబ్బతింటుందని పేర్కొన్నారు. మరోవైపు విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు సబబుగా లేదని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) అభిప్రాయపడింది. రాష్ట్రంలో సెప్టెంబరు 1 నుంచే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైందని, 50 శాతం సిలబస్‌ కూడా పూర్తి కాలేని ఫెడరేషన్‌ అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండేళ్లుగా సరైన విద్యా బోధన జరగడంలేదని, పరీక్షలు కూడా నిర్వహించలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు నమోదవుతున్నా.. తీవ్రత తక్కువగానే ఉందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2022-01-17T07:49:13+05:30 IST