టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు గడువు పెంపు

ABN , First Publish Date - 2021-03-01T09:19:48+05:30 IST

: పార్టీ సభ్యత్వ నమోదు గడువు పెంచాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయించింది.

టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు గడువు పెంపు

పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ వాయిదా

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ నిర్ణయం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి)అలాగే, గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాలకు సంబంధించిన కమిటీల ఏర్పాటు ప్రక్రియను వాయిదా వేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం పార్టీ సభ్యత్వ నమోదు గడువు ఆదివారంతో ముగియాలి. అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటు మార్చి నెలలో పూర్తి కావాలి. కానీ ప్రస్తుతం ఆరు (వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌) ఉమ్మడి జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కావడంతో, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఎక్కువగా దృష్టి సారించలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ సభ్యత్వ నమోదు గడువు పెంచుతున్నట్లు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆదివారం క్షేత్ర స్థాయి నాయకత్వానికి సమాచారం చేరవేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ మార్చి 14న జరగనుంది. ఆ తర్వాత మరో వారం రోజులు సభ్యత్వ నమోదుకు అవకాశం ఇవ్వాలని, అనంతరం పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలని అధిష్ఠానం ముఖ్యులు భావిస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు(ప్రతి రెండేళ్లకు ఒకసారి), రాష్ట్ర అధ్యక్ష పదవి (ప్రతి నాలుగేళ్లకు ఒకసారి) సహా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగించడానికి టీఆర్‌ఎస్‌ వార్షికోత్సవం (ఏప్రిల్‌ 27) వరకూ సమయం ఉండడం వల్ల ఇబ్బంది కాబోదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉండగా, 70 లక్షల పార్టీ సభ్యత్వ నమోదు రశీదులు పంపిణీ చేయగా, రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాల్లో లక్ష్యాన్ని మించి నమోదు జరిగినట్లు అధిష్ఠానం వర్గాలు చెబుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో సభ్యత్వ పునరుద్ధరణ, నమోదు కలుపుకొని 50వేలు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, పాతబస్తీలోని కొన్ని నియోజకవర్గాలను మినహా.. అన్ని చోట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 70 లక్షలు దాటవచ్చని తాజాగా అంచనా వేస్తున్నాయి. 

Updated Date - 2021-03-01T09:19:48+05:30 IST