విమాన ప్రయాణాలపై ఆంక్షలను సడలించండి... గల్ఫ్ దేశాలను కోరిన జైశంకర్...

ABN , First Publish Date - 2021-11-11T00:15:59+05:30 IST

భారత దేశం నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలను

విమాన ప్రయాణాలపై ఆంక్షలను సడలించండి... గల్ఫ్ దేశాలను కోరిన జైశంకర్...

న్యూఢిల్లీ : భారత దేశం నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలను మరింత సడలించాలని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కోరారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను గుర్తించాలని కూడా కోరారు. జీసీసీ సెక్రటరీ జనరల్ నయేఫ్ ఫలాహ్ ముబారక్ అల్-హజరఫ్‌తో ఆయన బుధవారం సమావేశమయ్యారు. వీరిద్దరూ భారత దేశం-జీసీసీ సంబంధాలపై సమీక్షించి, వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించారు. 


నయేఫ్ ఫలాహ్ కువైట్ మాజీ ఆర్థిక మంత్రి. ఆయన 2020 ఫిబ్రవరిలో జీసీసీ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. నవంబరు 10, 11 తేదీల్లో ఆయన భారత దేశంలో పర్యటించేందుకు న్యూఢిల్లీ వచ్చారు. జైశంకర్, నయేఫ్ ఫలాహ్ భారత్-జీసీసీ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మార్గాలపై చర్చించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.


జీసీసీలో బహ్రెయిన్, కువైట్, ఒమన్, కతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ప్రాంతీయ రాజకీయ, ఆర్థిక సహకారం కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఈ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పని చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో భారత దేశానికి వచ్చినవారు తిరిగి జీవనోపాధి కోసం ఈ దేశాలకు వెళ్ళడానికి వీలుగా ప్రయాణాలపై ఆంక్షలను సడలించాలని భారత దేశం కోరుతోంది. 


కోవిడ్ మహమ్మారి సమయంలో భారతీయుల పట్ల శ్రద్ధ వహించినందుకు, కోవిడ్ రెండో ప్రభంజనం సమయంలో (ఏప్రిల్, మే నెలల్లో) వైద్యపరమైన సహాయం చేసినందుకు  జీసీసీ దేశాలకు జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు. 


Updated Date - 2021-11-11T00:15:59+05:30 IST