యూరోపియన్ దేశాలకు దీటుగా జవాబు చెప్పిన జైశంకర్

ABN , First Publish Date - 2022-04-26T22:27:24+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను వ్యతిరేకించాలని ఒత్తిడి

యూరోపియన్ దేశాలకు దీటుగా జవాబు చెప్పిన జైశంకర్

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను వ్యతిరేకించాలని ఒత్తిడి తెస్తున్న యూరోపియన్ దేశాలకు భారత్ గట్టి జవాబు చెప్పింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాశ్చాత్య దేశాలు వెనుకకు వెళ్ళడం వల్ల ఎదురవుతున్న ఫలితాలను, ఆసియాలో పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్న ఒప్పందాలు, నియమాల అమలుకు ఎదురవుతున్న సవాళ్ళపట్ల ఆ దేశాలు మౌనంగా ఉండటాన్ని ఎత్తి చూపించింది. 


భౌగోళిక రాజకీయాలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన రైజినా డయలాగ్‌లో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ మంగళవారం మాట్లాడారు. యూరోపియన్ దేశాల నేతలు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. నార్వే విదేశాంగ మంత్రి అన్నికెన్ హుయిట్‌ఫెల్‌డ్ట్ మాట్లాడుతూ, ఓ నియంతృత్వ దేశం ఓ ప్రజాస్వామిక దేశంపై దాడి చేయడానికి ఉదాహరణ రష్యా ప్రదర్శిస్తున్న హింసాత్మక ప్రవర్తన అని చెప్తూ, స్వేచ్ఛా సమాజాలను సమర్థించడంలో భారత దేశం పాత్ర గురించి ప్రశ్నించారు. లగ్జెంబెర్గ్ విదేశాంగ మంత్రి జీన్ అస్సెల్‌బోర్న్ మాట్లాడుతూ, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ ఇటీవల భారత దేశంలో పర్యటించినపుడు ఉక్రెయిన్‌పై తాము చేపట్టిన చర్యలను సమర్థించుకుంటూ ఏమైనా చెప్పారా? అని ప్రశ్నించారు. 


జైశంకర్ సమాధానం చెప్తూ, ఆసియాలో పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్న నియమాల ఆధారంగా పని చేస్తున్న వ్యవస్థకు సవాళ్ళు ఎదురైనపుడు దాదాపు ఓ దశాబ్దంపాటు యూరోపియన్ దేశాలు స్పందించలేదని గుర్తు చేశారు. దాదాపు ఓ సంవత్సరం క్రితం ఆఫ్ఘనిస్థాన్‌లో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో యావత్తు పౌర సమాజాన్ని ప్రపంచం ఓ బస్సు క్రిందకు విసిరేసిందన్నారు. 


‘‘ఆసియాలో నియమాల ఆధారిత వ్యవస్థకు సవాళ్లు ఎదురైనపుడు మాకు యూరోపు నుంచి వచ్చిన సలహా ఏమిటంటే, మరింత వ్యాపారం చేయండి అని. మేం మీకు అలాంటి సలహా ఇవ్వడం లేదు’’ అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ విషయంలో ప్రపంచం చేసినదానిని నియమాల ఆధారిత వ్యవస్థలో ఏ భాగం సమర్థించిందో చూపించాలని కోరారు. 


యుద్ధం వల్ల విజేతలు ఉండరు 

సిద్ధాంతాలు, విలువల విషయంలో ఉక్రెయిన్ యుద్ధం చాలా ముఖ్యమైన అంశమని తెలిపారు. ఇంధనం ధరలు, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, ఆసియా, ఆఫ్రికాలలో రకరకాల అంతరాయాలు ఏర్పడుతుండటం దీని పర్యవసానాలేనని చెప్పారు. యుద్ధం జరగడం చూడాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. ఈ ఘర్షణ వల్ల విజయం సాధించేవారు ఎవరూ ఉండరని చెప్పారు. దౌత్యం, చర్చలకు తిరిగి రావడానికి ఏదో ఒక మార్గాన్ని అన్వేషించవలసి ఉందని తెలిపారు. అది జరగాలంటే ముందుగా యుద్ధం ఆగిపోవాలని చెప్పారు. 


ఆసియాలో పదేళ్ళ నుంచి...

స్వీడన్ మాజీ ప్రధాన మంత్రి కార్ల్ బిల్‌డ్‌ట్ మాట్లాడుతూ, అనుమతించదగని పనులు చేయడానికి చైనాను ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రేరేపిస్తుందా? అని అడిగారు. జైశంకర్ సమాధానం చెప్తూ, యూరోపులో జరుగుతున్నవి ఆసియాలో కూడా జరిగే అవకాశం ఉందని, ఆసియా ఆందోళన చెందాలని గత రెండు నెలల నుంచి యూరోపు దేశాలు వాదిస్తుండటాన్ని గమనిస్తున్నామని చెప్పారు. ఏం జరుగుతోందో ఊహించండి అన్నారు. గత పదేళ్ళ నుంచి ఆసియాలో ఇటువంటి కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇప్పుడు యూరోపు వాటి గురించి పట్టించుకోకపోవచ్చునని, కాబట్టి ఇది యూరోప్‌నకు మేలుకొలుపు సందేశమని, ఆసియా వైపు కూడా చూడాలనే మేలుకొలుపు సందేశమని చెప్పారు. 


భారత్ కష్టాలు

చైనా, పాకిస్థాన్‌ల నుంచి భారత దేశానికి ఎదురవుతున్న సమస్యలను కూడా జైశంకర్ పరోక్షంగా ప్రస్తావించారు. ఆసియాలో కొన్ని భాగాలకు సరిహద్దుల పరిష్కారం జరగలేదని చెప్పారు. ప్రభుత్వాలే ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్నాయన్నారు. ఓ దశాబ్దానికి పైగా ఆసియాలోని నియమాల ఆధారిత వ్యవస్థ ఒత్తిడిలో ఉందనే విషయాన్ని మిగతా ప్రపంచం గుర్తించడం ముఖ్యమని చెప్పారు. 


గత రెండేళ్ళలో... 

గడచిన రెండేళ్ళలో కోవిడ్-19 మహమ్మారి, ఆఫ్ఘనిస్థాన్, ఉక్రెయిన్ దేశాల్లో పరిస్థితులు; పాశ్చాత్య దేశాలు, రష్యా మధ్య ఘర్షణ; అమెరికా-చైనా మధ్య సంఘర్షణ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప బాధ్యతలను చేపట్టడానికి తగిన సామర్థ్యాలను స్వయంసమృద్ధ భారత దేశం కలిగియుండాలని చెప్పారు. 


ఒత్తిళ్ళకు తలొగ్గని భారత్

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను భారత్ విమర్శించడంలేదు. డిస్కౌంట్ ధరకు చమురును ఇచ్చేందుకు రష్యా ముందుకు వచ్చినపుడు స్వాగతించింది. వైఖరిని మార్చుకోవాలని పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్ళకు భారత్ తలొగ్గడం లేదు. 


Updated Date - 2022-04-26T22:27:24+05:30 IST