యూఏఈలోని భారతీయ సమాజంతో.. మంత్రి జయశంకర్ వర్చువల్‌ భేటీ

ABN , First Publish Date - 2020-11-27T00:40:24+05:30 IST

విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గురువారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని భారతీయ సమాజ సభ్యులతో ఆన్‌లైన్(వర్చువల్)లో సంభాషించారు.

యూఏఈలోని భారతీయ సమాజంతో.. మంత్రి జయశంకర్ వర్చువల్‌ భేటీ

అబుధాబి: విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గురువారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని భారతీయ సమాజ సభ్యులతో ఆన్‌లైన్(వర్చువల్)లో సంభాషించారు. మహమ్మారి కరోనా వైరస్ వల్ల అక్కడ ప్రవాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుటుందని వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం జయశంకర్ యూఏఈ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం రాత్రి మంత్రి యూఏఈ చేరుకున్నారు. అంతకుముందు ఆయన బహ్రెయిన్‌లో రెండు రోజులు పర్యటించారు. బహ్రెయిన్, యూఏఈ, సీషెల్స్ దేశాల్లో ఆరు రోజులు జయశంకర్ పర్యటన కొనసాగనుంది. ఇప్పటికే రెండు రోజులు బహ్రెయిన్‌లో పర్యటించిన మంత్రి.. బుధవారం రాత్రి యూఏఈ చేరుకున్నారు. ఈ సందర్భంగా వర్చువల్ విధానం ద్వారా అక్కడి భారతీయ సమాజ సభ్యులతో ఆయన మాట్లాడారు. ఈ సమావేశం తనకెంతో సంతృప్తినిచ్చిందని మీటింగ్ అనంతరం తన ట్విటర్ ఖాతాలో మంత్రి రాసుకొచ్చారు. 


ఇక యూఏఈలోని భారత రాయబార కార్యాలయం వెబ్‌సైట్ డేటా ప్రకారం ఆ దేశంలో సుమారు 30.4 లక్షల మంది భారత ప్రవాసులు ఉన్నట్లు సమాచారం. యూఏఈలో అతిపెద్ద ప్రవాస సమాజం మనదే. ఆ దేశ జనాభాలో ప్రవాస భారతీయుల వాటా 30 శాతం అని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. భారతదేశంలోని కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచే అధికంగా ప్రవాసులు యూఏఈలో ఉన్నట్లు ఎంబసీ లెక్కలు చెబుతున్నాయి. కాగా, యూఏఈ పర్యటనలో భాగంగా మొదట జయశంకర్ అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో భేటీ అయ్యారు. ఇక 'వందే భారత్ మిషన్‌' ద్వారా యూఏఈలో చిక్కుకుపోయిన భారత ప్రవాసులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం ప్రత్యేక విమానాలు నడిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే యూఏఈతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం కూడా చేసుకుంది.  



Updated Date - 2020-11-27T00:40:24+05:30 IST