2021 తుపాన్ విపత్తుల్లో 1750 మంది మృతి...ఐఎండీ నివేదిక వెల్లడి

ABN , First Publish Date - 2022-01-15T13:26:50+05:30 IST

దేశంలో 2021వ సంవత్సరంలో సంభవించిన విపత్తుల్లో 1750 మంది మరణించారని భారత వాతావరణ విభాగం...

2021 తుపాన్ విపత్తుల్లో 1750 మంది మృతి...ఐఎండీ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో 2021వ సంవత్సరంలో సంభవించిన విపత్తుల్లో 1750 మంది మరణించారని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, మెరుపులు, తుపానులు, చలి తరంగ సంఘటనల్లో 1750 మంది మరణించారని ఐఎండీ తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దేశంలోనే మహారాష్ట్రలో ప్రకృతి వైపరీత్యాల వల్ల అత్యధికంగా 350మంది మరణించారు. ఆ తర్వాత ఒడిశా రాష్ట్రంలో విపత్తుల వల్ల మరణాలు అధికంగా సంభవించాయి. మహారాష్ట్రలో భారీవర్షాలు, తుపాన్లు, వరదల వల్ల 340 మందికిపైగా మరణించారు.గత ఏడాది దేశంలో ఉరుములు, మెరుపుల వల్ల 780 మంది ప్రాణాలు కోల్పోయారు. 


భారీవర్షాలు, వరదల వల్ల 759 మంది మృత్యువాత పడ్డారు. తుపాన్లు 172 మందిని బలిగొన్నాయి. ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా 32 మంది మరణించారు.భారీ వర్షాలు, వరదల కారణంగా మహారాష్ట్రలో 215 మంది, ఉత్తరాఖండ్‌లో 143 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో 55 మంది, కేరళలో 53 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 46 మంది మరణించినట్లు ఐఎండీ నివేదిక పేర్కొంది.ఉరుములు, మెరుపులతో ఒడిశాలో 213, మధ్యప్రదేశ్‌లో 156, బీహార్‌లో 89, మహారాష్ట్రలో 76, పశ్చిమ బెంగాల్‌లో 58, జార్ఖండ్‌లో 54, ఉత్తరప్రదేశ్‌లో 49, రాజస్థాన్‌లో 48 మంది ప్రాణాలు కోల్పోయారు.ఒడిశాలో 223 మంది, మధ్యప్రదేశ్‌లో 191, ఉత్తరాఖండ్‌లో 147, బీహార్‌లో 102, ఉత్తరప్రదేశ్‌లో 98, గుజరాత్‌లో 92, పశ్చిమ బెంగాల్‌లో 86 మంది మరణించినట్లు వాతావరణ శాఖ తెలిపింది.



కేరళలో 62, రాజస్థాన్‌లో 62, హిమాచల్‌ప్రదేశ్‌లో 59, జార్ఖండ్‌లో 57, ఆంధ్రప్రదేశ్‌లో 50, కర్ణాటకలో 45, తమిళనాడులో 34, జమ్మూ కాశ్మీర్‌లో 32, తెలంగాణలో 25, అస్సాంలో 14 మంది మరణించారు.తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో నమోదైన ఏడు మరణాలలో నాలుగు భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించాయని ఐఎండీ డేటా వివరించింది. 

Updated Date - 2022-01-15T13:26:50+05:30 IST