కంటి నరాల బలహీనత తగ్గేందుకు ఏం చేయాలి?

ABN , First Publish Date - 2021-12-31T19:10:10+05:30 IST

నాకు చిన్నతనం నుండే కళ్లద్దాలు ఉన్నాయి. కంటిలో నరాలు బలహీనంగా ఉన్నాయన్నారు. ఈ నరాల బలహీనత తగ్గేందుకు ఎలాంటి ఆహారం

కంటి నరాల బలహీనత తగ్గేందుకు ఏం చేయాలి?

ఆంధ్రజ్యోతి(31-12-2021)

ప్రశ్న: నాకు చిన్నతనం నుండే కళ్లద్దాలు ఉన్నాయి. కంటిలో నరాలు బలహీనంగా ఉన్నాయన్నారు. ఈ నరాల బలహీనత తగ్గేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


- మౌనిక, వైజాగ్‌


డాక్టర్ సమాధానం: మన ఆహారంలోని పలురకాల విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్‌)కంటిచూపు ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. లుటీన్‌, జియాగ్జాంథిన్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూరలు, గుడ్లు, బ్రొకోలీ, స్వీట్‌ కార్న్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల వయసుతో వచ్చే కంటి వ్యాధులు అదుపులో ఉంచవచ్చని పరిశోధనల్లో తేలింది. విటమిన్‌- సి ఎక్కువగా ఉండే తాజా పళ్ళు, క్యాప్సికమ్‌, పాలకూర వంటివి తీసుకోవడం వల్ల కాటరాక్ట్‌ సమస్య రాకుండా నివారించవచ్చు. ముడిధాన్యాలు, బాదం, ఆక్రోట్‌ లాంటి గింజలు, ఆకుకూరలలో ఉండే విటమిన్‌ - ఇ కూడా కంటిచూపు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో అవసరం. విటమిన్‌ - ఇ మన కంటి కణజాలం ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌ని అడ్డుకుని ఎక్కువ కాలం చూపు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఆవశ్యక ఫాటీయాసిడ్స్‌ ఒమేగా 3, ఒమేగా 6లు కూడా కంటి చూపు ఆరోగ్యానికి అవసరమే. చేపలు, గుడ్లు, ఆక్రోట్‌, బాదం, అవిసె గింజలు తదితర ఆహారం తీసుకుంటే ఈ ఫ్యాటీ ఆసిడ్స్‌ లభిస్తాయి. విటమిన్‌ - ఎ, బీటా కెరోటిన్‌ అధికంగా ఉండే ఆహారమైన క్యారెట్లు, ఆకుకూరలు, గింజలు కంటిలోని రెటీనా ఆరోగ్యానికి అవసరం. జింక్‌ అధికంగా ఉండే మాంసాహారం, పాలు, బీన్స్‌ లాంటివి ఆహారంలో భాగం చేసుకుంటే కంటి ఆరోగ్యాన్ని చల్లగా కాపాడుకోవచ్చు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-12-31T19:10:10+05:30 IST