సర్కారుకే.. ‘అభయం’!

Nov 30 2021 @ 03:47AM

  • 1000 కోట్లకుపైగా నిధులపై కన్ను
  • ఎల్‌ఐసీ నుంచి పథకం స్వాధీనం
  • ‘సెర్ప్‌’ కింద చేపడతామని చట్ట సవరణ
  • నిధుల కోసమే సవరణ ఎత్తుగడ? 
  • వైఎస్సార్‌ బీమాకి పనికిరాని సెర్ప్‌
  • అభయహస్తం పథకానికి పనికొస్తుందా?
  • నివ్వెరపోతున్న ప్రభుత్వ సిబ్బంది


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆర్థిక అస్తవ్యస్తతతో అల్లాడుతూ.. ఎప్పటికప్పుడు నిధుల కోసం వెతుకులాడుతున్న వైసీపీ ప్రభుత్వం కన్ను అభయహస్తం సొమ్ముపై పడిందా? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఎల్‌ఐసీ వంటి స్వతంత్ర సంస్థ నిర్వహిస్తున్న ఈ పథకాన్ని సెర్ప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చట్ట సవరణ చేయడం వెనుక వేరే ఉద్దేశం ఉందా? అంటే ప్రభుత్వ సిబ్బంది నుంచి అవుననే సమాధానమే వస్తోంది. 2009 నుంచి నిర్వారామంగా మహిళలకు అభయహస్తం పథకం ద్వారా ఎల్‌ఐసీ సేవలందిస్తోంది. అయితే.. ఇప్పుడు ఈ ఎల్‌ఐసీ పనితీరుపైనే సర్కారుకు నమ్మకం సన్నగిల్లడం వెనుక మతలబు ఉందనే చర్చ జరుగుతోంది. దీనికి కారణం.. అభయహస్తంలో ఉన్న నిధులేనని అంటున్నారు. ఇప్పటికే పంటల బీమాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జిమ్మిక్కులతో అతివృష్టి, అనావృష్టిలో పంటలు కోల్పోయిన రైతులు బీమా పొందలేని పరిస్థితి నెలకొంది. అమల్లో అద్భుత ఫలితాలనిచ్చిన చంద్రన్న బీమాను రద్దు చేసి దాని స్థానంలో రెండేళ్ల తర్వాత వైఎస్సార్‌ బీమాను తెచ్చారు. సెర్ప్‌ సంస్థ నిర్వహించాల్సిన వైఎస్సార్‌ బీమా బాధ్యతలు సెర్ప్‌ను కాదని బ్యాంకులకు అప్పగించారు. ప్రస్తుతం బ్యాంకులు వివిధ కారణాలతో సక్రమంగా నిర్వహించలేకపోతుండడంతో వైఎస్సార్‌ బీమా అంతంత మాత్రంగా నడుస్తోంది. వాస్తవానికి సెర్ప్‌ ఆధ్వర్యంలో ఈ పథకం నిర్వహించి ఉంటే గతంలో మాదిరిగానే అద్భుత ఫలితాలు వచ్చేవి. ఇక, అభయహస్తం పథకాన్ని పరిశీలిస్తే.. ఎల్‌ఐసీ ద్వారా అమలవుతున్న ఈ పథకం మహిళలకు ఎంతో భరోసా ఇస్తోంది. అయితే, ఇప్పుడు ఎల్‌ఐసీని కాదని సెర్ప్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం చేస్తున్న ఈ జిమ్మిక్కులు చూస్తుంటే పథకాల ద్వారా మహిళలకు అందించే సేవల మీద కన్నా.. ఆయా పథకాల్లో నిల్వ ఉన్న నిధులపైనే దృష్టి పడిందని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 


34 లక్షల మందికి లబ్ధి

మహిళలు 60 ఏళ్ల వయసు తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఎంతో కొంత పింఛను పొందాలనే ఉద్దేశంతో 2009లో అప్పటి సీఎం వైఎస్‌ అభయహస్తం పథకాన్ని తెచ్చారు. 18-59 ఏళ్ల వయసున్న డ్వాక్రా మహిళలు రోజుకు రూ.1 ప్రీమియంగా చెల్లిస్తే, దీనికి ప్రభుత్వం రూ.1 జమచేస్తుంది. అంటే ఒక్కో డ్వాక్రా మహిళ ఏడాదికి రూ.365 చెల్లిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.365 చెల్లిస్తుంది. వయసును బట్టి 60 ఏళ్ల తర్వాత ఆ మహిళలకు రూ.500ల నుంచి రూ.2200 పింఛను అందిస్తారు. సుమారు 34.38 లక్షల మంది ఈ పథకం కింద రిజిస్టర్‌ అయ్యారు. ఎల్‌ఐసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తే మహిళలు చెల్లించే సొమ్ముకు భద్రత ఉంటుందని అప్పట్లో భావించారు. అందుకే ఈ నిర్వహణ బాధ్యతను ఎల్‌ఐసీకి అప్పగిస్తూ అప్పట్లో ఏపీ స్వయం సహాయక మహిళల వాటా చెల్లింపు పెన్షన్‌ చట్టం-2009ను తీసుకొచ్చారు. మహిళలు చెల్లించిన ప్రీమియం ద్వారా సుమారు రూ.1000 కోట్ల నిధులు అభయహస్తం ఖజానాలో జమయ్యాయి. ఈ పథకం ద్వారా 4.21 లక్షల మంది అర్హులైన మహిళలు పెన్షన్లు పొందుతున్నారు. అంతేకాకుండా లబ్ధిదారులకు జనశ్రీ బీమా యోజన కింద జీవిత బీమాను కూడా అందిస్తున్నారు.


నిధులపై సర్కార్‌ కన్ను

వైసీపీ అధికారంలోకి రాగానే చేతికి ఎముకలేదన్నట్టుగా చేస్తున్న ఎడాపెడా ఖర్చులతో ఖజానా ఎప్పటికప్పుడు ఖాళీ అవుతోంది. దీంతో రోజువారీ అవసరాల కోసమే నిధులు వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఏ శాఖలో నిధులున్నాయో? చూసి.. ఆ నిధులను వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అభయహస్తంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మహిళలు దాచుకున్న డబ్బును సెర్ప్‌ వద్ద ఉంచి ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని భావించినట్లు తెలుస్తోంది. అందుకే అభయహస్తం పథకం నిర్వహణ ఇక నుంచి ఎల్‌ఐసీ ఆధ్వర్యంలో కాకుండా సెర్ప్‌ ద్వారా నిర్వహిస్తామని ఇటీవల అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించారు. ఈ బిల్లులో ప్రభుత్వం పేర్కొన అంశాలు చూస్తే ‘ఏదో వ్యూహం’ ఉందని అర్థమవుతోంది. ప్రతినెలా 60 లక్షల మందికి సామాజిక పెన్షన్లు సెర్ప్‌ ద్వారా అందిస్తున్నామని, అందులో 1.18 లక్షల మంది అభయహస్తం పెన్షన్‌ దారులున్నారని.. వారి బాధ్యతను కూడా సెర్ప్‌ తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆ సామర్థ్యం సెర్ప్‌కు ఉందని పేర్కొన్నారు. ఎల్‌ఐసీ ద్వారా నిర్వహించడం వల్ల క్లయింలు సక్రమంగా పరిష్కారం కాకపోవడంతో ఇప్పటికే 6 లక్షల మంది పథకం నుంచి బయటకు వచ్చారని పేర్కొంది. విస్తృతమైన సిబ్బంది ఉన్న సెర్ప్‌ ద్వారా ఈ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం సభకు తెలిపింది. 


బ్యాంకులకు బీమా ఎందుకు? 

సెర్ప్‌కు విస్తృతమైన సిబ్బంది ఉన్నారనడం వాస్తవమే. అయితే, చంద్రన్నబీమాను వైఎస్సార్‌ బీమాగా మార్చిన ప్రభుత్వం సెర్ప్‌ ఆధ్వర్యంలో అమలు చేయకుండా.. బ్యాంకుల ద్వారా ఎందుకు అమలు చేస్తోందో చెప్పాల్సి ఉంది. బ్యాంకులకు 80 లక్షల మంది చంద్రన్న బీమా లావాదేవీలు చూడటానికి సరిపడ్డా సిబ్బంది లేనప్పుడు ఈ పథకం ఒక్క అడుగు కూడా ముందుకేయదన్న సంగతి ప్రభుత్వానికి తెలియదా? కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా చేయమన్నందున బ్యాంకుల ద్వారానే చేపడుతున్నామని అప్పట్లో చెప్పారు. సెర్ప్‌ సిబ్బందితోనే ఈ ప్రక్రియ చేపడతామని కేంద్ర ప్రభుత్వానికి నచ్చజెప్పి ఉంటే బాగుండేదని పలువురు పేర్కొంటున్నారు. మరి, వైఎస్సార్‌ బీమా సేవలకు పనికిరాని సెర్ప్‌, అభయహస్తం అమలుకు పనికొస్తుందా? అనేది పలువురి ప్రశ్న. ఎల్‌ఐసీ ఆధ్వర్యంలో నడుస్తున్న అభయహస్తం పథకాన్ని సెర్ప్‌లోకి తీసుకురావడం వెనుక ఈ నిధులు స్వేచ్ఛగా వినియోగించుకునే ఉద్దేశం దాగి ఉందని  ప్రభుత్వ సిబ్బందే భావిస్తుండడం గమనార్హం.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.