రంగురాళ్లపై కన్ను?... రిజర్వు ఫారెస్టు సమీపాన తవ్వకాలు

ABN , First Publish Date - 2021-04-22T09:58:27+05:30 IST

విశాఖపట్నం జిల్లాలో రంగు రాళ్లపై అధికార పార్టీ నేతల కళ్లుపడ్డాయి. నర్సీపట్నం డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో రూ.కోట్లు విలువైన రంగురాళ్ల నిక్షేపాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 15ఏళ్ల కిందటి వరకు యథేచ్ఛగా సాగిన రంగురాళ్ల తవ్వకాలు... ఆ తరువాత నిఘా పెరగడంతో తగ్గుముఖం పట్టాయి.

రంగురాళ్లపై కన్ను?... రిజర్వు ఫారెస్టు సమీపాన తవ్వకాలు

  • తవ్విన మట్టి నాతవరం వైపు తరలింపు 
  • తెరవెనుక అధికార పార్టీ నేత సహకారం 
  • అది జిరాయితీ... మాకు సంబంధం లేదు
  • అటవీ శాఖ అధికారుల వింత వాదన 
  • గతంలో అక్కడ తవ్వకాలకు నిరాకరణ 
  • రిజర్వు ఫారెస్టు ఉందంటూ అభ్యంతరాలు
  • టమాటా పంట ఉన్న భూమిని చదును 
  • చేయడంపై స్థానికుల్లో అనుమానాలు 
  • భూమిని సందర్శించిన ఎమ్మెల్యే గణేశ్‌ 
  • ‘కరప’లో 50 లక్షల టన్నుల జాతిరత్నాలు 
  • ఏయూ జియాలజీ నిపుణుల సర్వేలో వెల్లడి

గనుల చట్టాలు గల్లంతయ్యాయి. అటవీ, రెవెన్యూ నిబంధనలు సలాం కొట్టి పక్కకు తప్పుకొన్నాయు. అడుగులకు మడుగులొత్తే  అధికార యంత్రాంగం సంపూర్ణంగా సహకరిస్తోంది.. ఇక దోపిడీకి అడ్డేముంటుంది. మొన్నటికి మొన్న విశాఖ ఏజెన్సీలో కాల్సైట్‌ గనులు.. నిన్న 111 హెక్టార్ల కొండ... తాజాగా విలువైన రంగురాళ్ల నిక్షేపాలు.. ఇలా ఏదైనా సరే... విలువైన గనులు ఉన్నట్లు ఉప్పందితే చాలు వాలిపోతారు... కన్ను పడితే చాలు కాజేస్తారంతే...! 


విశాఖపట్నం జిల్లాలో రంగు రాళ్లపై అధికార పార్టీ నేతల కళ్లుపడ్డాయి. నర్సీపట్నం డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో రూ.కోట్లు విలువైన రంగురాళ్ల నిక్షేపాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 15ఏళ్ల కిందటి వరకు యథేచ్ఛగా సాగిన రంగురాళ్ల తవ్వకాలు... ఆ తరువాత నిఘా పెరగడంతో తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఇప్పుడు అధికార నేతలు దీనిపై దృష్టి సారించారు. నాలుగు రోజుల క్రితం గొలుగొండ మండలం సాలికమల్లవరం గ్రామానికి చెందిన ఓ రైతు భూమిలో తవ్వకాలు జరిపింది రంగురాళ్ల కోసమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరప రిజర్వు ఫారెస్టుకు ఆనుకుని పోగబెట్టపాలెం రెవెన్యూ పరిధి సర్వే నం.73లో కొల్లాన కొండలరావు అనే రైతుకు 4.03 ఎకరాల భూమి ఉంది. అందులో రంగురాళ్ల తవ్వకాలకు అనుమతి కోసం కొండలరావు నాలుగేళ్ల క్రితం అటవీశాఖకు దరఖాస్తు చేశారు. అయితే రిజర్వు ఫారెస్టు ప్రాంతానికి 0.5 కి.మీ. వరకూ ఎటువంటి తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని అప్పట్లోనే అధికారులు తేల్చిచెప్పారు. అయితే అదే భూమిలో రంగురాళ్ల కోసం ఇప్పుడు వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. అటవీ, రెవెన్యూ అధికారులకు ఎటువంటి దరఖాస్తు చేయకుండానే తవ్వకాలు చేపట్టారు. అయితే భూమి చదును కోసమే తవ్వకాలు జరుపుతున్నట్లు సదరు భూమి యజమాని చెబుతున్నారు. ప్రస్తుతం టమాటా పంట ఉన్న భూమిని చదును చేయడమేంటని గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భూమి చదును కోసం తవ్వకాలు చేపడితే... అక్కడ నుంచి మట్టిని నాతవరం వైపు ఎందుకు తీసుకువెళ్లారని ప్రశ్నిస్తున్నారు. కాగా మట్టి తవ్వకాలకు ఉపయోగించిన యంత్రాలు నర్సీపట్నానికి చెందిన అధికార పార్టీ నేతకు చెందినవిగా చెబుతున్నారు. భూమి చదును కోసమే తవ్వకాలు చేపట్టడం చిన్న విషయం. అయితే ఆ భూమిని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల గణేశ్‌ సందర్శించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


అటవీశాఖ తీరుపై అనుమానాలు

కరక రిజర్వు ఫారెస్టుకు అర కిలోమీటరు వరకు ఎటువంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని అటవీశాఖ అధికారులు నాలుగేళ్ల క్రితం తేల్చిచెప్పారు. కానీ... రెండురోజుల క్రితం ఫారెస్టు సరిహద్దుకు ఆనుకుని తవ్వకాలు చేపడితే అది జిరాయితీ భూమి అని, తమకు సంబంధం లేదని అధికారులు చెప్పడం వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాలికమల్లిపురంలో తవ్వకాలపై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 


కరప పరిసరాల్లో జాతిరత్నాలు 

విశాఖ జిల్లా, దానికి ఆనుకుని ఒడిశా ప్రాంతంలో 50లక్షల టన్నుల రంగురాళ్ల నిల్వలు ఉన్నాయని ఏయూ జియాలజీ విభాగం నిపుణుల పరిశోధనలో చాలాకాలం క్రితమే తేల్చారు. ఈ ప్రాంతంలో అలెగ్జాండరైట్‌, కిసోబెరల్‌, రూబీ, గార్నైట్‌, మోనజైట్‌, జిర్ఖాన్‌ తదితర మేలు జాతిరత్నాలు ఉన్నట్లు గుర్తించారు. 2000వ దశకంలో నర్సీపట్నం ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు విరివిగా సాగాయి. మళ్లీ ఇప్పుడు వాటికోసం అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. కాగా, భూమి చదును చేసుకుంటుంటే రంగురాళ్ల తవ్వకాలు జరిగాయని టీడీపీ నేత లోకేశ్‌ విమర్శించడంపై ఎమ్మెల్యే గణేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. టమాటా పంట ఉన్న భూమిని రైతు చదును చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. 

- విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి




ఖరీదైన రత్నం ‘అలెక్సీ’ 

క్యారెట్‌ 15 లక్షల పైమాటే...

అంతర్జాతీయ విపణిలో అత్యంత ఖరీదైన జాతిరత్నం ‘అలెగ్జాండరైట్‌’. క్యారెట్‌ రూ.15లక్షలు పైబడి ధర పలుకుతుంది. అలెగ్జాండరైట్‌ను నర్సీపట్నం ప్రాంతంలో ‘అలెక్సీ’గా పిలుస్తారు. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ రత్నం సూర్యకాంతి, విద్యుత్‌ కాంతి తగిలితే ఎరుపు రంగులోకి మారుతుంది. కాంతిప్రభావం తగ్గినతరువాత తిరిగి సాధారణ స్థితికి మారిపోతుంది. ఆకుపచ్చ రంగులో ఉండటంతో అరబ్‌ దేశాల్లో అలెగ్జాండరైట్‌కు ఎంతో డిమాండ్‌ ఉంది. అంత విలువైన రత్నం గనులు నర్సీపట్నం పరిసరాల్లోని కరక రిజర్వు ఫారెస్టు ఏరియాలో పుష్కలంగా ఉన్నాయి. చింతపాక గ్రామ పరిసరాల్లోనూ ఈ రకం జాతి రత్నాలున్నాయి. గత మూడుదశాబ్దాల్లో ఎందరో రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారులు రంగురాళ్ల తవ్వకాల్లో రూ.కోట్లు సంపాదించారు. ఏయూ జియాలజీ విభాగానికి చెందిన రిటైర్డు ఆచార్యుడు సి.కాశీపతి నర్సీపట్నం పరిసరాల్లో 3దశాబ్దాలక్రితమే అధ్యయనం చేసి అనేక పరిశోధన పత్రాలు రాశారు. కొన్నింటిని ఆయన స్వయంగా ప్రభుత్వానికి అందజేశారు. 

Updated Date - 2021-04-22T09:58:27+05:30 IST