అమ్మా.. నేను తిరిగిరానేమో అంటూ ఓ సైనికుడి వీడియోకాల్.. ఇందులో నిజమెంత..?

Jun 16 2021 @ 13:39PM

‘అమ్మా.. చూశావా.. చావు నన్ను వెతుక్కుంటూ ఎలా వస్తోందో.. అమ్మా.. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను తిరిగి ఇంటికి వస్తానన్న నమ్మకం లేదు. మళ్లీ మిమ్మల్ని చూస్తానన్న నమ్మకం అసలే లేదు. నువ్వు జాగ్రత్త. నీ ఆరోగ్యం జాగ్రత్త. తమ్ముడూ అమ్మను బాగా చూసుకో.. అయినా నీకు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీకు అమ్మంటే ప్రాణం కదా. హ్యాపీగా ఉండండి. ఐ లవ్యూ ఆల్..’ అంటూ ఓ సైనికుడు యుద్ధ క్షేత్రంలో ఉండి తన కుటుంబానికి వీడ్కోలు చెప్పాడంటూ ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పోరాటం చేస్తున్న ఇరాక్ సైనికుడి లాస్ట్ వీడియో కాల్ అంటూ సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. అందరి గుండెలనూ తడి చేస్తోంది. 

అయితే ఇది నిజం కాదు. ఇది ఓ షార్ట్ ఫిల్మ్‌లో దాదాపు ఒకటిన్నర నిమిషం వీడియోను కట్ చేసి ఇలా వైరల్ చేస్తున్నారు. ఇది నిజమేనని నమ్మేసి మన నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ ఇరాకీ షార్ట్‌ఫిల్మ్‌ పేరు డయలింగ్ (Dialing). బాహా అల్ ఖజీమీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో మెన్హెల్ అబ్బాస్ సైనికుడిగా కనిపించాడు. ఓ తల్లి కొడుకు సైన్యంలోకి వెళ్లి అక్కడ ఉగ్రవాదులతో యుద్ధం చేస్తూ మరణించడానికి సంబంధించిన కథాంశంతో ఈ షార్ట్‌ఫిల్మ్ తెరకెక్కింది. ఇది 2015వ సంవత్సరంలో విడుదలయింది. దుబాయి ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో కూడా ఈ చిత్ర ప్రదర్శన జరిగింది. 2017వ సంవత్సరంలోనే ఈ షార్ట్‌ఫిల్మ్‌ను యూట్యూబ్‌లో పెట్టారు. దీనికి సంబంధించిన చివరి ఒకటిన్నర నిమిషం వీడియోను సోషల్ మీడియాలో పెట్టి తాజాగా వైరల్ చేస్తున్నారు.


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...