ఎయిడెడ్‌పై కక్ష

ABN , First Publish Date - 2022-07-03T06:06:59+05:30 IST

ఎయిడెడ్‌ విద్యాసంస్థలను విద్యాశాఖలో విలీనం చేసుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో పరోక్షంగా వాటిపై దాడులకు దిగింది. పట్టుకోసం వేధింపులకు పాల్పడుతోంది.

ఎయిడెడ్‌పై కక్ష
ఒంగోలులోని సెయింట్‌ థెరిస్సా హైస్కూల్‌

దారికితెచ్చుకునేందుకు ప్రభుత్వం కుయుక్తులు

60 ఏళ్లకే రిటైర్మెంటు 

తాజాగా టెట్‌ తప్పనిసరి 

పాఠశాలల్లో విస్తృత తనిఖీలు

దొనకొండలోని ఆర్సీఎం ఎయిడెడ్‌, హైస్కూల్‌కు చాలా మంచి పేరు ఉంది. ఏళ్ల నుంచి పేద విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. అలాగే ప్రస్తుతం రెండు స్కూళ్లలో కలిపి 220మంది విద్యార్థులు ఉన్నారు. వారికి సరిపడా ఉపాధ్యాయులు, తరగతి గదులు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో వసతుల పేరుతో గతనెల 17న త్రిసభ్య కమిటీ విచారణ చేసి నివేదిక అందజేసింది. 

ఒంగోలులోని సెయింట్‌ థెరిస్సా హైస్కూల్‌లో 350 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి తరగతికి రెండు సెక్షన్లు. పాఠశాలలో మొత్తం 16 తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులకు డిజిటల్‌ క్లాస్‌రూం, కంప్యూటర్‌ ల్యాబ్‌ కూడా అందుబాటులో ఉంది. అన్ని వసతులు ఉన్నాయి. అంతా పేద విద్యార్థులే చదువుతారు. అయితే ప్రభుత్వం నియమించిన త్రీమెన్‌ కమిటీ ఇటీవల  ఆ స్కూల్‌ను తనిఖీ చేసి వసతులను పరిశీలించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎయిడెడ్‌ విద్యాసంస్థలను విద్యాశాఖలో విలీనం చేసుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో పరోక్షంగా వాటిపై దాడులకు దిగింది. పట్టుకోసం వేధింపులకు పాల్పడుతోంది. ఎయిడెడ్‌ పాఠశాలల తనిఖీల పేరుతో  భయపెడుతోంది. వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందిని దారిలోకి తెచ్చుకునేందుకు ఉద్యోగ విరమణ వయస్సు పెంపును వీరికి వర్తింపజేయడం లేదు. ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విలీనమైన వారికి మాత్రం  వయసు పెంపు సౌలభ్యాన్ని ఇస్తున్నారు. దానికితోడు ఎప్పుడూలేని విధంగా తప్పనిసరిగా టీచర్‌ అర్హత పరీక్ష పాస్‌ కావాల్సిందేనని ఆదేశించడంతో ఎయిడెడ్‌ టీచర్లు ఆందోళన చెందుతున్నారు.

ఒంగోలు (విద్య), జూలై 2 : ఎయిడెడ్‌ విద్యాసంస్థ లపై ప్రభుత్వం కక్ష పూనిందా..? అంటే ఇటీవల చోటుచేసుకుంటున్న పలుపరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారిని తమ వైపు తిప్పుకునేందుకు అన్ని వ్యవహారాలు చేస్తోంది. తమకు లభించే ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేందుకు పరోక్షంగా ప్రయత్నిస్తుందని ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆరోపిస్తున్నారు. 


ప్రభుత్వంలో విలీనంపై ఒత్తిడి

ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు ప్రభుత్వంలో విలీనం చేసుకునేందుకు యాజమాన్యాలపై సర్కారు ఇటీవల తీవ్ర ఒత్తిడి తెచ్చింది. అది తట్టుకోలేక కొందరు యాజమాన్యాలు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వంలో విలీనానికి అనుకూలంగా లేఖలు ఇచ్చారు. ఈ విషయం చినికిచినికి గాలివానలా మారి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొందరు హైకోర్టును ఆశ్ర యించారు. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం యాజమాన్యా లకు మూడు ఆప్షన్లను ఇచ్చింది. మేనేజ్‌మెంట్‌ల ఆస్తులతో సహా సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయడం మొదటిది, ఆస్తులు తమ వద్దే ఉంచుకొని కేవ లం సిబ్బందిని మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేయడం రెండోది, మూడో ఆప్షన్‌గా మొదట ఇచ్చిన అంగీకార లేఖను వెనక్కు తీసుకోవడం. ప్రభుత్వం నుంచి వెసులుబాటు రావడంతో సగంమంది తమ అంగీకారాన్ని వెనక్కు తీసుకున్నారు. దీంతో జిల్లాలో కేవలం 46 పాఠశాలల్లోని సిబ్బంది మాత్రమే విద్యాశాఖలో విలీనం అయ్యారు. మొత్తం 180మంది టీచర్లు ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విలీనం అయ్యారు. ప్రస్తుతం 93 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, 31 హైస్కూళ్లు, పది ఓరియంటల్‌ స్కూళ్లు ఎయిడెడ్‌ యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సుమారు 580 మంది టీచర్లు ఈ పాఠశాలల్లో పనిచేస్తున్నారు.


తరచూ పాఠశాలల్లో తనిఖీలు

ఇటీవల ఎయిడెడ్‌ పాఠశాలలను తరచూ తనిఖీలు చేస్తుండటంతో యాజమాన్యాలు, టీచర్లు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా అన్ని మండలాల్లో మండల విద్యాధికారి నేతృత్వంలో ఇద్దరు సీనియర్‌ హెచ్‌ఎంలు సభ్యులుగా త్రిసభ్య కమిటీలను ఏర్పాటుచేసి తనిఖీలకు పంపించారు. ఈ  కమిటీలు పాఠశాల భౌతిక వసతులను పరిశీలించి నివేదికలు ఇవ్వాల్సి ఉంది. మొత్తం 18 అంశాలను ఈ కమిటీలు పరిశీలించి నివేదికలు ఇవ్వాల్సి ఉండటంతో యాజమాన్యాలు, టీచర్లు ఆందోళనలు చెందుతున్నారు. 


ఉద్యోగ విరమణలోనూ వివక్షే

ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతుండటం పట్ల వారంతా భగ్గుమంటున్నారు. పీఆర్సీ అమలు సందర్భంగా అందరూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ విధానం అమలులోకి రాగా ఎయుడెడ్‌ ఉపాధ్యాయులకు వర్తింపజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


టెట్‌ తప్పనిసరి 

ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తాజాగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను తప్పనిసరి చేసింది. 2009లో విద్యాహక్కు చట్టం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల నియామకంలో టెట్‌ను తప్పనిసరి చేశారు. టెట్‌ ఉత్తీర్ణులు అయితేనే టీచర్‌ పోస్టులకు అర్హులు. టెట్‌లో సాధించిన మార్కులను కూడా డీఎస్సీలో టీచర్ల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు. తాజాగా టెట్‌ను ఎయిడెడ్‌ టీచర్లు, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు తప్పనిసరి చేశారు. దీంతో ఎయిడెడ్‌లో పనిచేస్తున్న వారు కూడా టెట్‌ పాస్‌ కావాల్సిందేనని షరతు పెట్టారు. దీంతో ఉపాధ్యాయుల్లో మరింత ఆందోళన నెలకొంది. 



Updated Date - 2022-07-03T06:06:59+05:30 IST