పరిశ్రమలు వెలవెల

ABN , First Publish Date - 2022-08-08T05:35:18+05:30 IST

కేసరపల్లి ఐటీ సెజ్‌ ఏస్‌ అర్బన్‌ - ఏపీఐఐసీ భాగస్వామ్యంతో ఉంది.

పరిశ్రమలు వెలవెల
మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌

కేసరపల్లి ఐటీ సెజ్‌లో రెండో టవర్‌ అసంపూర్ణం

  మల్లవల్లి మోడల్‌ ఐపీలో.. అశోక్‌ లేల్యాండ్‌ సంస్థదీ అదే దుస్థితి

 ఎంఎస్‌ఎంఈ యూనిట్ల సమస్యలపైనా శ్రద్ధ శూన్యం

  మెగా ఫుడ్‌పార్క్‌లో సీపీసీ పూర్తికి మూడేళ్లుగా చర్యలు మృగ్యం 

 గడువులు పెంచడమే తప్ప సమస్యలను పట్టించుకోని ఏపీఐఐసీ

  కేసరపల్లి ఐటీ సెజ్‌ ఏస్‌ అర్బన్‌ - ఏపీఐఐసీ భాగస్వామ్యంతో ఉంది. ఇందులో నాలుగు టవర్లను నిర్మించాలి. ఇప్పటికి ఒకే ఒక్క మేథ టవర్‌ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వంలో మేథ టవర్‌ ఐటీ కంపెనీలతో కిటకిటలాడేది. దీన్ని అనుకుని రెండవ భారీ టవర్‌ నిర్మాణ స్ట్రక్చర్‌ను పూర్తి చేసింది. గోడలు, ఫినిషింగ్‌ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మూడేళ్లుగా గడువు మారడం తప్ప పనుల్లో అంగుళం కూడా పురోగతి లేదు. 

 మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో అశోక్‌ లేలాండ్‌ నుంచి ఉత్పాదకత ఏ మాత్రం జరగటం లేదు. ఎలక్ర్టికల్‌ బస్సు బాడీ బిల్డింగ్‌ ఇక్కడ ఏర్పాటు జరిగింది. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ఉత్పాదకత నిలిచిపోయింది. ఏపీఐఐసీ అధికారులు అశోక్‌ లేల్యాండ్‌కు నోటీసులు ఇస్తున్నారే తప్ప.. ఆ సంస్థ ఇబ్బందులు ఏమిటో పట్టించుకోవటం లేదు. ప్రస్తుతం అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ కూడా ఉత్పాదకత ప్రారంభించటానికి ఏపీఐఐసీని గడువు కోరింది.

పారిశ్రామిక పార్కులు వెలవెలబోతున్నాయి. ఏపీఐఐసీ భాగస్వామ్యంతో ఏర్పాటు కావాల్సిన వాటిలోనూ తీవ్ర కాలాతీతం జరుగుతోంది. గడువు పెంచుకుంటూ పోవడమే తప్ప ఆచరణలో కార్యరూపం దాల్చటం లేదు. సమస్యల మూలాలను ఏపీఐఐసీ పరిష్కరించలేకపోతోంది. ‘మీ చావు మీరు చావండి.. ఏర్పాటు చేస్తారా లేదా’ అనే ధోరణిలో ఉండటం వల్ల విపరీతమైన జాప్యం జరుగుతోంది. పారిశ్రామిక పార్కుల్లో యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి కూడా ఇంకా స్తబ్దత నెలకొంటోంది. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లా మల్లవల్లిలో మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌, మెగా ఫుడ్‌ పార్క్‌, సీపీసీ, కేసరపల్లి ఐటీ సెజ్‌ ఇలా అనేక ఏపీఐఐసీ భాగస్వామ్య పారిశ్రామికపార్కు (ఐపీ)ల్లో భారీ పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఏర్పాటు ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. 

ఆంధ్రజ్యోతి, విజయవాడ : కేసరపల్లి ఐటీ సెజ్‌ ఏస్‌ అర్బన్‌ - ఏపీఐఐసీ భాగస్వామ్యంతో  ఏర్పాటయ్యే టవర్‌ నిర్మాణంలో పురోగతి లేకపోవడంతో ఏపీఐఐసీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఏస్‌ అర్బన్‌ సంస్థ గడువులను కోరుతోంది. ఇలాంటి ప్రాజెక్టును పూర్తిగా ప్రైవేటు ప్రాజెక్టుగా చూడటానికి కూడా వీలు లేదు. ఈ అంశంపై ఏపీఐఐసీ ఉదాసీనంగా ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ యూనిట్లలోని సగం మందికి ఉద్యోగుల వేతన చెల్లింపులు, ఇతర ప్రోత్సాహకాలను  కల్పిస్తే.. వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. దీంతో రెండున్నరేళ్ల వరకు ఐటీ కంపెనీలకు స్లంప్‌ వచ్చింది. ఇదే సమయంలో ఖాళీగా ఉంటున్న ‘మేథ’లోకి అతి పెద్ద ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా ప్రవేశిస్తోంది. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో ఏపీఐఐసీ ఎలాంటి పాత్రా పోషించటం లేదు. ఏస్‌ అర్బన్‌ సంస్థ ప్రతి ఆరు నెలలకు గడువు కోరటం... ఏపీఐఐసీ గడువు ఇవ్వటం తప్పితే.. మరో సానుకూలత లేకుండా పోతోంది.  

‘మల్లవల్లి’లో ఉత్పాదకతపై దృష్టి ఏది?

మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ విషయానికి వస్తే.. భారీ పరిశ్రమల ద్వారా ఉత్పాదకత ప్రారంభించే దిశగా ఏపీఐఐసీ చర్యలు తీసుకోవటం లేదు. అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ ఉత్పత్తిని ప్రారంభించానికి ఏపీఐఐసీని గడువు కోరింది. లేలాండ్‌ సంస్థకు టీడీపీ ప్రభుత్వం మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్క్‌లో 75 ఎకరాలను రూ.13 కోట్లకు విక్రయించింది. రూ.135 కోట్ల వ్యయంతో బస్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయటం ద్వారా 2,295 మందికి ఉపాధి కల్పిస్తామని ఎంఓయూ చేసుకుంది. వందలాది మందికి ఉద్యోగావకాశాలను కల్పించాలంటే అశోక్‌ లేల్యాండ్‌ సంస్థలో ఉత్పాదకత తిరిగి ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. మల్లవల్లిలోనే సూక్ష్మ, చిన్న, మధ్య పారిశ్రామిక యూనిట్లకు ఏపీఐఐసీతో ఒప్పందం చేసుకున్న అసోసియేషన్ల సమస్యలు పట్టించుకోవటం లేదు. మల్లవల్లి ఐటీలో కొత్తగా పార్లే సంస్థ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. వీటిని నిలబెట్టుకునే పద్ధతిలో ఏపీఐఐసీ వ్యవహరించాలి.

ధరలు చూసి వెనక్కి తగ్గుతున్న ‘ఫుడ్‌’ సంస్థలు

 మల్లవల్లిలో మెగా ఫుడ్‌ పార్క్‌ ఉంది. మెగా ఫుడ్‌పార్క్‌లో ఇంకా చాలా ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నా.. ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. మెగా ఫుడ్‌ పార్క్‌లో దాదాపుగా రూ.70 కోట్ల వ్యయంతో సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ)ని ఏపీఐఐసీ ఏర్పాటు చేస్తోంది. వాస్తవానికి ఇది కిందటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అంకురార్పణ జరిగింది. అప్పట్లో పనులు పురోగతిలో ఉన్నాయి. మూడేళ్లుగా ఇది పూర్తి కావటానికి ఆపసోపాలు పడుతోంది. ఈ సీపీసీలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు అవసరమైన కామన్‌ సర్వీసులు ఉంటాయి. అంటే డ్రై గోడౌన్స్‌, కోల్డ్‌ స్టోరేజ్‌లతో పాటు పల్పీ యూనిట్‌, ప్యాకేజింగ్‌ యూనిట్‌, ప్రాసెసింగ్‌ అవసరాలకు సంబంధించిన సదుపాయాలు ఉంటాయి. వీటి విషయంలో కూడా ఏపీఐఐసీ ఉన్నతాధికారులు తగిన విధంగా చొరవ చూపించటం లేదు. అలా చేసి ఉంటే.. సీపీసీని చూసైనా పలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థలు ఇక్కడ కాలు మోపటానికి అవకాశం ఉండేది. 

టీడీపీ హయాంలో పరిశ్రమలకు పెద్దపీట 

మల్లవల్లిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మల్లవల్లి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌కు 82.5 ఎకరాలు, నవ్యాంధ్ర ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌కు 11.5 ఎకరాలు, స్వర్ణాంధ్ర ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌కు 13.5 ఎకరాలు, మల్లవల్లి స్మాల్‌ మీడియం ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌లకు 26.1 ఎకరాలు చొప్పున మొత్తం 133 ఎకరాలను అప్పట్లో కేటాయించింది. వాస్తవానికి అప్పట్లో ప్రభుత్వ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఏపీఐఐసీ అధికారులు ఆయా అసోసియేషన్లతో చేసుకున్న ఎంఓయూల ప్రకారం భూములను కేటాయించలేదు. మల్లవల్లి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌కు 468 ఎకరాలు కేటాయించాల్సి ఉంది. ఏపీజే అబ్దుల్‌ కలాం ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌కు 60 ఎకరాలు కేటాయించాల్సి ఉంది. మొత్తంగా మల్లవల్లిలో ఎంఎస్‌ఎంఈ క్లస్టర్‌ ప్రాజెక్టు కింద రూ.1100 కోట్ల పెట్టుబడులు పెట్టాలన్నది అప్పటి ఉద్దేశం. తద్వారా ప్రత్యక్షంగా 10,500 మందికి పరోక్షంగా మరో 8000 మందికి ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది లక్ష్యంగా ఉంది. 

ధరలు పెంచిన వైసీపీ ప్రభుత్వం

ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే భూముల ధరలను ఆమాంతం పెంచేసింది. ఏపీఐఐసీ ఖర్చు చేసిన వాటికి ఇతర శాఖల ద్వారా గ్రాంట్‌ ఇప్పించటానికి కిందటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. ఈ ప్రభుత్వం ఆ ఊసు వదిలేసింది. ఏపీఐఐసీ మీద మొత్తంగా భారం పడటంతో.. ఏతా వాతా పారిశ్రామిక సంస్థలకు కేటాయించిన భూముల ధరలను అమాంతం పెంచేసింది. తమకు కొంత గడువు ఇవ్వాలని కోరుతున్నా.. ఏపీఐఐసీ సానుకూలంగా పట్టించుకోవటం లేదు. కొన్ని యూనిట్లకు కేటాయించిన భూ కేటాయింపులు రద్దు చేసింది. వీటిపై కొంతమంది కేసులు వేశారు. కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి. పారిశ్రామిక యూనిట్ల మీద వేధింపులకు దిగుతున్నప్పటికీ ఇప్పటికీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఉన్న వారు భూముల ధరలను సవరించాల్సిందిగా ఏపీఐఐసీ అధికారులను కోరుతున్నారు. 



Updated Date - 2022-08-08T05:35:18+05:30 IST