కేన్సర్‌- తెలుసుకోవలసిన నిజాలు

Jan 5 2021 @ 13:18PM

ఆంధ్రజ్యోతి(05-01-2021)

కేన్సర్‌ పట్ల ఎన్నో భయాలు, అపోహలు, అనుమానాలు విస్తరించి ఉన్నాయి. అయితే ఈ వ్యాధి పట్ల సరైన అవగాహన ఏర్పరుచుకోగలిగితే, తొలి దశలోనే గుర్తించి చికిత్సతో లొంగదీసుకోవచ్చు.


కేన్సర్‌ లక్షణాలు

అవయవాన్ని బట్టి కేన్సర్‌ లక్షణాలు మారుతూ ఉంటాయి. తీవ్రమైన అలసట, జ్వరం, ఆకలి, రోగనిరోధకశక్తి తగ్గడం, వాంతులు, విరేచనాలు, అకారణంగా బరువు తగ్గడం, రక్తహీనత కేన్సర్‌ ముదిరిన తర్వాత రోగుల్లో సాధారణంగా కనిపించే ప్రధాన లక్షణాలు. 


పరీక్షలు

బయాప్సీ, ఎఫ్‌.ఎన్‌.ఎ టెస్ట్‌, బ్లడ్‌ మార్కర్స్‌, ఎక్స్‌రే, సిటి స్కాన్‌, ఎమ్మారై, పి.ఇ.టి స్కాన్‌... ఇలా అవసరాన్ని బట్టి పరీక్షలు ఉంటాయి. సర్వైకల్‌  కేన్సర్‌ను పాప్‌స్మియర్‌ పరీక్షతో ముందుగానే కనిపెట్టే వీలుంది. 


వ్యాక్సీన్‌ లేదా?

తొమ్మిదేళ్ల మొదలు పెళ్లికాని ప్రతి మహిళా శృంగార జీవితాన్ని ప్రారంభించకముందే హెచ్‌.పి.వి వ్యాక్సీన్‌ వేయించుకుంటే గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చు. 


కేన్సర్‌ నివారణ

పీచుపదార్థం ఉండే ఆహారం, వ్యాయామం, కాలుష్యానికి, రసాయనాలకు దూరంగా ఉండడం, ఽధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉండడం, తరచూ ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా చూసుకోవడం ద్వారా కేన్సర్‌ రాకుండా కాపాడుకోవచ్చు.


కేన్సర్‌ వంశపారంపర్యమా?

రొమ్ము కేన్సర్‌ రక్తసంబంధీకుల్లో ఉంటే, మిగతా వారితో పోలిస్తే, ఈ కోవకు చెందిన వారికి కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. బి.ఆర్‌.సి.ఎ1, బి.ఆర్‌.సి.ఎ2 జీన్‌ మ్యుటేషన్‌ పరీక్షల ద్వారా రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశాలను ముందుగానే గుర్తించవచ్చు. అలాగే ప్రతి మహిళా 20వ ఏట నుంచే నెలసరి అయిన ఏడవ రోజున రొమ్ములను పరీక్షించుకుంటూ గడ్డల కోసం గమనించుకోవాలి. 30 ఏళ్ల నుంచి ఇతర పరీక్షలు, 40 ఏళ్ల తర్వాత నుంచి వైద్యుల సలహా మేరకు మామోగ్రామ్‌ ఏడాదికి ఒకసారి లేదా, మూడేళ్లకు ఒకసారి చేయించుకుంటూ ఉంటే కేన్సర్‌ను తొలిదశలోనే గుర్తించే వీలుంటుంది.


కేన్సర్‌ కణం తత్వం

కేన్సర్‌ కణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రవర్తిస్తుంది. కేన్సర్‌ దశ, కేన్సర్‌ కణం తత్వం, కేన్సర్‌ పాకే గుణం... ఈ అంశాలపరంగా కేన్సర్‌ మీద విజయం ఆధారపడి ఉంటుంది. సర్జరీలు, మందులు, థెరపీలు కూడా ఈ అంశాల మీదే ఆధారపడి ఉంటాయి. కేన్సర్‌ విజయంలో గడ్డ స్టేజ్‌, గ్రేడింగ్‌ కూడా ముఖ్యమే!


కేన్సర్‌ తదనంతరం

ఎలాంటి థెరపీతో కేన్సర్‌ను నయం చేసుకోగలిగినా, ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా చెక్‌ప్సకు వెళ్లడం, పరీక్షలు చేయించుకోవడం ఆపకూడదు. నయం అయిన మొదటి ఐదేళ్లలో కేన్సర్‌ తిరగబెట్టే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో నడుచుకోవాలి. 


డాక్టర్‌ సిహెచ్‌.మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌.ఫోన్‌: 9848011421


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.