ఉక్కుపాదం

ABN , First Publish Date - 2022-08-08T05:47:36+05:30 IST

వాహనదారులు ఇకపై అప్రమత్తంగా ఉండకపోతే

ఉక్కుపాదం
చేవెళ్లలో వాహనాలను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్‌ సీఐ గురువయ్య

  • ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుంటే చర్యలు తప్పవు
  • పెరుగుతున్న డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు
  • మద్యం తాగి వాహనం నడిపితే లైసెన్సులు సస్పెండ్‌
  • జిల్లాలో ఇప్పటివరకు 2,788 డ్రైవింగ్‌ లైసెన్స్‌లపై నిషేధం


వాహనదారులు ఇకపై అప్రమత్తంగా ఉండకపోతే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించినా.. తాగి వాహనం నడిపినా సైబరాబాద్‌ పోలీసులు, ఆర్టీవో అధికారులు సంయుక్త వాహనదారులపై కొరడా ఝుళిపించనున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే మూడు నుంచి ఆరు నెలల వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌, ఘోర తప్పిదాలకు కారణమైన వారి లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.


రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 7 : మద్యం తాగిన వాహనాలు నడుపుతూ డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారు, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే, ట్రాఫిక్‌ నిబంధనలు తుంగలో తొక్కి రోడ్డు ప్రమాదాలు చేసిన వారు.. పోలీసులకు చిక్కిన క్రమంలో వారి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు, లేదా కొన్ని నెలల పాటు సస్పెండ్‌ చేయనున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. లేట్‌నైట్‌ పార్టీలకు వెళ్లి.. పీకల దాక మద్యం తాగి.. అదే మత్తులో బండిని రోడ్డెక్కిస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా.. డోంట్‌ కేర్‌ అంటున్నారు. శని, ఆదివారాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక నుంచి మద్యం తాగి నడిపితే అంతే సంగతులు. మందుబాబులపై ఉక్కుపాదం మోపేందుకు సైబరాబాద్‌ పోలీసులు, ఆర్టీవో అధికారులు సంయుక్త కార్యాచరణ రూపొందించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విషయంలో మరింత కఠినంగా ఉండేందుకు రెండు శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వాహనదారుల డేటా బేస్‌ను పోలీసుల ట్యాబ్‌కు అనుసంధానం చేశారు. ఎవరైనా మద్యం తాగి రోడ్డుపై వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడితే.. వెంటనే అతడి వివరాలు ట్యాబ్‌లో ఎంట్రీ చేస్తున్నారు. ఆ సమాచారం నేరుగా జిల్లా రవాణాశాఖ అధికారులకు వెళుతోంది. వారు వివరాలను పరిశీలించి సదరు వ్యక్తి లైసెన్స్‌పై వేటు విధిస్తున్నారు. 3-6 నెలలపాటు లైసెన్స్‌ సస్పెండ్‌ చేస్తున్నారు. జిల్లాలో 2021 సంవత్సరంలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన 2,819 మంది డ్రైవింగ్‌ లైసెన్సులను జిల్లా రవాణాశాఖ అధికారులు సస్పెండ్‌ చేశారు. అలాగే 2,022 జనవరి నుంచి ఇప్పటివరకు 2,788 మంది లైసెన్సులను తాత్కాలికంగా 3-6 నెలలపాటు సస్పెండ్‌ చేయడం జరిగింది. 

ఘోర తప్పిదాలకు కారణమైన వారి లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయనున్నారు. లైసెన్స్‌ రద్దు లేదా సస్పెండ్‌ వారిలో కొందరు వాహనదారులు, డ్రైవర్లు యథేచ్చగా వాహనాలు నడుపుతూ రోడ్డుమీదకు వస్తున్నారు. లైసెన్స్‌ సస్పెన్షన్‌ తీరేదాకా ఎట్టి పరిస్థితిలో వాహనాలను నడపకూడదు. కానీ.. ఉల్లంఘనలను తుంగలో తొక్కేసి చాలామంది లైసెన్స్‌ సస్పెన్షన్‌ గడువు తీరకుండానే వాహనాలను నడుపుతున్నారు. అలాంటి వారిపై మోటర్‌ వెహికిల్‌ చట్టం సెక్షన్‌-182 ప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారికి న్యాయస్థానంలో రూ.10 వేల జరిమానా, 3 నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ తాత్కాలికంగా సస్పెండైన వారు లేదా రద్దయిన వారు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


2,788 డ్రైవింగ్‌ లైసెన్సులు సస్పెండ్‌ చేశాం

జిల్లాలో గతేడాది 2819 డ్రైవింగ్‌ లైసెన్సులు సస్పెండ్‌ చేయగా.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 2,788 డ్రైవింగ్‌ లైసెన్సులు సస్పెండ్‌ చేశాం. డ్రంకెన్‌డ్రైవ్‌, రాంగ్‌ రూట్‌, అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి, ట్రాఫిక్‌ నిబంధనలు తుంగలో తొక్కి రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారి వివరాలు పోలీసు అధికారులు పంపించారు. వివరాలను పరిశీలించి సదరు వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ చేయడం జరిగింది.  

- ప్రవీణ్‌రావు, జిల్లా ఉప రవాణా కమిషనర్‌


ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాల్సిందే 

వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాల్సిందే. లేదంటే.. చట్టపరమైన చర్యలు తప్పవు. ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్‌ తప్పని సరిగా ధరించాలి. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ, మద్యం తాగి డ్రైవ్‌ చేయడం మంచిది కాదు.  ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు ప్రయాణం నిషేధం. రాంగ్‌ రూట్‌లో వాహనాలు నడిపితే జరిమానా విధించాల్సి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. కొందరు వాహనంపై నెంబర్‌లు కనిపించకుండా చేస్తున్నా వారిపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వారి డ్రైవింగ్‌ లైసెన్సులు సస్పెన్షన్‌ చేస్తున్నాం. ప్రవర్తన మారకుంటే.. లైసెన్సు పూర్తితగా రద్దు చేయాల్సి ఉంటుంది.

- చేవెళ్ల ట్రాఫిక్‌ సీఐ. గురువయ్యగౌడ్‌



Updated Date - 2022-08-08T05:47:36+05:30 IST