విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో విఫలం

ABN , First Publish Date - 2022-06-25T05:23:31+05:30 IST

విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో విఫలం

విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో విఫలం
సమావేశంలో విద్యుత్‌ సమస్యలను ప్రస్తావిస్తున్న సభ్యుడు

  • ట్రాన్స్‌కో అధికారులపై మండిపడిన సభ్యులు 
  • మండల సర్వసభ్య సమావేశంలో ప్రశ్నల వర్షం.. 


మొయినాబాద్‌, జూన్‌ 24: విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో ట్రాన్స్‌కో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆరోపించారు. ఎంపీపీ నక్షత్రం జైవంత్‌ అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా విద్యుత్‌ సమస్యలపై చర్చించారు. గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు అధికమయ్యాయని సమస్యలు పరిష్కరించాలని చెబుతున్నా ట్రాన్స్‌ అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచుల సంఘం అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివా్‌సలు సమావేశం దృష్టికి తెచ్చారు. ఇది వరకే పల్లె ప్రగతిలో లిఖిత పూర్వకంగా విద్యుత్‌ సమస్యలపై విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ట్రాన్స్‌కో ఏడీ లేదా డీఈ వచ్చేవరకు సమావేశం జరగొద్దంటూ పట్టుబట్టారు. దీంతో ఎంపీపీ నక్షత్రంజైవంత్‌, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌లు సంబంధిత అధికారులతో మాట్లాడారు. రెండురోజుల్లో కరెంటు సమస్యపై రివ్యూ మీటింగ్‌ పెట్టి 20రోజుల్లో సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో సమావేశం కొనసాగింది. అనంతరం వ్యవసాయశాఖ అధికారి రాగమ్మ మాట్లాడుతూ.. రైతుబంధు, రైతు బీమాకోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూలై 1 నుంచి రైతుబీమాకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. పీఎం కిసాన్‌కు సంబంధించి రైతులు ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. గ్రామకంఠం సర్వేచేయాలని శ్రీరాంనగర్‌, కాసీంభౌలి సర్పంచుల కోరగా దరఖాస్తు చేసుకుంటే సర్వే చేయిస్తామని తహసీల్దార్‌ అశోక్‌ చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ శ్రీకాంత్‌, వైస్‌ ఎంపీపీ మమత, ఎంపీడీవో సంధ్య, తహసీల్దార్‌ అశోక్‌, ఎంఈవో వెంకటయ్య, ఏవో రాగమ్మ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధశాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T05:23:31+05:30 IST