ప్రలోభాల జాతర

ABN , First Publish Date - 2021-11-14T06:08:37+05:30 IST

దర్శి నగర పంచాయతీలో ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడింది. ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. ఈ విషయంలో అధికార పార్టీ నాయకులు ముందున్నారు. హోరాహోరీ పోటీ నెలకొన్న నేపథ్యంలో సామ,దాన,భేద దండోపాయలను ప్రయోగిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన దర్శి నగర పంచాయితీ పాలకవర్గం ఎంపికకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. పలు రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య కొనసాగుతోంది.

ప్రలోభాల జాతర

దర్శి నగర పంచాయతీలో 

ముగిసిన ఎన్నికల ప్రచారం

ఊపందుకున్న ఓట్ల కొనుగోలు 

ఓటరుకు రూ.3వేలు ఇస్తున్న వైసీపీ నేతలు

10 ఓట్లు ఉన్న వారికి ప్రత్యేక ప్యాకేజీలు 

చైర్మన్‌ అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యే మాటకు 

మద్దతు తెలపని మంత్రులు


ఆంధ్రజ్యోతి, ఒంగోలు 

ప్రధాన రాజకీయ పక్షాల మధ్య ప్రతిష్టాత్మకంగా మారి హోరాహోరీ పోరు సాగుతున్న దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల జాతర మొదలైంది. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. ఓట్ల కొనుగోలు ఊపందుకుంది. పోటీ నువ్వానేనా అన్నట్లు ఉన్న వార్డుల్లో వైసీపీ నాయకులు ఒక్కో ఓటుకు రూ.3వేలు పంపిణీ చేస్తున్నారు. అదేసమయంలో ఆయా వార్డులు, కాలనీల్లో ఓటు బ్యాంకులుగా ఉన్న వారిని గుర్తించి వారికి ఒక ప్యాకేజీ ప్రకటించి డబ్బులు ముట్టచెప్తున్నారు. మరికొందరికి ఇతరత్రా పనులు ఇస్తామంటూ ఆశచూపి తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరు పార్టీల నేతలు మద్యం పంపిణీ చేస్తున్నప్పటికీ ఈ విషయంలోనూ అధికార పార్టీ చాలా ముందుంది. 


దర్శి నగర పంచాయతీలో ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడింది. ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. ఈ విషయంలో అధికార పార్టీ నాయకులు ముందున్నారు. హోరాహోరీ పోటీ నెలకొన్న నేపథ్యంలో సామ,దాన,భేద దండోపాయలను ప్రయోగిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన దర్శి నగర పంచాయితీ పాలకవర్గం ఎంపికకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. పలు రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య కొనసాగుతోంది. తొలుత అతిధీమాతో ఉన్న అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఎక్కువ వార్డుల్లో పరిస్థితి ఢీఅంటేఢీ అన్నట్లు మారడంతో సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మంత్రి బాలినేని జోక్యం చేసుకుని బూచేపల్లి కుంటుంబ సభ్యులను సైతం ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే వేణుగోపాల్‌ కూడా తన వైఖరిని మార్చుకుని బూచేపల్లి కుటుంబ సభ్యులను ప్రచారానికి ఆహ్వానించారు. ఇంకోవైపు ఆయా సామాజికవర్గాల వారీ ఓటర్లను ప్రభావితం చేసేందుకు పార్టీలోని సంబంధిత సామాజిక వర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను దర్శికి పిలిచి ప్రచారం చేయించారు. వీటన్నింటి కన్నా శనివారం ఎమ్మెల్యే వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిలను ఒకే వేదిక మీదకు తెచ్చి వారిద్దరూ ఒకటనే సంకేతాన్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. మంత్రి బాలినేని ‘మాదంతా జగన్‌ గ్రూపు. ఇక్కడ వేణుగోపాల్‌, శివప్రసాద్‌రెడ్డి ఎవరైనా అధినేత నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయాల్సిందే’ అని స్పష్టం చేశారు. అయితే వేణుగోపాల్‌ కానీ, శివప్రసాద్‌కానీ మేమిద్దరం ఒకటేనని ఆ సభలో ప్రకటించ లేదు. 


ఎమ్మెల్యే చెప్పినా స్పందించని మంత్రులు, రాష్ట్ర నాయకులు

సమావేశంలో ఎమ్మెల్యే వేణుగోపాల్‌ మాట్లాడుతూ నగర పంచాయతీ చైర్మన్‌ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తానని తాను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆ ప్రతిపాదనను అధిష్టానం ఆమోదించలేదని మీడియాలో వచ్చిన కథనాలను నమ్మవద్దన్నారు.  అయితే సభలో ఉన్న మంత్రి బాలినేని కానీ, ఇతర మంత్రులు, నాయకులు కానీ ఎమ్మెల్యే వాదనను బలపరుస్తూ మాట్లాడ లేదు. దీంతో వైసీపీ గెలిస్తే చైర్‌పర్సన్‌ పదవిని ఎవరైనా దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు తేటతెల్లమైంది.  


చాపకింద నీరులా టీడీపీ ప్రచారం 

తెలుగుదేశం కూడా జిల్లాలో పార్టీకి చెందిన ఆయా సామాజికవర్గాల నాయకులు, ప్రజాప్రతినిధులను దర్శికి పిలిపించి ప్రచారంలో భాగస్వాములను చేసింది. స్థానిక నాయకులు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ ఇన్‌చార్జి పమిడి రమేష్‌, ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ నిరంతరం ప్రచారంలో పాల్గొన్నారు. వారికితోడు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, స్వామి, మాజీ ఎమ్మెల్యేలు అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, సాయికల్పనారెడ్డి, పార్టీ నాయకులు ఎరిక్షన్‌బాబు, కనిగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎవరి ప్రచారం ఎక్కడ అవసరమో ఆ వార్డుల్లో వారు పకడ్బందీగా  చేశారు. 


జోరుగా ఓట్ల కొనుగోలు 

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే వ్యవహారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. టీడీపీకి చెందిన అభ్యర్థులు  కొందరు ఓటుకు రూ.1వెయ్యి, రెండు వార్డులలో రూ.2వేల ప్రకారం పంపిణీ చేసినట్లు సమాచారం. దీన్ని గమనించిన వైసీపీ  నాయకులు ప్రతి వార్డులో ఓటుకు రూ.2వేలు, కొన్ని వార్డుల్లో రూ.2,500, మరికొన్ని వార్డుల్లో రూ.3వేలు పంపిణీ చేయడం ప్రారంభించారు. మరోవైపు విజయంపై అనుమానాలు పెరగటంతో వైసీపీ నాయకులు ఆయా వార్డుల్లో ఓటుబ్యాంకులుగా ఉన్న వ్యక్తులను తమ వైపు తిప్పుకునే వ్యవహారాలను ముమ్మరం చేశారు. అలాంటి వారిని గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ కింద డబ్బులు ఇవ్వటం ప్రారంభించారు. ఒక వార్డులో కీలకమైన ఒకరికి మున్ముందు మీపనులు చేస్తామని హామీ ఇవ్వటంతో పాటు రూ.లక్ష ముట్టజెప్పడం అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

 

పరవళ్లు తొక్కుతున్న మద్యం 

మద్యం కూడా పరవళ్లు తొక్కుతోంది.  టీడీపీ శ్రేణులు ప్రతి వార్డుకు రెండు కేసుల మద్యం సరఫరా చేయగా, అఽధికార వైసీపీ నేతలు ఐదు కేసులకుపైగానే కేటాయించారు. మద్యం పంిపిణీలో కొన్ని వార్డుల్లో విభేదాలు చోటుచేసుకోవటంతో అఽధికారపార్టీ అదనంగా మద్యాన్ని సరఫరా చేస్తున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అడిగినా, అడక్కపోయినా చేయిచాచిన వారందరికీ క్వార్టర్‌ బాటిల్‌ మద్యంతోపాటు ముఖ్యులకు ఒక కేసు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రతి ఇంటికీ ఓ క్వార్టర్‌ బాటిల్‌ మద్యాన్ని పంపుతున్న తీరు కనిపించింది.


దర్శిలో పర్యటించిన ఎస్పీ

జిల్లా ఎస్పీ మలికగర్గ్‌ శనివారం దర్శిలో పర్యటించారు. పోలీసు అధికారులను సమావేశపరిచి విధి నిర్వహణలో చిన్నపాటి సమస్య వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు.  భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. అయితే పోలింగ్‌ సందర్భంగా కిందస్థాయి పోలీసులు నిఖార్సుగా పని చేస్తారా? అఽధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తారా? అనేది చూడాల్సి ఉంది. 


Updated Date - 2021-11-14T06:08:37+05:30 IST