నకిలీ ధ్రువీకరణలు.. GHMC కార్యాలయం కేంద్రంగా దందా.. చివరికి..

ABN , First Publish Date - 2022-03-18T14:58:23+05:30 IST

జీహెచ్‌ఎంసీ కార్యాలయం కేంద్రంగా నకిలీ జనన, మరణ ధృవీకరణ పత్రాలు తయారు...

నకిలీ ధ్రువీకరణలు.. GHMC కార్యాలయం కేంద్రంగా దందా.. చివరికి..

  • జనన, మరణ పత్రాల తయారీ
  • ఆపరేటర్‌తో సహా ఐదుగురు అరెస్టు.. 
  • పరారీలో అధికారి, బ్రోకర్‌

హైదరాబాద్‌ సిటీ : జీహెచ్‌ఎంసీ కార్యాలయం కేంద్రంగా నకిలీ జనన, మరణ ధృవీకరణ పత్రాలు తయారు చేస్తున్న ఐదుగురిని వెస్ట్‌జోన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన జీహెచ్‌ఎంసీ హెల్త్‌ అసిస్టెంట్‌ ఆఫీసర్‌ (సర్కిల్‌ నెం.12, మెహిదీపట్నం) అజీజ్‌ ఖాసింతో పాటు మరో ఏజెంటు పరారీలో ఉన్నారు. ఎస్సార్‌నగర్‌ పోలీసులతో కలిసి డీసీపీ టీమ్‌ నిర్వహించిన జాయింట్‌ ఆపరేషన్‌లో ఈ ఘరానా ముఠా చిక్కింది. వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ కేసు పూర్వాపరాలు వెల్లడించారు. 


దందా జరిగిందిలా... 

కాసులకు కక్కుర్తి పడ్డ ఏఎంహెచ్‌ఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ మిగతా ఐదుగురు ఏజెంట్లతో కలిసి తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేస్తే అక్రమంగా డబ్బు సంపాదించవచ్చని కుమ్మక్కయ్యారు. నిబంధనల ప్రకారం సీఎస్‌సీ నుంచి ఆస్పత్రి రికార్డుల ఆధారంగా ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, దరఖాస్తును అవసరమనుకున్న వారికి అవసరమైన పుట్టిన తేదీలో సర్టిఫికెట్లు జారీ చేశారు. దానికోసం ఒక్కో దరఖాస్తుకు రూ. 1300 తీసుకున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తాను రూ.వెయ్యి తీసుకుని రూ.300 ఏజెంట్లకు కమీషన్‌గా ఇచ్చేవాడు. మహమ్మద్‌ రసూల్‌ నుంచి 30 దరఖాస్తులు, సయ్యద్‌ హుస్సేన్‌ ఇక్బాల్‌ నుంచి 65, అంకిత్‌  20, ఆరిఫ్‌ అహ్మద్‌ 8,  మహమ్మద్‌ రషీద్‌ 40 మందికి ఇలా నకిలీ ధ్రువీకరణ పత్రాలు ఇప్పించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. తప్పుడు పత్రాలతో వచ్చిన మొత్తం 163దరఖాస్తులను హెల్త్‌ అసిస్టెంట్‌ ఆఫీసర్‌ (సర్కిల్‌ నెం.17, ఖైరతాబాద్‌) అజీజ్‌ ఖాసిం వెరిఫై చేయకుండానే ఆమోదించగా, వాటిని డేటా ఎంట్రీ ఆపరేటర్‌ సిస్టమ్‌లో నమోదు చేశారు. వసూలు చేసిన డబ్బును అధికారి 75శాతం తీసుకోగా, డేటా ఆపరేటర్‌ 25శాతం పంచుకున్నారు. ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు నిందితుల వద్ద నుంచి ఆరు సెల్‌ఫోన్‌లు, నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లు, 19,400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు  డీసీపీ జోయల్‌ డేవిస్‌ వెల్లడించారు.


నిందితుల వివరాలు

జీహెచ్‌ఎంసీ హెల్త్‌ అసిస్టెంట్‌ ఆఫీసర్‌ (సర్కిల్‌ నెం.12, ఖైరతాబాద్‌) అజీజ్‌ ఖాసిం ప్రధాన నిందితుడు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.  ఎస్సార్‌నగర్‌లో నివాసముంటున్న ఆకుల సతీష్‌(36)  ఖైరతాబాద్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయ డేటా ఎంట్రీ ఆపరేటర్‌. మిగతా ఐదుగురు ఏజెంట్లుగా వ్యవహరించారు. వారిలో మహమ్మద్‌ రసూల్‌(42) ప్రైవేట్‌ ఉద్యోగి. సోమాజిగూడ, బీఎస్‌ మక్తా నివాసి. మలక్‌పేట్‌లో ఉంటున్న సయ్యద్‌ హుస్సేన్‌(49) ప్రైవేటు ఉద్యోగి. సికింద్రాబాద్‌లో ఉంటున్న అంకిత్‌ పరారీలో ఉన్నాడు. మాసాబ్‌ట్యాంక్‌లో నివాసముంటున్న ఆరిఫ్‌ అహ్మద్‌(56) సివిల్‌ ఇంజనీర్‌. హుమాయున్‌నగర్‌లో నివాసముంటున్న మహమ్మద్‌ రషీద్‌ (43)  ప్రైవేట్‌ ఉద్యోగి.

Updated Date - 2022-03-18T14:58:23+05:30 IST