తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని మోసం

ABN , First Publish Date - 2021-10-27T04:29:39+05:30 IST

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పి మోసగించిన పలువురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు తెలిపారు.

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని మోసం
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు

పదిమంది నిందితుల అరెస్టు 

బాపట్లరూరల్‌, అక్టోబరు 26: తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పి మోసగించిన పలువురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక రూరల్‌ పోలీసుస్టేషన్‌లో మంగళవారం వివరాలను వెల్లడించారు. ఒంగోలుకు చెందిన నల్లమోతు కిరణ్‌ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్‌ అయిన తర్వాత కంకటపాలెం సమీపంలో సిమెంటు, ఇనుము వ్యాపారం చేస్తున్నాడు. అతనికి ఇటీవల స్టూవర్టుపురానికి చెందిన కావటి ప్రతాప్‌ పరిచయమై తక్కువ ధరకు బంగారాన్ని ఇప్పిస్తామని  నమ్మపలికాడు. గతనెల 29వ తేదీన డబ్బు తీసుకుని చీరాల వెళ్లాడు. అక్కడ ప్రతాప్‌ను కలిసి కారులో తిరిగి కంకటపాలెం గ్రామానికి బయలు దేరారు. గ్రామ సమీపంలోకి రాగానే  ప్రతాప్‌ స్నేహితులు కొంతమంది వచ్చి తాము పోలీసులం అని బెదిరించి అతని వద్ద ఉన్న రూ.6లక్షల 10వేల నగదును లాక్కొని పారిపోయారు.  కిరణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెదుళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ప్రధాన నిందితుడు ప్రతాప్‌తోపాటు స్నేహితులు కె.బుద్దుడు, శశిధర్‌, సాయిచంద్ర, ఎం.రామచంద్రకుమార్‌, కిషోర్‌, నాగరాజు, గరికే ప్రసాద్‌, వి.స్వాతి, జి.మల్లికను అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. 


Updated Date - 2021-10-27T04:29:39+05:30 IST