భార్యను వేధించిన భర్త.. నకిలీ మెయిల్‌ క్రియేట్‌ చేసి..

ABN , First Publish Date - 2021-03-26T19:08:14+05:30 IST

భార్యపై అనుమానంతో నకిలీ మెయిల్‌ ఐడీ క్రియేట్‌ చేసి

భార్యను వేధించిన భర్త.. నకిలీ మెయిల్‌ క్రియేట్‌ చేసి..

హైదరాబాద్‌ : భార్యపై అనుమానంతో నకిలీ మెయిల్‌ ఐడీ క్రియేట్‌ చేసి వేధిస్తున్న భర్తను అరెస్టు చేశారు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. గణేష్‌నగర్‌ రామాంతపూర్‌ ప్రాంతానికి చెందిన ఎస్‌. వెంకటకిషోర్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. అతని భార్య ఓ కంపెనీలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. వెంకటకిషోర్‌ వేరే మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని, భార్య వద్ద పనిచేస్తున్న అటెండర్‌ చూశాడు. ఆ విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఈ విషయమై ఆమె భర్తను నిలదీసింది. అప్పటి నుంచి గొడవలు పెద్దవి కావడంతో ఆమె కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఎన్నిసార్లు పిలిచినా తిరిగి రాలేదు. దాంతో  భార్య, ఆమె కార్యాలయంలో పని చేస్తున్న అటెండర్‌పై పగపెంచుకున్న కిషోర్‌ ఎలాగైనా ఆమె పరువు తీయాలని నిర్ణయించుకున్నాడు.


అటెండర్‌ పేరుతో నకిలీ ఈమెయిల్‌ ఐడీ క్రియేట్‌ చేశాడు. దాని నుంచి అటెండర్‌ పంపుతున్నట్లుగా అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టేవాడు. ఆమె అటెండర్‌ను నిలదీయడంతో తనకు వాటితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. భర్తపై అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి, భర్తే ఈ నిర్వాకానికి పాల్పడినట్లు తేల్చి, నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.

Updated Date - 2021-03-26T19:08:14+05:30 IST