కరోనా వేళ ఫేక్‌ మెసేజ్‌లు కలకలం..

ABN , First Publish Date - 2021-04-26T18:24:44+05:30 IST

కరోనా వేళ ఫేక్‌ మెసేజ్‌లు కలకలం సృష్టిస్తున్నాయి.

కరోనా వేళ ఫేక్‌ మెసేజ్‌లు కలకలం..

  • తప్పుడు సమాచారం కలకలం
  • సైబర్‌ స్పేస్‌ పోలీసులతో ఆకతాయిల ఆటకట్టు

హైదరాబాద్‌ సిటీ : కరోనా వేళ ఫేక్‌ మెసేజ్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. లాక్‌డౌన్‌ విధించనున్నారని, ముఖ్య నేతల ఆరోగ్యం బాగాలేదని.. ఇలా తప్పుడు సమాచారాన్ని కొందరు వైరల్‌ చేస్తున్నారు. తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణ పేరిట కొవిడ్‌పై తప్పుడు మెసేజ్‌, ఎంఐఎం అధినేతతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఓ కాల్‌ రికార్డింగ్‌లో ఈ నెల 30 నుంచి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు, కర్ఫ్యూ రాత్రి 9 నుంచి కాకుండా రాత్రి 10 నుంచి అంటూ ఇలా కుప్పలుతెప్పలుగా వైరల్‌ అవుతున్న మెసేజ్‌లు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. కొవిడ్‌ బాధితులు, మృతదేహాలపై లెక్కలేనన్ని మెసేజ్‌లు సోషల్‌మీడియాలో చక్క ర్లు కొడుతున్నాయి. వీటి కట్టడికి అధికారులు నడుం బిగించారు.


సైబర్‌స్పేస్‌ పోలీసింగ్‌

యూట్యూబ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లాంటి సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అయ్యే తప్పుడు ప్రచారాలు, వదంతులను కనిపెట్టడానికి హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లకు చెందిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందు కోసం సైబర్‌ స్పేస్‌ పోలీసింగ్‌ ప్రారంభించారు. ప్రత్యేక బృందాలు షిఫ్టుల వారీగా 24 గంటలూ పని చేస్తూ తప్పుడు, అసత్య ప్రచారాన్ని వైరల్‌ చేస్తున్న వారిని గుర్తిస్తున్నారు. పోలీస్‌ కమిషనర్లతో పాటు డీజీపీ కార్యాలయం, ఇంటెలిజెన్స్‌ వర్గాలు సైతం వదంతులపై కన్నేసి ఎక్కడికక్కడ అణగదొక్కే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందుకోసం పోలీసులు అడ్వాన్స్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తప్పుడు సమాచారం షేర్‌ కాగానే వారి మొబైల్‌ నెంబర్‌, ఇంటర్నెట్‌ వివరాలు, కంప్యూటర్‌తో వైరల్‌ అయితే దాని ఐపీ అడ్రస్‌, ఏ నగరం, ఏ ప్రాంతం నుంచి ఆపరేట్‌ చేస్తున్నారనే అంశాలను నిమిషాల్లో గుర్తిస్తున్నారు. కారకులను అరెస్ట్‌ చేస్తున్నారు. సీఎంపై తప్పుడు సమాచారం వైరల్‌ చేసిన మైనర్‌ సహా ఓ మైనర్‌, ఇద్దరిని అరెస్టు చేశారు.


సరికొత్త వ్యూహం

మోసగాళ్లకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అనసురిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను జోడించి వైరల్‌ నిందితులను జైలుకు పంపేందుకు సిద్ధమవుతున్నారు. వైరల్‌ మెసేజ్‌లు, వీడియోలను గుర్తిస్తున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఫిర్యాదులు రాకున్నా సూమోటోగా స్వీకరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. కారకులను అరెస్ట్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-04-26T18:24:44+05:30 IST