ఫ్యూడల్‌ రాజరిక వ్యవస్థ పతనం

ABN , First Publish Date - 2022-09-15T10:32:49+05:30 IST

భారతదేశంలో హైదరాబాద్‌ సంస్థాన విలీనం ఒక చారిత్రక ఘట్టం. బ్రిటిష్‌ సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తూనే తన స్వతంత్ర ప్రతిపత్తితో, రాజ్యాధికారంతో, నిరంకుశ పాలనతో ప్రజాకంటకుడుగా...

ఫ్యూడల్‌ రాజరిక వ్యవస్థ పతనం

భారతదేశంలో హైదరాబాద్‌ సంస్థాన విలీనం ఒక చారిత్రక ఘట్టం. బ్రిటిష్‌ సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తూనే తన స్వతంత్ర ప్రతిపత్తితో, రాజ్యాధికారంతో, నిరంకుశ పాలనతో ప్రజాకంటకుడుగా నిజాం ప్రభువు రాజ్యమేలే కాలంలో భారతదేశానికి 15 ఆగస్టు 1947లో స్వాతంత్య్రం సిద్ధించింది. హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు పౌరహక్కులు లేక ఆర్థిక సంస్కరణలు కొరవడి, అప్పులలో కూరుకునిపోయి, సామాజిక రుగ్మతలతో అట్టుడుకుతున్న, నిరక్షరాస్యతతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఆనాటి ప్రముఖ రాజకీయ పార్టీలైన స్టేట్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ, సామాజిక సాంస్కృతిక సంస్థలైన ఆంధ్ర మహాసభ, మహారాష్ట్ర పరిషత్‌, కన్నడ పరిషత్‌, ఆర్యసమాజ్‌ మొదలైనవి ప్రజలను నిజాం ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా జాగృతం చేశాయి.


నిజాం ప్రభుత్వం తన సైన్యానికి అనుబంధంగా రజాకార్‌ అల్లరిమూకలను పెంచి పోషించి ప్రజలలో మత విద్వేషాలను రెచ్చగొట్టి, భయభ్రాంతులను చేసింది. రజాకార్లు ముఖ్యంగా హిందువులపై విచక్షణారహితంగా దాడులు చేశారు. ఆస్తుల విధ్వంసం, స్త్రీలపై అత్యాచారాలు మొదలైన వికృత చేష్టలకు ఒడిగట్టారు. ఉన్నత వర్గాల ప్రజలు తమ మాన, ప్రాణాలను కాపాడుకునేందుకు సంస్థాన సరిహద్దు గ్రామాలకు వలసవెళ్లి పొరుగు రాష్ట్ర ప్రజల ఆశ్రయం పొందారు. బోర్డర్‌ క్యాంపులను నిర్వహించి శత్రువులను ఆయుధాలతో ఎదుర్కొన్నారు. రజాకార్ల దాడులను సమర్థవంతంగా గ్రామ ప్రజలు ఎదుర్కొనేందుకు ఆంధ్ర మహాసభ కార్యకర్తలు అండగా నిలిచారు.


1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభ ద్వారా తెలంగాణ గ్రామాలలో పెత్తందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌, జమీందార్ల అరాచకాలను, భూ ఆక్రమణలను, సమాజంలోని ఉన్నతవర్గాలు పెంచి పోషిస్తూ ఉన్న మధ్యకాలం నాటి ఫ్యూడల్‌ ఆచారమైన వెట్టిచాకిరీని ఎదుర్కొనే విధంగా ఉద్యమించారు. దీనికి అణగారిన ప్రజల పూర్తి మద్దతు లభించింది. ఆంధ్ర మహాసభ నాయకత్వంలో జరిగిన వెట్టిచాకిరీ నిర్మూలన, భూస్వామ్య వ్యతిరేక, నిజాం ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమాలు ఒక విప్లవస్ఫూర్తితో తెలంగాణ గ్రామాలలో దావానలంలా వ్యాపించాయి. మరొకవైపు అనూహ్యంగా ఇతర సంస్థానాలతో చేసుకోని రీతిలో భారత ప్రభుత్వం హైదరాబాద్‌ సంస్థానం విలీనానికి వెసులుబాటు కల్పిస్తూ నిజాం ప్రభుత్వంతో ఒక సంవత్సర కాలానికి యథాతథ ఒడంబడికను 1947, నవంబర్‌ 29న చేసుకుంది. దీని ప్రకారం హైదరాబాద్‌ సంస్థాన రక్షణ, విదేశీ వ్యవహారాలు భారత ప్రభుత్వ అధీనంలోకి వచ్చాయి. కమ్యూనిస్టులు ఈ ఒప్పందాన్ని నెహ్రూ, పటేల్‌ కుట్రగా అభివర్ణించారు. సంస్థాన ప్రజలు యథాతథ ఒడంబడికను నిర్వీర్యం చేస్తూ హైదరాబాద్‌ సంస్థాన విలీనోద్యమాన్ని ఉధృతం చేసి నిరసనలు, సత్యాగ్రహాలను నిర్వహిస్తూ కమ్యూనిస్టులతో కలిసి ఉమ్మడి ఫ్రంట్‌ కట్టి హింసాయుత సాయుధ పోరాటానికి ఉద్యుక్తులయ్యారు.


ఖాసిం రజ్వి నాయకత్వంలో రజాకార్లు గ్రామాలలో దాడులకు పాల్పడుతూ హిందువుల ఊచకోతకు కారకులయ్యారు. రజ్వి విద్వేషకర ఉపన్యాసాలు, అకృత్యాలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. యథాతథ ఒడంబడికను కాలదన్ని నిజాం ప్రభువు పాకిస్థాన్‌ దేశం నుంచి ఆయుధ సామాగ్రిని రహస్యంగా దిగుమతి చేసుకోవడం, ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి హైదరాబాద్‌ సంస్థానానికి స్వతంత్ర దేశ గుర్తింపు కోసం అర్జీలు పెట్టుకోవడం భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. కమ్యూనిస్టుల సాయుధ పోరాటం, నిజాం భారత వ్యతిరేక వ్యూహాలు, నిజాంపై ప్రజల తిరుగుబాటు భారత ప్రభుత్వాన్ని హైదరాబాద్‌ సంస్థానంపై 13 సెప్టెంబర్‌, 1948న తక్షణ సైనిక చర్యకు పురిగొల్పింది. ఈ సైనిక చర్యను ఇక్కడి ప్రజలు ముక్తకంఠంతో స్వాగతించారు. నాలుగు రోజులలోనే అంటే సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి, భద్రతా మండలిలో స్వతంత్ర దేశ గుర్తింపు విన్నపాన్ని వెనక్కు తీసుకోవడానికి నిజాం ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఘట్టాన్ని సంస్థాన ప్రజలు ఉద్యమ విజయంగా, భారతావని సర్దార్‌ పటేల్‌ చతురతగా హర్షించింది. అయితే కాలక్రమంలో సెప్టెంబర్‌ 17ను కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉన్న పూర్వ హైదరాబాద్‌ కన్నడ, మరాఠా ప్రాంతాల్లో చాలాకాలంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మాత్రం విలీన దినంగా, విమోచన దినంగా జరపాలని రాజకీయ పార్టీలు తమ అజెండాలకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 


భారతదేశంలో హైదరాబాద్‌ సంస్థాన విలీనం నిర్వివాద అంశం. విలీన ఉద్యమాన్ని హిందువులకు, ముస్లింలకు జరిగిన మతఘర్షణలుగా సూత్రీకరించడానికి చారిత్రక ఆధారాలు లేవు. హిందూ పెత్తందారీ వర్గం నిజాం ప్రభుత్వానికి తాబేదారులుగా వ్యవహరించి గ్రామాలలో తమ ప్రయోజనాలను, ఉనికిని, ఆధిపత్యాన్ని కాపాడుకున్నాయి. విలీన ఉద్యమంలో జరిగిన ఘర్షణలలో ఇరు మతాలవారూ సమిధలయ్యారు. విలీన ఉద్యమ కాలంలో ముస్లింల ఆధిపత్యంగా, సైనిక చర్య కాలంలో హిందువుల ఆధిపత్యంగా ఉద్యమం జరిగింది. సైనిక చర్య కాలంలో జరిగిన మత ఘర్షణలపై భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన పండిట్‌ సుందర్‌లాల్‌ కమిటీ దీనికి సాక్ష్యం. ఈ కమిటీ రిపోర్టును పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. రిపోర్టు అభిప్రాయాలు, ముగింపులతో అప్పటి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ ఏకీభవించలేదు.


సెప్టెంబర్‌ 17ను పూర్వ హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు ఒక పండుగగా, ఒక ఫ్యూడల్‌ రాజరిక వ్యవస్థ పతనంగా, నిజమైన స్వాతంత్య్రం సిద్ధించిన రోజుగా విమోచన ఉత్సవాలు జరుపుకోవడం ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన యోధులకు మనం అర్పించే నిజమైన నివాళి.

కందుకూరి రమేశ్‌

రీజనల్‌ డైరెక్టర్‌, ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం

Updated Date - 2022-09-15T10:32:49+05:30 IST