విలువల పతనం

ABN , First Publish Date - 2022-02-19T07:34:27+05:30 IST

సింగపూర్ ప్రధాని లీసీన్ లూంగ్ ఇటీవల ఆ దేశ పార్లమెంటులో చేసిన ప్రసంగం భారత ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. అలనాటి ఉన్నతమైన ‘నెహ్రూస్ ఇండియా’ ఇప్పుడు విలువలరీత్యా దిగజారిందని...

విలువల పతనం

సింగపూర్ ప్రధాని లీసీన్ లూంగ్ ఇటీవల ఆ దేశ పార్లమెంటులో చేసిన ప్రసంగం భారత ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. అలనాటి ఉన్నతమైన ‘నెహ్రూస్ ఇండియా’ ఇప్పుడు విలువలరీత్యా దిగజారిందని ఆయన అన్నందుకు భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.  సింగపూర్ హై కమిషనర్ ను పిలిపించి, ఏమిటీ అపసవ్య అనుచిత వ్యాఖ్యలంటూ ఆగ్రహాన్ని ప్రకటించింది. మనదేశంలో ఇప్పుడున్న ప్రజాస్వామ్యం గురించీ, ఎంపీల్లో సగంమంది మీద క్రిమినల్ కేసులు ఉండటం గురించీ మరో దేశ పాలకుడు వ్యాఖ్యలు చేసినప్పుడు అభ్యంతరం తెలియచేయడం సముచితమే. పైగా, పొగడ్తలైతే దేశీయంగా ప్రచారంలో పెట్టుకోవచ్చుకానీ, తెగడ్తలు కనుక ఖండించవలసిందే. కుదిరితే వీటి వెనుక ఏవో కుట్రకోణాలున్నాయని కూడా అనవలసిందే. సింగపూర్ ప్రధాని తన గంటన్నర ప్రసంగంలో భారతదేశాన్ని మాత్రమే ఉదహరించలేదు. ఇజ్రాయెల్, అమెరికా, బ్రిటన్ మీద కూడా గట్టివ్యాఖ్యలే చేశారు. అయితే, ఈ దేశాలు ‘మా ఊసు నీకెందుకు?’ అని ఆయనను నిలదీసినట్టు లేదు. భారతదేశం ఇప్పుడు అనుభవిస్తున్న సకలపాపాలకూ తొలిప్రధానే కారకుడని విరుచుకుపడుతున్న తరుణంలో, నెహ్రూస్ ఇండియా అన్న సంబోధనతోపాటు అది ఓ మహాద్భుతంగానూ, ఇప్పుడది దిగజారిపోయినట్టుగానూ వ్యాఖ్యానించడం పాలకులకు నచ్చకపోవడం సహజం.


సింగపూర్ ప్రధాని ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పెట్టి, ప్రపంచమంతా నెహ్రూను మెచ్చుకుంటోంది వినండి అని అంటోంది. ఈ వ్యాఖ్యల వెనుక దేశ, విదేశీ కుట్రలు ఏమేరకు న్నాయో ప్రభుత్వం వెతుకుతోంది. భద్రతా సలహాదారు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ రంగంలోకి దిగినట్టు చెబుతున్నారు. అర్బన్ నక్సల్స్, ప్రెస్టిట్యూ్ట్స్ ఇత్యాది మాటలూ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదనీ, సింగపూర్ ప్రధాని ఏ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారో అర్థంచేసుకోవాలని అంటున్నవారూ ఉన్నారు. ప్రధానప్రతిపక్షమైన వర్కర్స్ పార్టీ నాయకురాలు చట్టసభలో అసత్యాలు చెప్పారన్న ఆరోపణపై ప్రివిలేజెస్ కమిటీ సమర్పించిన రిపోర్టుపై ప్రధాని తన సుదీర్ఘప్రసంగంలో విలువల పతనంపై హెచ్చరికలు చేశారు. ప్రజాస్వామ్యదేశాల వ్యవస్థాపక విలువలు క్రమంగా అంతరించిపోవడం ప్రమాదకరమని చెప్పడం ఉద్దేశం.  దేశాలన్నీ గొప్ప ఆదర్శభావాలు, ఉన్నతమైన ఆశయాలతో జైత్రయాత్ర ఆరంభిస్తాయనీ, క్రమేపీ ఆ సిద్ధాంతాలు, ఆశయాలకు నీళ్ళువదిలేసి పక్కదారులు పడతాయని ఆయన బాధ. ఉన్నతమైన విలువలు, ఆసాధారణ వ్యక్తిత్వం, అద్భుత ధైర్యసాహసాలున్న స్వాతంత్ర్య పోరాట యోధులువల్ల దేశాలు ఆ విలువలను సంతరించుకుంటాయని అంటూ గురియన్ (ఇజ్రాయెల్) నెహ్రూ పేర్లను ఆయన స్మరించుకున్నారు, మనకూ అంటువంటివారు ఉన్నారని గుర్తుచేశారు. అంతటి నెహ్రూస్ ఇండియా క్రమంగా తన ప్రయాణంలో పక్కదారులు పట్టిందనీ, అక్కడి మీడియా రిపోర్టుల ప్రకారం సగంమంది ఎంపీలమీద హత్య, అత్యాచారం సహా పలు క్రిమినల్ కేసులున్నాయనీ అన్నారు. ఈ కేసులన్నీ రాజకీయపరమైనవేనన్న వాదన ఉన్నదనీ చెప్పారు. ఇజ్రాయెల్ సైతం దిగజారిందనీ, రెండేళ్ళలో నాలుగు ఎన్నికలు జరుపుకొని కూడా నిలకడైన ప్రభుత్వాన్ని తెచ్చుకోలేకపోయిందన్నారు. అక్కడి సీనియర్ అధికారులు, నాయకులమీద క్రిమినల్ కేసులున్నాయని గుర్తుచేశారు. అమెరికాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ అక్కడి వ్యవస్థ దాదాపు కుప్పకూలిందన్నారు. ‘మదర్ ఆఫ్ పార్లమెంట్స్’ అని జేజేలు అందుకొనే బ్రిటన్‌లో సైతం ‘పార్టీ గేట్’ వంటి కుంభకోణాలతో వ్యవస్థ గబ్బుపట్టిందని గుర్తుచేశారు. 


చట్టసభను అసత్యాలతో తప్పుదోవపట్టించిన ముగ్గురు నేతలను శిక్షించే క్రమంలో సింగపూర్ ప్రధాని ఈ ప్రసంగం చేసిన విషయాన్ని గమనించాలి. సింగపూర్ తన ఆవిర్భావ విలువలకు కట్టుబడి, వాటిని పరిరక్షించుకుంటూ కొనసాగాలనీ, పతనం కాకూడదనీ చెప్పడం ఆయన ఉద్దేశం. మరోదేశ నాయకుడు మన దౌర్భాగ్యాన్ని ఎత్తిచూపినందుకు కోపం రావడం సహజమే కానీ, ఆ వ్యాఖ్యలు, లెక్కల్లో అసత్యాలేమీ లేవు. ఆసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఏటా వెలువర్చే నివేదికల్లో మన ప్రజాప్రతినిధుల్లో ఎంతమందిమీద ఏయే కేసులున్నాయో చెబుతూనే ఉంటుంది. సింగపూర్ ప్రధాని మాటలు రాజకీయంగా ఇబ్బంది కలిగించవచ్చును కానీ, ప్రజాస్వామిక విలువల పతనం గురించి చేసిన హెచ్చరికలు అర్థంచేసుకోవలసినవే.

Updated Date - 2022-02-19T07:34:27+05:30 IST