గంగమ్మ కోసం కూలిన రైల్వే గోడ

ABN , First Publish Date - 2022-05-25T06:13:43+05:30 IST

కుప్పం గంగమ్మ కోసం రైల్వే శాఖ కూడా దాసోహమంది. జనం కోరిక మన్నించి పాత రైల్వే గేటుకు అడ్డంగా నిర్మించిన గోడ కూలింది. భక్తజనం హర్షాతిరేకాలతో ఉప్పొంగింది

గంగమ్మ కోసం కూలిన రైల్వే గోడ
రైల్వే గోడను కూలుస్తున్న దృశ్యం

కుప్పం, మే 24: కుప్పం గంగమ్మ కోసం రైల్వే శాఖ కూడా దాసోహమంది. జనం కోరిక మన్నించి పాత రైల్వే గేటుకు అడ్డంగా నిర్మించిన గోడ కూలింది. భక్తజనం హర్షాతిరేకాలతో ఉప్పొంగింది. కుప్పం పట్టణాన్ని విడగొట్టినట్లుగా మధ్యలోంచి రైల్వే పట్టాలున్నాయి. ఈ పట్టాలను దాటడానికి ఎప్పటినుంచో కొత్తపేట వద్ద రైల్వే గేటు ఉండేది. దానికి కొద్దిదూరంలో రైల్వే అండర్‌ బ్రిడ్జిని  ని ర్మించిన తర్వాత ఈ రైల్వే గేటును తొలగించారు. ఆ స్థానంలో రైల్వే శాఖాధికారులు గోడను నిర్మించారు. దీంతో రైల్వే గేటు ద్వారా రాకపోకలకు శాశ్వతంగా అడ్డుకట్ట పడింది. అయితే  ప్రస్తుతం కుప్పం గంగ జాతర జరుగుతోంది. కుప్పం నేతాజీ రోడ్డునుంచి కొత్తపేటకు అమ్మవారి ఊరేగింపు వెళ్లాలంటే వీలు కాని పరిస్థితి ఏర్పడింది. పాత రైల్వే గేటు స్థానంలో గోడ నిర్మించేశారు. అలాగని కొత్తగా నిర్మించిన అండర్‌ బ్రిడ్జినుంచి వెళ్లాలంటే ఎత్తు చాలని పరి స్థితి.  స్థానిక స్వచ్ఛంద సంస్థ సాయిమాతా సేవా ట్రస్టు అధ్యక్షుడు జగదీష్‌బాబు ఇటీవల బెంగళూరు, బంగారుపేట వెళ్లి రైల్వే మంత్రి, ఆ శాఖ ఉన్న తాధికారులను కలిశారు. గంగ జాతరలో అమ్మవారి ఊరేగింపు ప్రాధాన్యాన్ని గురించి ఏకరువు పెట్టారు. కుప్పం ప్రధాన మార్గం నేతాజీరోడ్డునుంచి గతంలో కొత్తపేటకు రైల్వే గేటు ద్వారానే అమ్మవారి ఉత్సవం వెళ్లేదని, ప్రస్తుతం దాన్ని మూసివేయడంవల్ల అది వీలుకాని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఒకవేళ కొత్తపేటకు అమ్మవారి ఊరేగింపు వెళ్లలేకపోతే ఆ ప్రాంత భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని, అందువల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదమూ లేకపోలేదని వారికి అర్థమయ్యేలా వివరించారు. ఆయనతోపాటు మున్సిపల్‌ ఛైర్మన్‌  సుధీర్‌ వ్యక్తిగత కార్యదర్శి వినతిపత్రం సమర్పిం చారు. స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు సోమ వారం కుప్పం వచ్చి రైల్వే గేటు ప్రాంతాన్ని పరి శీలించారు. వారి అనుమతి మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పాత రైల్వే గేటువద్ద అడ్డుగా నిర్మించిన గోడను తాత్కాలికంగా తొలగించారు. దీంతో రాత్రి గంగమ్మ శిరస్సు ఊరే గింపు ఈ మార్గం ద్వారా నిరాటంకంగా కొత్తపేటలో ప్రవేశించింది. అక్కడ భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని తరించారు. అనంతరం వెంటనే గోడ నిర్మించారు. ఈలోగా భక్తులు కూడా చుట్టులేకుండా నేరుగా ఈ మార్గం ద్వారా రాకపోకలు సాగించారు.  ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా రైల్వే అధికారులు, స్థానిక పోలీసులు గేటు వద్ద ప్రత్యేక నిఘా ఉంచి తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

Updated Date - 2022-05-25T06:13:43+05:30 IST