టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలి

ABN , First Publish Date - 2022-08-08T05:03:06+05:30 IST

కుప్పం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నేతలపై పోలీసులు పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తేయాలని ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు గాజుల ఖాదర్‌బాషా డిమాండ్‌ చేశారు.

టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఖాదర్‌బాషా

పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు గాజుల ఖాదర్‌బాషా  


కుప్పం, ఆగస్టు 7: పట్టణంలో తెలుగుదేశం పార్టీ నేతలపై పోలీసులు పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తేయాలని ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు గాజుల ఖాదర్‌బాషా డిమాండ్‌ చేశారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏం తప్పు చేశారని చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శితోపాటు 15 మంది టీడీపీ కార్యకర్తలపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు బనాయించారని పోలీసులను నిలదీశారు. ఇది పోలీసుల ఏకపక్ష వైఖరికి నిదర్శమన్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, మహిళతో మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉంటూ ఇటువంటి నీచమైన సంస్కృతికి దిగజారడం సిగ్గుచేటన్నారు. అటువంటి ఎంపీని బర్తరఫ్‌ చేయాలన్న డిమాండ్‌తో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను కుప్పం అర్బన్‌ సీఐ శ్రీధర్‌ అడ్డుకోవడమే కాక, అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమైన విషయమన్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులంటే దేశంలోనే ఎంతో గౌరవం ఉండేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వారు చట్టానికి ఏమాత్రం విలువనివ్వకుండా వైసీపీ సెక్షన్లను  గౌరవిస్తున్నారని విమర్శించారు. కొందరు పోలీసుల ప్రవరర్తనతో పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకం పూర్తిగా పోయిందన్నారు. నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడానికి టీడీపీ నాయకులు హత్యలు చేశారా లేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారా అని నిలదీశారు. తప్పుడు కేసులతో గొంతు నొక్కలేరని, ఒక గొంతు నొక్కితే వెయ్యి గొంతుకలు టీడీపీలో పైకి లేస్తాయని ఆయన హెచ్చరించారు. న్యాయం, ధర్మం ఎల్లప్పుడూ తమ పార్టీవైపే ఉన్నదని స్పష్టం చేశారు. అవినీతి, అన్యాయం, నేరాలు, అరాచకాలు, ఘోరాలు చేయడమే వైసీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులపై అక్రమంగా బనాయించిన నాన్‌ బెయిలబుల్‌ కేసులు ఎత్తివేయకపోతే చట్టపరంగా పోరాటం చేస్తామన్నారు.

Updated Date - 2022-08-08T05:03:06+05:30 IST