భగీరథపై తప్పుడు గొప్పలు

ABN , First Publish Date - 2022-10-02T07:52:23+05:30 IST

మిషన్‌ భగీరథ పథకాన్ని కేంద్రం ప్రశంసించిందంటూ తెలంగాణ ప్రభుత్వం పత్రికల ద్వారా అందించిన సమాచారంలో వాస్తవం లేదని కేంద్ర జల శక్తి శాఖ పేర్కొంది.

భగీరథపై తప్పుడు గొప్పలు

  • ఈ పథకాన్ని కేంద్రం ప్రశంసించలేదు 
  • రాష్ట్ర మంత్రుల సమాచారం వాస్తవ దూరం
  • ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు
  • 5 శాతం ఇళ్లకు నాణ్యమైన నీరందడం లేదు
  • 8 శాతం ఇండ్లకు రోజుకు 55 లీటర్లలోపే 
  • రెగ్యులర్‌ సప్లై కేటగిరీలోనే రాష్ట్రానికి అవార్డు
  • ఇది అద్భుతమనడానికి గీటురాయి కాదు
  • కేంద్ర జల శక్తి శాఖ డిప్యూటీ డైరెక్టర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మిషన్‌ భగీరథ పథకాన్ని కేంద్రం ప్రశంసించిందంటూ తెలంగాణ ప్రభుత్వం పత్రికల ద్వారా అందించిన సమాచారంలో వాస్తవం లేదని కేంద్ర జల శక్తి శాఖ పేర్కొంది. కేంద్రం ఇచ్చే అవార్డును చూపి, రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని తెలిపింది. మిషన్‌ భగీరథను కేంద్రం ప్రశంసించిందని, వంద శాతం నీటి సరఫరా వల్లే కేంద్ర జల్‌ జీవన్‌ మిషన్‌ అవార్డు ప్రకటించిందని రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇటీవల మీడియా ద్వారా వెల్లడించిన విషయం విదితమే. అయితే ఈ అంశాలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. నీటి సరఫరాలో రెగ్యులారిటీ అంశానికి సంబంధించి మాత్రమే అవార్డు ఇస్తున్నామని, ఈ అవార్డును గొప్పగా పేర్కొంటూ మిషన్‌ భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ఖండించింది. ఒక పథకం పనితీరును అంచనా వేసేందుకు పరిశీలించే పలు ప్రమాణాల్లో నీటి సరఫరాలో రెగ్యులారిటీ కూడా ఒకటి పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ (మీడియా కమ్యూనికేషన్స్‌ విభాగం) అనుభవ్‌ సింగ్‌  ఒక ప్రకటన విడుదల చేశారు. 


మంత్రుల ప్రకటనలో ముఖ్యంగా వాస్తవదూరమైన నాలుగు అంశాలను ఆయన ప్రస్తావించారు. అవి 1. కేంద్రం జాతీయ జల్‌ జీవన్‌ మిషన్‌ (ఎన్‌జేజేఎం) ద్వారా మిషన్‌ భగీరథ స్కీం సమీక్షించింది. 2. మిషన్‌ భగీరథలో ప్రతి కుటుంబానికి తలసరి వంద లీటర్ల నాణ్యమైన తాగునీరు సరఫరా అవుతోంది. 3. తెలంగాణ వ్యాప్తంగా ర్యాండమ్‌గా ఎంపిక చేసిన 320 గ్రామాల్లో పరిశీలన జరిగింది. 4. అన్ని గ్రామాల్లో నల్లాల ద్వారా ప్రతి రోజు అంతరాయం లేకుండా నాణ్యమైన తాగునీరు సరఫరా జరుగుతోంది. వాస్తవాల ఆధారంగా లేని ఈ సమాచారం ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని అనుభవ్‌ సింగ్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలపై అధ్యయనం చేశామని, అందులో భాగంగానే తమ బృందాలు తెలంగాణలోని 490 గ్రామాల్లోని 12,750 ఇండ్లలో నీటి సరఫరాను, నాణ్యతను పరిశీలించాయని ఆయన పేర్కొన్నారు. బృందాల పరిశీలనలో 8 శాతం కుటుంబాలకు రోజుకు తలసరి 55 లీటర్ల కంటే తక్కువ నీరు సరఫరా అవుతోందని తేలిందని తెలిపారు. అలాగే 5 శాతం కుటుంబాలకు సరఫరా అవుతున్న నీటి నాణ్యత నిబంధనలకు అనుగుణంగా లేదని ఈ ఫంక్షనాలిటీ అసె్‌సమెంట్‌ డేటా ప్రకారం ద్వారా గుర్తించినట్టు పేర్కొన్నారు.


 కేవలం రెగ్యులర్‌ వాటర్‌ సప్లై అంశానికి ప్రాధాన్యత ఇచ్చామని, కేంద్రం అవార్డు ఇవ్వడం మిషన్‌ భగీరథ అద్భుతమనే ప్రశంసలకు గీటురాయి కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం వందశాతం గ్రామాల్లో భగీరథ నీరు అందుతోందని, పథకం అమలు వంద శాతం సక్సెస్‌ అని చెప్తున్నా గ్రామ పంచాయతీలు ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదని ఆయన వివరించారు. మిషన్‌ భగీరథ పథకం అమలు, దాని ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యత, ఇతర అంశాలపై తమ మంత్రిత్వ శాఖ ఎలాంటి అధ్యయనం జరపలేదని, అవార్డు కోసం ఇతర రాష్ట్రాల్లో చేసిన పరిశీలననే తెలంగాణలోనూ చేపట్టామని అనుభవ్‌ సింగ్‌ పేర్కొన్నారు. జేఎంఎం నిబంధనల ప్రకారం నల్లాల ద్వారా సరఫరా చేసే నీటి నాణ్యత బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) 10,500 ప్రమాణాలు ఉండాలి. కుటుంబంలోని ప్రతి వ్యక్తికి రోజుకు కనీసం 55 లీటర్ల మేర నీరు సరఫరా చేయాలి. ఈ నిబంధనల అమలుపైనే పరిశీలన జరిపినట్లు వెల్లడించారు. 

Updated Date - 2022-10-02T07:52:23+05:30 IST