ఫ్యామిలీ సర్కస్‌

ABN , First Publish Date - 2022-06-26T06:56:31+05:30 IST

కూటి కోసం కోటి విద్యలంటారు పెద్దలు. తాను చిన్నతనం నుంచి ఆసక్తిగా నేర్చుకున్న సర్క్‌సనే జీవనాధారంగా ఎంచుకున్నాడు మదనపల్లె సమీపంలోని బసినికొండకు చెందిన నరసింహులు.

ఫ్యామిలీ సర్కస్‌
గగుర్పొడిచే విన్యాసాలతో చూపరులకు కనువిందు

పొట్ట కూటి కోసం ఫీట్లు

గగుర్పొడిచే విన్యాసాలతో చూపరులకు కనువిందు

అలరిస్తున్న సర్కస్‌ కళాకారుడు నరసింహులు

 

బైరెడ్డిపల్లె: కూటి కోసం కోటి విద్యలంటారు పెద్దలు. తాను చిన్నతనం నుంచి ఆసక్తిగా నేర్చుకున్న సర్క్‌సనే జీవనాధారంగా ఎంచుకున్నాడు మదనపల్లె సమీపంలోని బసినికొండకు చెందిన నరసింహులు. ఆ వృత్తినే చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బైరెడ్డిపల్లి మండలంలో వారం రోజులుగా ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేస్తూ అక్కడి ప్రజలను అలరిస్తున్నాడు. సైకిల్‌పై ఆయన చేస్తున్న విన్యాసాలను యువకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. సైకిల్‌ చుట్టూ మంటలు వేసుకుని ఓ టైరుకు కాగడాలు తగిలించుకుని మెడచుట్టూ గిరగిర తిప్పుతూ సైకిల్‌ తొక్కడం హైలెట్‌గా నిలుస్తోంది. ఛాతిపై బరువైన రాతిబండను పెట్టి, దాన్ని సమ్మెటతో పగులగొట్టడం ఆకట్టుకుంటోంది. నలుగురు చిన్నారులను వృత్తాకారంలో పడుకోబెట్టి వారి మధ్యలో సైకిల్‌తో చేసే విన్యాసం, మూడు కమ్మీల మీద సైకిల్‌ను పెట్టి దానిపైన నిలబడి మరో సైకిల్‌ ఎత్తుకుని చేసే స్టంట్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.


 ప్రమాదమైనా తప్పడం లేదు..

నేను చేస్తున్న విన్యాసాలు ప్రమాదమని తెలుసు. ఫీట్లు చేసే క్రమంలో ఇప్పటికే పలుమార్లు గాయపడ్డాను కూడా. అయినా కుటుంబం కోసం తప్పడం లేదు. నాకు వేరే విద్య తెలియదు. గతంలో మా ఊర్లో నాలుగు కుటుంబాల వాళ్లు ఈ వృత్తిపై ఆధారపడి జీవించేవారు. ఇప్పుడు వారు కూడా వేరే పని చూసుకున్నారు. నేను ఒక్కడినే రోజుకొక ఊరిలో ప్రదర్శనలిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ, ముగ్గురు పిల్లలను ఊళ్లోని బడిలో చదివించుకుంటున్నాను. పెళ్లయి 12 ఏళ్లు అయింది. అప్పటి నుంచి పక్కా గృహం కోసం అధికారులకు, ప్రజాప్రతినిధులకు చాలాసార్లు మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం బసినికొండలో అద్దె ఇంట్లో ఉంటున్నాం. ప్రభుత్వ పథకాలు అందితే కొంత చేయూతగా ఉంటుంది.


Updated Date - 2022-06-26T06:56:31+05:30 IST