భార్య, కొడుకుని వదిలేసి మే 11వ తేదీలోపు దేశం నుంచి వెళ్లిపోండంటూ ఆదేశాలు.. Australia లో ఓ భారతీయుడికి వచ్చిన కష్టమిది..

ABN , First Publish Date - 2022-05-09T23:36:08+05:30 IST

భార్య, కుమారుడు.. ఇదే ఆ భారతీయుడి ప్రపంచం! కానీ.. ఇప్పుడతను తన కుటుంబాన్ని ఆస్ట్రేలియాలోనే విడిచి స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఎర్పడింది.

భార్య, కొడుకుని వదిలేసి మే 11వ తేదీలోపు దేశం నుంచి వెళ్లిపోండంటూ ఆదేశాలు.. Australia లో ఓ భారతీయుడికి వచ్చిన కష్టమిది..

ఎన్నారై డెస్క్: భార్య, కుమారుడు.. ఇదే ఆ భారతీయుడి  ప్రపంచం! కానీ.. ఇప్పుడతను తన కుటుంబాన్ని ఆస్ట్రేలియాలోనే విడిచి స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. భార్య, కొడుకుని వదిలేసి మే 11వ తేదీలోపు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. గత 14 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్న గగన్‌దీప్ సింగ్(Gagandeep Singh) ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. అసలేం జరిగిందంటే.. 


2009లో గగన్‌దీప్ సింగ్ స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లారు. 2012లో ఆయనకు ఫీబీ(Phoebe) అనే ఆస్ట్రేలియా మహిళతో పరిచయమైంది. 2015లో ఆ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వారికి మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. పేరు జారో. ఆ కుటుంబం విక్టోరియా రాష్ట్రంలోని గిప్స్‌ల్యాండ్ ప్రాంతంలో నివసిస్తోంది.  ఆస్ట్రేలియా మహిళనే పెళ్లాడినా కూడా  గగన్‌దీప్ భాగస్వామి వీసా(Partner Visa) కోసం దరఖాస్తు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. వలసలకు సంబంధించి ఓ నిబంధనే ఇందుకు కారణం. దీని ప్రకారం.. ఆస్ట్రేలియాలో ఉండగా విదేశీయులు రెండు మార్లు భాగస్వామి వీసాకు అప్లై చేయడం కుదరదు.


ఫీబీతో వివాహానికి మునుపు గగన్‌దీప్ సింగ్ మరో ఆస్ట్రేలియా వనితతో కొంత కాలం సహజీవనం చేశారు. ఈ క్రమంలోనే ఆయన భాగస్వామి వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. అనంతర కాలంలో వారి బంధం ముగియడంతో ఆయన పీబీని వివాహం చేసుకున్నారు. దీంతో.. రెండో సారి ఆయన ఈ వీసాకు దరఖాస్తు చేయలేని స్థితిలో కూరుకుపోయారు. భార్య, పిల్లలకు దూరమవ్వాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆస్ట్రేలియా వలస చట్టం ప్రకారం.. గగన్‌దీప్ సింగ్ రెండేళ్ల పాటు ఇండియాలో గడిపాకే అతడికి మళ్లీ భాగస్వామి వీసా జారీ అయ్యే వీలు కలుగుతుంది. 


ప్రస్తుతం గగన్‌దీప్ సింగ్‌కు ఈ యడబాటు తప్పాలంటే.. ఇమ్మిగ్రేషన్ మంత్రి అలెక్స్ హాక్ స్వయంగా కల్పించుకోవాలి. అలా జరగని పక్షంలో.. ఆయన తన కుటుంబాన్ని వీడి ఇండియాకు రాక తప్పదు. ‘‘ఓ చిన్నారిని అతడి తండ్రి నుంచి దూరం చేయడం చాలా దారుణం’’ అని గగన్‌దీప్ తరపు లాయర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉండగా ఈ వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న సౌలభ్యం.. ఆస్ట్రేలియాలో లేకపోవడమేమిటని ప్రశ్నించారు. మరోవైపు.. భార్య పిల్లలకు దూరమవడాన్ని గగన్‌దీప్‌ తట్టుకోలేడని ఆయన స్వదేశంలోని ఆయన బంధువులు ఆందోళన చెందుతున్నారు. 


ఇక గగన్‌దీప్ భార్య ఫీబీ కూడా భారత్‌కు రాలేని పరిస్థితి. ఇప్పటికే తనకు ఉన్న శారీరక, మానసిక సమస్యలకు తగిన చికిత్స భారత్‌లో దొరకదని ఫీబీ భావిస్తుండడంతో ఆమె భారత్‌కు వచ్చేందుకు సంశయిస్తోంది. అయితే.. గగన్‌దీప్‌కు ప్రభుత్వం సాయపడాలంటూ అనేక మంది స్థానికులు గొంతెత్తుతున్నారు. గిప్స్‌ల్యాండ్‌కు చెందిన ఫెడరల్ మెంబర్ డారేన్ ఛెస్టర్.. ఆయనకు మద్దతుగా ఉంటానంటూ ఓ లేఖ రాశారు.


ఇక గగన్‌దీప్ కుమారుడు చదువుతున్న స్కూల్, డేకేర్ సెంటర్ వాళ్లు కూడా ఆయనకు మద్దతుగా లేఖలు రాశారు. గగన్‌దీప్‌ను ప్రభుత్వం ఆస్ట్రేలియాలోనే ఉండనీయాలని కోరుతూ ప్రారంభించిన ఆన్‌లైన్ పిటిషన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఇప్పటికే 1300 మందికి పైగా ఆ ఆన్‌లైన్ పిటిషన్‌లో సంతకాలు చేశారు.



Read more