ఇక సహించం! ఖబడ్దార్‌.. భరతం పడతాం!

ABN , First Publish Date - 2021-11-21T07:19:10+05:30 IST

నాడూ మీడియా ముందుకు రాని నందమూరి తారక రామారావు కుటుంబసభ్యులు తొలిసారి బయటకు వచ్చారు..

ఇక సహించం! ఖబడ్దార్‌.. భరతం పడతాం!

  • మీరు హద్దు దాటితే.. మేమూ దాటతాం
  • రెండు మూడేళ్లుగా ఈ ధోరణి చూస్తున్నాం
  • ఆడాళ్లను ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా?
  • ఏ కుటుంబంలోని వారికీ ఇలా జరగకూడదు
  • చంద్రబాబు కన్నీరుపెట్టడం బాధించింది
  • నందమూరి కుటుంబం ఆక్రోశం, ఆవేదన
  • తొలిసారి అందరూ మీడియా ముందుకు
  • విడిగా వీడియోలు పెట్టిన ఎన్టీఆర్‌, రోహిత్‌
  • దిగజారుడు మాటలవి.. మనసులో పెట్టుకోవద్దు
  • చంద్రబాబును అనునయించిన భువనేశ్వరి!


హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఏనాడూ మీడియా ముందుకు రాని నందమూరి తారక రామారావు కుటుంబసభ్యులు తొలిసారి బయటకు వచ్చారు. అసెంబ్లీలో శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలపై తమ ఆక్రోశాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. అంతేకాదు... ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సహించేది లేదని సూటిగా హెచ్చరించారు. ఎన్టీఆర్‌ కుమారులు రామకృష్ణ, బాలకృష్ణ, కుమార్తె లోకేశ్వరితోపాటు... జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తదితరులు ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు.  కొంతమంది తమ దూషణలతో అసెంబ్లీని అపవిత్రం చేశారని ఎన్టీఆర్‌ పెద్ద కుమార్తె లోకేశ్వరి పేర్కొన్నారు. ‘‘అసెంబ్లీ అంటే దేవాలయంతో సమానం. కొంతమంది దూషణలతో దాన్ని అపవిత్రం చేశారు. విజయమ్మని, షర్మిలను చంద్రబాబు ఎప్పుడైనా ఏమైనా అన్నారా? మాలో రామారావు రక్తం ఉంది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే విశ్వరూపం చూపిస్తాం’’ అని లోకేశ్వరి అన్నారు. హద్దు మీరిన వారికి అదే పద్ధతిలో సమాధానమిస్తామని ఎన్టీఆర్‌ కుమారుడు రామకృష్ణ హెచ్చరించారు. ‘‘మా కుటుంబం జోలికి ఎవరొచ్చినా వదిలి పెట్టం. ఇలాంటి ఘటనలు ఎవరి కుటుంబాల్లోనూ జరక్కూడదు.


రెండు మూడేళ్ల నుంచీ చూస్తూనేఉన్నాం. ఇక ఉపేక్షించం. ద్వారంపూడి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు హద్దులు మీరారు. మేమూ హద్దుమీరతాం’’ అని రామకృష్ణ తీవ్రస్వరం వినిపించారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి మాటలు మాట్లాడతారని అనుకోలేదని ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుడు చైతన్య కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మహిళల గొప్పదనం చెబుతూ తాతగారు ఎన్నో సినిమాలు చేశారు. మేం కూడా మా అత్తలను చూసి చాలా నేర్చుకున్నాం. అలాంటిది మా ఇంటి ఆడాళ్ల గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు’’ అని చైతన్య కృష్ణ వాపోయారు.


గొడ్ల చావిడిలో ఉన్నామా...

అసెంబ్లీలో ఉన్నామా లేదంటే పశువుల దొడ్డిలో ఉన్నామా అనేది తెలియడం లేదని ఎన్టీఆర్‌ కుమారు డు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ‘‘అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం. రాష్ట్ర భవిష్యత్తు కోసం అసెంబ్లీ జరగాలి. దాని దృష్టి మరల్చి, వ్యక్తిగత దూషణే ఎజెండాగా పెట్టుకుని అసెంబ్లీని నడపడం దురదృష్టం. చంద్రబాబు కంటతడి పెట్టుకోవడం ఎప్పుడూ లేదు. ఎవరైనా సరే, సమస్యలపై పోట్లాడాలి. అసెంబ్లీ ఉన్నది అందుకే. తప్పు జరిగి తే వేలెత్తి చూపించాలి. లేదంటే సూచనలు చేయాలి. వాగ్వివాదాలు చేసుకోవడం సహజమే. కానీ వ్యక్తిగత దూషణ తప్పు. అసెంబ్లీలో సవాళ్లు ప్రతిసవాళ్లూ ఉండొచ్చు. పర్సనల్‌ అజెండా పెట్టుకుని కుటుంబలపై దాడి చేయడం ఏమిటి? మా సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత దూషణ చేయడం చాలా దురదృష్టం. వాళ్లు వాడే భాష, వాచకం, ఆంగికం.. చూస్తుంటే గొడ్ల చావిట్లో ఉన్నామా, అసెంబ్లీలో ఉన్నామా అనేది తెలియడం లేదు. నేనూ ఓ ఎమ్మెల్యేనే. నాపై, చంద్రబాబుపై విమర్శలు చేయొచ్చు.  కానీ రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లోని వాళ్లపై విమర్శలేమిటి? దోచుకున్న సొమ్ము ఇంట్లో చేర్చడంతప్ప.. మంచి పనులు చేశారా? అందరికీ తల్లులు, పెళ్లాలు, పిల్లలున్నారు. ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదు. స్పీకర్‌ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయన ఏకపక్షంగా సభని నడుపుతున్నారు.


రాష్ట్రం ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరూ చూస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా చేశారు. ఇప్పుడు ఏం జరుగుతోంది? మంచి సలహాలు ఇస్తే తీసుకోరు. ప్రతీదానికీ ఏదో ఓ వంక పెడతారు. ద్వంద్వార్థాలు తీస్తారు. వీరు మారరు. మారకపోతే.. మెడలు వంచి మారుస్తారు. ప్రజలు, అభిమానులు, పార్టీ నేతల తరపున ఇదే నా హెచ్చరిక. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఇక ఉపేక్షించేది లేదు. ఎవరు నోరు తెరిచినా సరే.. చూస్తూ ఊరుకోం. పదవులు శాశ్వతం కాదు. ఇప్పుడు మీరున్నారు. రేపు మేం ఉండొచ్చు. మెజారిటీ వచ్చిందని విర్రవీగి మాట్లాడితే సహించేది లేదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇదే నా హెచ్చరిక. మళ్లీ ఇలాంటి పరిణామాలు సంభవిస్తే ఒక్కొక్కరి భరతం పడతాం. ఖబడ్దార్‌! మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. మళ్లీ ఏదైనా మాట్లాడితే... అడ్డుగోడల్ని బద్దలు కొట్టుకుకొచ్చి గుణపాఠం చెబుతాం’’ అని బాలకృష్ణ హెచ్చరించారు. సభలో ఓ మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఆవేదనతో ప్రశ్నించారు. రాజకీయ విమర్శల్లోకి కుటుంబాలను లాగడం సరికాదని నందమూరి హరికృష్ణ కుమారుడు కల్యాణ్‌రామ్‌ అన్నారు. ‘‘అసెంబ్లీ లాంటి గొప్ప ప్రదేశం లో వ్యక్తిగతంగా మాట్లాడడం బాధాకరం. ఇది సరైన విధానం కాదు. అకారణంగా ఓ మహిళని అసెంబ్లీలో దూషించడం దురదృష్టకరం. హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నా’’నని కోరారు.


దరిద్రమైన సంప్రదాయమిది: నాగబాబు

‘‘ఈమధ్య జగన్‌ని కొంతమంది పరుష పదజాలంతో తిట్టారు. దానికి ఆయన బాధ పడ్డారు. దాన్ని నేనూ సమర్థించను. ఇప్పుడు చంద్రబాబు సతీమణి పై కొంతమంది వ్యక్తిగత దూషణలు చేశారు. ఇది కూడా బాధాకరమైన విషయం. లోకేశ్‌ని, చంద్రబాబుని విమర్శించండి. కుటుంబ సభ్యుల్ని దూషించడం దరిద్రమైన సంప్రదాయం. చంద్రబాబు  కళ్లలో నీళ్లు పెట్టుకోవడం బాధనిపించింది’’


ఇది ఇక్కడితో ఆగాలి: జూనియర్‌ ఎన్టీఆర్‌

‘‘రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలూ సర్వ సాధారణం. వ్యక్తిగత దూషణలు ఉండకూడదు. అసెంబ్లీలో జరిగిన సంఘటన నా మనసుని కలిచి వేసింది. వ్యక్తిగత దూషణలకు దిగితే అది అరాచక పాలనకు నాంది పలుకుతుంది. స్ర్తీ జాతిని గౌరవించడం మన సంప్రదాయం. ఈ మాటల్ని వ్యక్తిగత దూషణకుగురైన కుటుంబానికి చెందిన సభ్యుడిగానే మాట్లాడడంలేదు. ఒక కొడుకుగా, భర్తగా, తండ్రిగా, దేశ పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి’’.


పశువుల కంటే హీనం: నారా రోహిత్‌

‘‘అసెంబ్లీలో కొంతమంది సభ్యులు పశువుల కం టే హీనంగా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అసభ్య పదజాలంతో దాడి చేయడం దిగ్ర్భాంతికరం. నోటికొచ్చినట్టు మాట్లాడడం భావ్యం కాదు. చంద్రబాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అది భ్రమే అవుతుంది. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్టే, శుక్రవారం ఘటనలతో వీళ్ల వంద తప్పులూ పూర్తయ్యాయి’’


ఇది సరైన విధానం కాదు: కల్యాణ్‌రామ్‌

రాజకీయ విమర్శల్లోకి కుటుంబాలను లాగడం సరైన విధానం కాదని నందమూరి హరికృష్ణ కుమారుడు కల్యాణ్‌ రామ్‌ అన్నారు. ‘‘అసెంబ్లీలో  మేధావులు, విజ్ఞావంతులు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి, వ్యక్తిగతంగా మాట్లాడడం బాధాకరం. ఇది సరైన విధానం కాదు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం’’ అని కల్యాణ్‌రామ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-11-21T07:19:10+05:30 IST