ఇంటింటికీ వెళ్లలేం

ABN , First Publish Date - 2022-08-13T06:59:36+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ‘ఫ్యామిలీ ఫిజీషియన్‌’ కాన్సెప్ట్‌పై వైద్యులు తీవ్ర విముఖత వ్యక్తం చేస్తున్నారు.

ఇంటింటికీ వెళ్లలేం

‘ఫ్యామిలీ ఫిజీషియన్‌’ కాన్సెప్ట్‌పై వైద్యులు గరంగరం

అభివృద్ధి దేశాల్లో అమలు చేస్తున్న దానికి విరుద్ధం

రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తున్న విధానం తప్పు అని వాదన

అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి


విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ‘ఫ్యామిలీ ఫిజీషియన్‌’ కాన్సెప్ట్‌పై వైద్యులు తీవ్ర విముఖత వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని ఇక్కడ అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఈ నెల 15 నుంచి పైలట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని రెండు మండలాల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేసింది. ఇందులో ఒకటి విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలం. ఇప్పటికే వైద్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. మరికొద్దిరోజుల్లో ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్న తరుణంలో వైద్యులు అడ్డం తిరిగారు. తమ వల్ల కాదంటూ అధికారులకు ప్రతి జిల్లాలో వినతిపత్రాలను సమర్పిస్తున్నారు. శనివారం జిల్లాకు రానున్న ఇన్‌చార్జి మంత్రి, ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజనిని కూడా కలిసేందుకు వైద్యులు సిద్ధం అవుతున్నారు. 


అక్కడకూ, ఇక్కడకూ వ్యత్యాసం?

వైద్యుల కథనం ప్రకారం...అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌లో వేయి కుటుంబాలకు ఒక వైద్యుడిని నియమిస్తారు. సదరు వైద్యుడి వద్దకే రోగులు వచ్చి తమ సమస్యలను తెలియజేస్తుంటారు. తమ పరిధిలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం సదరు వైద్యుడి వద్ద ఉంటుంది. ఏదైనా అనారోగ్య సమస్య వల్ల స్పెషలిస్టు, సూపర్‌ స్పెషలిస్టు వైద్యుడి వద్దకు వెళ్లాల్సి వస్తే...ఫ్యామిలీ ఫిజీషియన్‌ రిఫరెన్స్‌ ఉండాలి. కాదు..సొంతంగా వెళ్లాలి అనుకుంటే వేలాది రూపాయలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తం సాధారణ ప్రజలు భరించలేనంత ఉంటుంది. ఏ  సమస్య అయినా ఫ్యామిలీ ఫిజీషియన్‌ వద్ద చూపించుకున్న తరువాతనే వైద్యుల వద్దకు వెళ్లేలా ఆయా దేశాల్లో కాన్సెప్ట్‌ ఉంటుంది. కానీ, అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ పేరు చెప్పి ఇంటింటికీ వైద్యులను వెళ్లమనడం ఎంతవరకు సమంజసమని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లిన సమయంలో రోగికి ఏదైనా జరిగితే అక్కడి కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పలేమని, హార్ట్‌ స్ర్టోక్‌, ఇతర తీవ్రమైన సమస్యలతో బాధపడే వారికి వైద్యం ఇళ్ల వద్దకు వెళ్లి అందించలేమని అంటున్నారు. కొన్ని దీర్ఘకాలిక రోగాలతో బాధపడే రోగుల ఇళ్లకు వెళ్లి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోమంటున్నారని, ఆ సమయంలో ప్రజలు వ్యవహరించే తీరు సరిగా లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఒక ఇంటికి వెళ్లిన తరువాత...తమ ఇంటికి ఎందుకు రారు అంటూ స్థానికంగా ప్రజలు గొడవ చేసే అవకాశముందని, ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. 104 వాహనంలో 70 రకాల మందులు మాత్రమే ఉంటాయని, ఇంటింటికీ వెళ్లేటప్పుడు ఆయా రోగులకు అవసరమైన మందులు ఇవ్వకపోతే వారి కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వుంటుందని వైద్యులు చెబుతున్నారు. వీటితోపాటు అనేక రకాల ఇబ్బందులున్నాయని, కాబట్టి ఈ విధానాన్ని నిలిపేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ప్రభుత్వ వైద్యులు సంఘ నాయకులు తెలిపారు. 


తర్జన..భర్జన.. 

వైద్యులు ఇచ్చిన వినతిపత్రంతో జిల్లా అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై ఏం చేయాలనే దానిపై ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్‌ ఆఫీసర్లు ఒకే మాటపై వున్నందున బలవంతంగా ముందుకువెళితే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-08-13T06:59:36+05:30 IST