గర్భనిరోధక మాత్రలకు బదులుగా వేర్వేరు ప్రత్యామ్నాయాలు.. అవేంటంటే?

ABN , First Publish Date - 2022-05-31T18:23:02+05:30 IST

కాంట్రాసెప్టివ్స్‌తో గర్భధారణను వాయిదా వేయడం తేలికే! అయితే తక్కువ దుష్ప్రభావాలతో ఎక్కుక కాలం మన్నే గర్భనిరోధక సాధనాన్ని ఎంచుకోవాలంటే, వైద్యుల సలహా

గర్భనిరోధక మాత్రలకు బదులుగా వేర్వేరు ప్రత్యామ్నాయాలు.. అవేంటంటే?

ఆంధ్రజ్యోతి(31-05-2022)

ఏ గర్భనిరోధక సాధనాలు?

కాంట్రాసెప్టివ్స్‌తో గర్భధారణను వాయిదా వేయడం తేలికే! అయితే తక్కువ దుష్ప్రభావాలతో ఎక్కుక కాలం మన్నే గర్భనిరోధక సాధనాన్ని ఎంచుకోవాలంటే, వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. అందుబాటులో ఉన్న వేర్వేరు కాంట్రాసెప్టివ్స్‌ పట్ల అవగాహన పెంచుకుని, అనువైన పద్ధతిని అనుసరించాలి. 


గర్భనిరోధక సాధనాలు అనగానే మనందరికీ మొదట గుర్తొచ్చేవి సర్వత్రా వాడుకలో ఉండే ‘ఓరల్‌ పిల్స్‌’. కొత్తగా పెళ్లైన యువతులు, అధిక రక్తపోటు, మధుమేహం, మైగ్రెయిన్‌ మొదలైన తేలికపాటి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, అవి లేవని తేలిన పక్షంలో, ఎటువంటి భయాలకు లోనవకుండా ఏకధాటిగా రెండేళ్ల పాటు వాడుకోదగిన సురక్షితమైన క్రాంట్రాసెప్టివ్స్‌ ఈ నోటి మాత్రలే! అయితే వీటిని క్రమం తప్పకుండా వాడుకోవాలి కాబట్టి పిల్స్‌ని మించిన, తేలికగా వాడుకోగలిగే వీలున్న మరేదైనా ప్రత్యామ్నాయం ఉంటే బావుండు అనిపిస్తుంది. నిజమే! నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మర్చిపోకుండా క్రమం తప్పకుండా పిల్స్‌ వాడుకోవడం కొంత కష్టమే! అందుకే గర్భనిరోధక మాత్రలకు తోడుగా ఇంజెక్షన్లు, వెజైనల్‌ రింగ్స్‌... ఇలా వేర్వేరు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకొచ్చాయి. ఆధునిక యువతులే లక్ష్యంగా తయారైన ఈ సౌకర్యవంతమైన గర్భనిరోధక సాధనాలు ఎవరు, ఎలా వాడుకోవచ్చో తెలుసుకునే ముందు ఇన్ని రకాల కాంట్రాసెప్టివ్స్‌ రూపొందించడం వెనకున్న కారణాలను తెలుసుకుందాం!


ఓరల్‌ పిల్స్‌ ఎవరికి?

గర్భనిరోధక సాధనాలన్నీ హార్మోన్లను ప్రభావితం చేసేవే! కాబట్టి కొన్ని ఆరోగ్య సమస్యలున్న వాళ్లు కొన్ని ఓరల్‌ కాంట్రాసెప్టివ్స్‌ వాడుకునే వీలుండదు. సాధారణంగా ఓరల్‌ పిల్స్‌ అంటే, ఏ మహిళైనా వాడుకోవచ్చు అనుకుంటాం. కానీ వీటిలో కంబైన్డ్‌ పిల్స్‌, ప్రొజెస్ట్రాన్‌ ఓన్లీ పిల్స్‌ (లో డోస్‌ పిల్స్‌) అనే రెండు రకాలుంటాయి. అధిక రక్తపోటు, మధుమేహం, మైగ్రెయిన్‌ మొదలైన ఆరోగ్య సమస్యలు లేని వాళ్లు కంబైన్డ్‌ పిల్స్‌ను వాడుకోవచ్చు. అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు లో డోస్‌ పిల్స్‌ను మాత్రమే వాడుకోవాలి. కాబట్టి ఇలాంటి ఓరల్‌ కాంట్రాసెప్టివ్స్‌ పద్ధతిని ఎంచుకునే ముందు బిపి, షుగర్‌ లాంటి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఇలా ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకుని, తమకు తగిన పిల్స్‌ను ఎంచుకోవడం ద్వారా దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. 


‘అంతర’తో గర్భానికి అంతరాయం

ఓరల్‌ పిల్స్‌ వాడడానికి ఇష్టపడని వాళ్లు, మైగ్రెయిన్‌, అధిక రక్తపోటు, మధుమేహం మొదలైన ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ల కోసం ‘అంతర’ అనే కాంట్రాసెప్టివ్‌ ఇంజెక్షన్లు అందుబాటులోకొచ్చాయి. వీటిని కొత్తగా పెళ్లైన వాళ్లతో పాటు, ప్రసవం తర్వాత రెండో బిడ్డకు ఎడం పాటించాలని అనుకునే తల్లులు కూడా తీసుకోవచ్చు. ప్రసవం అయిన వెంటనే ఓరల్‌ పిల్స్‌ వాడకూడదు కాబట్టి వైద్యులు కొత్త తల్లులకు ఈ ఇంజెక్షన్లను సూచిస్తారు. ఈ ఇంజెక్షన్‌ను మూడు నెలలకు ఒకసారి చొప్పున తీసుకుంటూ ఉండాలి. ఇలా అవసరాన్ని బట్టి రెండు నుంచి మూడేళ్ల వరకూ వీటి మీద ఆధారపడవచ్చు. ఈ ఇంజెక్షన్లతో ఉండే ఒకే ఒక దుష్ప్రభావం ఇంటర్‌ మెన్‌స్ట్రువల్‌ స్పాటింగ్‌. అలాగే ఇంజెక్షన్లు తీసుకుంటున్నంత కాలం నెలసరి కూడా రాదు. 


వెజైనల్‌ రింగ్స్‌

21 కంబైన్డ్‌ పిల్స్‌తో సమానమైన ప్రభావాన్ని కలిగి ఉండే ఈ వెజైనల్‌ రింగ్‌ను 21 రోజుల పాటు శరీరంలో ఉంచుకోవలసి ఉంటుంది. ఆ సమయం దాటిన తర్వాత వారం రోజుల గ్యాప్‌ తీసుకుని, పాత రింగ్‌ను తొలగించి, కొత్త రింగ్‌ను వాడుకోవాలి. దీని వాడకం గురించి మొదటిసారి వైద్యులు వివరించి చూపిస్తారు. కాబట్టి తర్వాత నుంచీ వీటి వాడకం తేలికవుతుంది. ఈ రింగ్‌తో మాత్రల వాడకంతో ఉండే తలతిరగడం లాంటి దుష్ప్రభావాలు ఉండవు. 


లూప్‌తో... సుదీర్ఘ ఉపశమనం

3, 5, 10 ఏళ్ల పాటు నిరాటంకంగా పని చేసే మూడు రకాల లూప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇతర గర్భనిరోధక సాధనాలను వాడలేని వాళ్లు దీన్ని ఎంచుకోవచ్చు. అయితే పెళ్లైన తొలినాళ్లలో కాంట్రాసెప్షన్‌లో భాగంగా వైద్యులు లూప్‌ను సూచించరు. అన్ని ప్రత్యామ్నాయాలూ పరీక్షించి, వాటితో అసౌకర్యానికి గురవుతున్న మహిళలకూ, పిల్లలు కలిగి ఉండీ, ఎటువంటి బాదరబందీ లేని గర్భనిరోధక సాధనాన్ని కోరుకునే మహిళలకు మాత్రమే వైద్యులు లూప్‌ను సూచిస్తారు. అయితే లూప్‌ వేయించుకున్న తర్వాత ఒకటి రెండు నెలల పాటు నెలసరిలో ఎక్కువ రక్తస్రావమయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి దాన్ని తగ్గించే మాత్రలను అదనంగా వాడుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత లూప్‌ వల్ల ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కావు.


ప్యాచెస్‌ అంటించుకోవచ్చు

ఇది చిట్టచివరి ఆప్షన్‌. చేతి పైన, తొడ ఎగువ భాగంలో చర్మం మీద అంటించుకునే ప్యాచెస్‌ ఇవి. వీటి నుంచి హార్మోన్‌ తక్కువ పరిమాణంలో శరీరంలోకి చేరుకుంటూ ఉంటుంది. కాబట్టి గర్భం దాల్చే అవకాశం ఉండదు. ఓరల్‌ పిల్స్‌ను ఇష్టపడని వాళ్లు ఈ ప్యాచె్‌సను ఎంచుకోవచ్చు. వీటిలో వారానికొకటి చొప్పున లేదా నెలకొకటి చొప్పున అంటించుకునే రెండు రకాల ప్యాచెస్‌ ఉంటాయి. ఇవి వాటర్‌ ప్రూఫ్‌ కాబట్టి స్నానంతో ఊడిపోతాయేమోననే భయం అవసరం లేదు. అయితే ప్యాచెస్‌ వేసుకున్నప్పటికీ నెలలో 15 రోజుల పాటు కంబైన్డ్‌ పిల్స్‌ కూడా వాడుకోవలసి ఉంటుంది. 


కండోమ్స్‌ సురక్షితమే!

స్పెర్మిసైడల్‌ సబ్‌స్టెన్స్‌ జోడించని, ప్లెయిన్‌ లేటెక్స్‌ కండోమ్స్‌ సురక్షితమైనవి, దృఢమైనవి. పైగా వీటితో అలర్జీ సమస్యలు కూడా ఉండవు. అయితే కండోమ్‌ వాడినా, గర్భం దాల్చడం జరిగితే, దాని తయారీలో కాకుండా వాడకంలోనే పొరపాటు జరిగినట్టు అర్థం చేసుకోవాలి. 


పిల్స్‌ సురక్షితం

పిల్స్‌తో తల తిరగడం, అసౌకర్యం లాంటి తేలికపాటి దుష్ప్రభావాలు సహజం. అయితే వీటి నుంచి తప్పించుకోలంటే, పిల్‌ను రాత్రి వేళ వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ ఓరల్‌ పిల్స్‌ను ఎలా వాడుకోవాలంటే...


కంబైన్డ్‌ పిల్స్‌: వీటిని వాడుకోడానికి కాల పరిమితి లేదు. ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, ఎటువంటి సమస్యలు లేవని తేలిన తర్వాత, రెండేళ్ల వరకూ ఈ ఓరల్‌ పిల్స్‌ను వాడుకోవచ్చు. కంబైన్డ్‌ పిల్స్‌ నెలకు 21 మాత్రల చొప్పున వాడుకోవాలి. అలాగే వీటిని నెలసరి మొదలైన మొదటి రోజు నుంచి రోజుకొకటి చొప్పున వాడుకోవడం మొదలుపెట్టాలి. ఈ మాత్రలన్నీ అయిపోయిన తర్వాత, ఒక వారం పాటు ఆపి, తిరిగి రెండో ప్యాక్‌ వాడడం మొదలుపెట్టాలి. 


ప్రొజెస్టరాన్‌ ఓన్లీ పిల్స్‌: వీటిని రోజుకొకటి చొప్పున నెల మొత్తం వాడుకోవాలి. ఏ రోజైనా మాత్ర వేసుకోవడం మర్చిపోతే, మరుసటి రోజు, రెండు మాత్రలు వేసుకోవలసి ఉంటుంది.


ఎమర్జెన్సీ పిల్స్‌

అన్‌ప్లాన్‌డ్‌ సెక్స్‌ సందర్భంలో ఈ ఎమర్జెన్సీ పిల్స్‌ కీలకంగా మారతాయి. శారీరకంగా కలిసిన 72గంటల లోపు ఈ పిల్‌ను వేసుకోగలిగితే, గర్భం ధరించే అవకాశం లేకుండా పోతుంది. అయితే ఈ ఎమర్జెన్సీ పిల్‌ రొటీన్‌ పిల్‌ కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వీటిని తరచుగా వాడడం వల్ల నెలసరి అస్తవ్యస్థం అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ఎమర్జెన్సీ పిల్‌ను అత్యవసర సమయాల్లోనే వాడుకోవాలి. గర్భం ధరించి అబార్షన్‌తో ఆరోగ్యాలు కుదేలు చేసుకునే బదులు ఎమర్జెన్సీ పిల్‌తో ఆ దుస్థితి నుంచి తప్పించుకునే వీలు కల్పించడమే లక్ష్యంగా ఈ పిల్స్‌ తయారయ్యాయి. కాబట్టి వీటిని యువతులు బాధ్యతగా వాడుకోవాలి. 


డాక్టర్‌ మహిత రెడ్డి. 

ఎ, ప్రొఫెసర్‌,ఉస్మానియా మెడికల్‌ కాలేజి,

నీలోఫర్‌ హాస్పిటల్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2022-05-31T18:23:02+05:30 IST